ఎన్డీఏలో టీడీపీ చేరుతుందని, రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వుంటుందని ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీతో పాటు దాని అనుకూల మీడియా చేస్తున్న ప్రచారానికి తెరపడింది. అంత సీన్ లేదని బీజేపీ తేల్చి చెప్పింది. ఇవాళ హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.
బీజేపీ, టీడీపీ పొత్తుపై స్పష్టత ఇచ్చారు. ఇలాంటివి కేవలం వార్తలకే పరిమితమన్నారు. టీడీపీతో పొత్తుపై ఎలాంటి చర్చలు జరగడం లేదని తేల్చి చెప్పారు. అలాంటిది ఏమైనా వుంటే మీడియాకు చెబుతామని ముక్తాయింపు ఇచ్చారు. దీంతో టీడీపీకి గట్టి షాక్ ఇచ్చినట్టైంది. బీజేపీతో పొత్తు వుంటుందని ఉత్తుత్తి ప్రచారం చేసుకుంటూ టీడీపీ అభాసుపాలవుతోంది. వారసత్వ పార్టీలతో పొత్తు ప్రసక్తే వుండదని ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
అయినప్పటికీ టీడీపీకి ఆశ చావలేదు. జగన్ను ఎదుర్కోవడం తన ఒక్కడి వల్ల కాదని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. తాజాగా బీజేపీ వైఖరి స్పష్టమైన నేపథ్యంలో ఇక ఎలాంటి ప్రచారానికి తెరలేపాలో టీడీపీ, ఎల్లో మీడియా కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది.
కనీసం టీడీపీని బీజేపీ పట్టించుకుంటున్న పాపాన పోలేదు. కానీ టీడీపీ మాత్రం పొత్తు… పొత్తు అంటూ బీజేపీ వెంటపడుతోంది. బీజేపీ మాత్రం వద్దు పొమ్మంటోందని తాజాగా లక్ష్మణ్ వ్యాఖ్యలే నిదర్శనం. దీన్ని టీడీపీ ఎలా రిసీవ్ చేసుకుంటుందన్నది ఆసక్తికర పరిణామం.