గుంటూరు జిల్లాలో ఓ మంత్రికి స్థానచలనం తప్పదా? అంటే…ఔననే సమాధానం వస్తోంది. జగన్ కేబినెట్‌లో రెండో దశలో మంత్రి పదవి దక్కించుకున్న ఆ ప్రజాప్రతినిధిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. దీంతో ఆయన్ను అక్కడి నుంచి తప్పించి, మరో చోటుకు మార్చాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం.
ఇటీవల గుంటూరు జిల్లాలో కొన్ని ముఖ్యమైన చేరికలు జరిగాయి. దీంతో రాజకీయ సమీకరణలు తప్పని సరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తోంది. ప్రధానంగా టీడీపీ నుంచి లోకేశ్ ఓడిపోయిన నియోజకవర్గం నుంచే మళ్లీ పోటీ చేయనున్నారు. దీంతో ఆ నియోజక వర్గంపై అధికార పార్టీ దృష్టి సారించింది. ఈ దఫా రాజధాని మార్పు, ప్రభుత్వ వ్యతిరేకత తదితర అంశాలు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కొంత అనుకూల వాతావరణం సృష్టించింది.
ముందే పసిగట్టిన సీఎం వైఎస్ జగన్ అందుకు తగ్గట్టుగా వ్యూహ రచన చేస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెబుతున్నట్టుగా ఆయన మరోసారి బరిలో వుంటారు. అయితే ఎక్కడ? అనేది ఎన్నికల వరకూ వేచి చూడాల్సి వుంటుంది. వైఎస్ జగన్ అనూహ్య మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డికి సౌమ్యుడిగా, మంచి నాయకుడిగా గుర్తింపు వుంది.
ఆళ్లను జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేరు. ఇదే సందర్భంలో గుంటూరు జిల్లాకు చెందిన తన కేబినెట్ మంత్రిపై తీవ్ర వ్యతిరేకత ఉండడాన్ని జగన్ గ్రహించారు. దీంతో అక్కడికి ఆళ్లను పంపి, అక్కడున్న మంత్రిని మరో ప్రాంతానికి మార్చే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకునే జగన్ మార్పుచేర్పులకు శ్రీకారం చుట్టారనేది వాస్తవం. సదరు మంత్రి కూడా అక్కడికి వలస వెళ్లిన నాయకుడే.
ముఖ్యంగా సదరు మంత్రి గారు జగన్ సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. రోజూ జగన్ కోసం ప్రెస్‌మీట్లలో ఆ మంత్రి మాట్లాడుతూ వుంటారు. అలాంటి మంత్రికి టికెట్ ఇస్తే …అంతే సంగతులని సొంత పార్టీ నేతలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సర్వే నివేదికలు కూడా అదే విషయాన్ని చెబుతుండడంతో జగన్ కూడా సీరియస్‌గా ఆలోచిస్తున్నారని తెలిసిందే. ఏది ఏమైనా రానున్న రోజుల్లో వైసీపీలో అనూహ్య మార్పుచేర్పులు జరగనున్నాయి.