ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీ వైసీపీ గడపగడపకూ మన ప్రభుత్వం పేరుతో చాలా ముందుగానే జనాల్లోకి వెళ్ళింది. మరి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయ్? ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బాదుడేబాదుడు, మహానాడు, మినీమహానాడు పేర్లతో జనంలోకి వెళుతున్నారు. అయితే ఇవి రోజువారీ కార్యక్రమాలు కావు. వారానికో, రెండు వారాలకో నిర్వహిస్తున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే, నిర్మాణాత్మకంగా ఏ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు.
ఇటీవల పర్చూర్‌లో కౌలు రైతులకు ఆర్థిక సాయం అందించడంలో భాగంగా బహిరంగ సభ నిర్వహించారు. దసరా తర్వాత అధికార పార్టీ అంతు చూస్తానని హెచ్చరించారు. అంటే జనసేన కార్యకలాపాలకు దసరా వరకూ సెలవులు ప్రకటించినట్టేనా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం మేరకు మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులంతా గడప గడపకూ వెళ్లక తప్పడం లేదు.
ప్రజాసమస్యలపై కొన్ని చోట్ల నిలదీతలు ఎదురవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఇలాంటివి ఎక్కడైనా, ఎప్పుడైనా వుండేవే. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ముందుగానే జనంలోకి వెళ్లడం వల్ల, లోటుపాట్లను గుర్తించి సరిచేసుకునే అవకాశం దక్కిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు చాలా చోట్ల రోడ్లు వేయాలనే డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నట్టు సీఎం జగన్ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేయాలని, ఎక్కడా గోతులు ఉండకూడదనే ఆదేశాలు సీఎం నుంచి వెళ్లాయి. ఇది ముమ్మాటికీ గడపగడపకూ మన ప్రభుత్వం తీసుకొచ్చిన పెద్ద మార్పుగా పరిగణించొచ్చు. ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా ఎమ్మెల్యేలుగా తమ విన్నపాలపై జగన్ స్పందించకపోయినా, కనీసం ప్రజల డిమాండ్లను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ విషయానికి వస్తే… చంద్రబాబు మినహా ఆ పార్టీ నేతలెవరూ జనం వద్దకు వెళ్లడం లేదు. చంద్రబాబు కూడా బహిరంగ సభల వరకే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇప్పుడు ఎన్నికలు జరిగినా 160 సీట్లు వస్తాయని టీడీపీ నమ్ముతుంటే, ఆ పార్టీ నేతలెవరూ జనం వద్దకు ఎందుకు వెళ్లడం లేదో అర్థం కాదు. గడపగడపకూ వెళుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్ని నిలదీస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.
అయినప్పటికీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జనంలోకి వెళుతూనే వున్నారు. మరి సానుకూలత ఉన్న పార్టీ జనంలోకి ఎందుకు వెళ్లడం లేదంటే ఏం సమాధానం చెబుతారు. జనసేన మాత్రం గెస్ట్ పాత్ర పోషించడానికే ఇష్టపడుతున్నట్టు, ఆ పార్టీ రాజకీయ పంథా తెలియజేస్తోంది. జగన్‌పై వ్యతిరేకతే తమకు అధికారం కట్టబెడుతుందనే భ్రమలో ప్రధాన ప్రతిపక్షం వుందనే విమర్శలున్నాయి. గడప దాటకుండా అధికారం ఎలా? అనే ప్రశ్నకు మాత్రం వారి వద్ద సమాధానం కరువవుతోంది.