ఒకప్పుడు లారీల ట్రాన్స్‌పోర్ట్ అంతా బ్రోకర్ ఆఫీస్‌ల సాయంతో నడిచేది. ప్రపంచమంతా సెల్‌ఫోన్‌లోకి వచ్చేసినట్టే లారీలు కూడా డిజిటల్‌లో భాగమయ్యాయి. అయితే మనది చాలా పెద్ద దేశం. లారీ ఓనర్లు, డ్రైవర్లు ఎక్కువ మంది చదువులేని వాళ్లు, స్మార్ట్ ఫోన్ వాడడం తెలియని వాళ్లు. అందుకే నెమ్మదిగా వుంది. కానీ వచ్చే రెండుమూడేళ్లలో లారీల బుకింగ్ మొత్తం యాప్‌ల్లోకి వచ్చేస్తుంది.
దీని వల్ల బ్రోకర్ ఉద్యోగాలు పోలేదు. వాళ్ల పని మరింత సులువైంది. బ్లాక్ బక్ యాప్ డౌన్‌లౌడ్ చేసుకుంటే ఓనర్‌కి బ్రోకర్ల జాబితా. బ్రోకర్లకి ఓనర్ల జాబితా రెడీగా వుంటుంది. దాంతో ట్రక్కులు గిరాకీ కోసం రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితి తప్పింది. ఆదాయం కూడా పెరిగింది.
2005 వరకూ ఏం జరిగేదంటే… దూర ప్రాంత రవాణా రైళ్లలో జరిగేది. కారణం రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం. ఈ 17 ఏళ్లలో ఫోర్‌లైన్ రోడ్లు వచ్చేశాయి. రైలు రవాణాకి టైం ఎక్కువ పడుతుంది. ట్రక్కులు వేగంగా చేరుతాయి. దాంతో రోడ్డు రవాణా పుంజుకుంది. ఈ రంగంలో రెండు కోట్ల మంది పని చేస్తున్నారు. కోటికి పైగా రవాణా వాహనాలున్నాయి. వచ్చే ఐదేళ్లలో రోడ్డు రవాణాకి మరింత డిమాండ్ పెరుగుతుంది.
విదేశాల్లో ఈ వ్యాపారం కార్పొరేట్ స్థాయికి వెళ్లిపోయింది. ఇక్కడ ఇంకా సాంప్రదాయిక పద్ధతిలోనే వుంది. ప్రతి 10 ట్రక్కుల్లో 8 చిన్న వ్యాపారుల చేతుల్లోనే వున్నాయి. వీళ్లంతా ఎక్కువగా స్థానిక రవాణా మీద ఆధారపడి వున్నారు. డిజిటల్ వల్ల పని సులువవుతుంది నిజమే కానీ, అది చిన్న వ్యాపారుల్ని తినేస్తుంది. అన్ని రంగాల్లో వచ్చినట్టే ఇక్కడ కూడా ట్రక్కు యజమానులు పెద్ద కంపెనీల కింద కూలివాళ్లగా మారిపోతారు. మనది పెద్ద దేశం కాబట్టి ఇంకా టైం పడుతుంది.
ఇప్పుడైతే యజమానులు కంపర్ట్‌గానే ఉన్నారు. గతంలోలా డ్రైవర్లని నమ్మి మోసపోయే స్థితి లేదు. పెట్రో కార్డులతో ఆయిల్ వేయించుకుంటున్నారు. ఫాస్ట్‌టాగ్ రావడంతో డ్రైవర్లు టోల్‌ఫీజు పేరుతో ఎక్కువ డబ్బులు తీసుకోలేరు. రిపేర్లు వస్తే వీడియో కాల్ ద్వారా చూడొచ్చు. ట్రాకింగ్‌తో వాహనం ఎక్కడున్నా కనిపెట్ట వచ్చు.
అన్ని రంగాల్లో యాప్స్ వచ్చేశాయి. మనకి సర్వీస్ సులభంగా అందిస్తున్నాయి. కంటికి కనపడకుండా ఏం జరుగుతోందంటే పెద్ద చేపలు చిన్న చేపల్ని తినేస్తున్నాయి. ఓలా, ఉబర్‌లతో ట్రాన్స్‌పోర్టు కంపెనీలు మాయమైనట్టు మార్పుని అర్థం చేసుకోలేని వాళ్లంతా మాయమైపోతారు.