సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వ చర్యల్ని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మరోసారి తప్పు పట్టారు. ఎమ్మెల్యే భద్రతతో చెలగాటం ఆడడాన్ని ఎవరూ సమర్థించరు. రాజకీయపరమైన అంశాల్లో విమర్శలు, ప్రతివిమర్శలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ భద్రత పెంచాలని కోరడమే నేరమైనట్టు పయ్యావులకు అకస్మాత్తుగా గన్‌మెన్లను మార్చడం కొంత కాలంగా వివాదాస్పదంగా మారింది.
ఈ నేపథ్యంలో పయ్యావుల కేశవ్ కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్టు ఎక్కువ ఊహించుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి తానేదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు, దాని వల్లే భద్రత తగ్గించినట్టు ఆయన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా పయ్యావుల తాజా జోక్ ఏమంటే…పోరాటాల్లో తాను పుట్టిపెరిగానని చెప్పడం. పోరాటాల్లో రాటుతేలిన తాను బెదిరింపులకు భయపడనని హెచ్చరించడం నవ్వు తెప్పిస్తోంది.
అనంతపురం జిల్లా ఉరవకొండలో పయ్యావుల కేశవ్‌ది భూస్వామ్య కుటుంబం. ఆయన కుటుంబ ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో వైరం నడుస్తోంది. విశ్వేశ్వరరెడ్డి కుటుంబానికి వామపక్ష ఉద్యమ నేపథ్యం ఉంది. పయ్యావుల కేశవ్ కుటుంబ భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా విశ్వేశ్వరరెడ్డి కుటుంబం పోరాడింది. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి కుటుంబం ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకుంది.
పయ్యావుల కుటుంబ వేధింపులు ఎవరికీ తెలియదని ఆయన పోరాటాల గురించి మాట్లాడ్డం విడ్డూరంగా ఉంది. పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ తన భద్రతకు భంగం వాటిల్లేలా ప్రభుత్వం కావాలనే వ్యవహరిస్తోందని విమర్శించారు. నక్సలైట్లతో ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబం తమదన్నారు. తన నియోజక వర్గంలో మాజీ మిలిటెంట్ల కదలికలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తాను వెలుగులోకి తెస్తున్న విషయాలు, రాసిన లేఖలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయేమో? అని అనుమానం వ్యక్తం చేశారు. భద్రతపై ఆందోళన వరకూ ఓకే. పోరాట నేపథ్యం వుంటే నక్సలైట్లు ఎందుకు టార్గెట్ చేస్తారనే ప్రశ్నకు సమాధానం ఏంటి? సమస్యను వదిలేసి ఇతరేతర అంశాలు మాట్లాడితేనే లేనిపోని చిక్కులని పయ్యావుల గ్రహిస్తే మంచిది.