తెలంగాణ కాంగ్రెస్‌లో ఓ ఆడియో కలకలం రేపుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడుకు ఉప ఎన్నిక రానుంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికను టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
సిట్టింగ్ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలనే పట్టుదలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉన్నారు. గెలిచి తెలంగాణలో మరోసారి తమదే అధికారమని నిరూపించుకోవాలనే ఉత్సాహంలో టీఆర్ఎస్ నేతలున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే తామే అధికారంలోకి రానున్నామని మునుగోడు గెలుపు ద్వారా సంకేతాలు ఇవ్వడానికి బీజేపీ సమరోత్సాహంతో ఉంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో టికెట్ ఆశావహులు పెరిగారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె స్రవంతి కాంగ్రెస్ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్తతో ఆమె ఫోన్ సంభాషణ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏమున్నదంటే … చండూరు సభ తన వల్లే సక్సెస్ అయ్యిందని ఆమె అన్నారు.
అలాగే చలమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవాలా? వద్దా? అని ఆమె ప్రశ్నించారు. మరి ఆయనకు ఎన్ని ఓట్లు పడతాయని స్రవంతి ప్రశ్నించారు.
ఒకవేళ కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే హుజూరాబాద్ సీన్ రిపీట్ కావడం ఖాయమని ఆమె హెచ్చరించారు. ఓడిపోయే వారికి టికెట్ ఇచ్చి రేవంత్ రెడ్డి పరువు తీసుకుంటారా? అని స్రవంతి ప్రశ్నించడం గమనార్హం. గెలిచే వారికే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని ఆమె అన్నారు. ఇదిలా వుండగా ఏఐసీసీ సెక్రటరీ బోస్‌రాజు ఆధ్వర్యంలో బుధవారం మనుగోడు అభ్యర్థి ఎంపికపై గాంధీ భవన్‌లో సమావేశం జరగనున్న సమయంలో ఈ ఆడియో బయటికి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
అందులో ముక్కు, మొహం తెలియని కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే ఊరుకోనని స్రవంతి హెచ్చరించడాన్ని పార్టీ ఎలా తీసుకుంటుందో మరి!