సింహంలా మీడియా ఎదుట గర్జించే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని, అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో చూస్తే, ఎవరికైనా మనసు చివుక్కుమంటుంది. సీఎం జగన్ మొదలుకుని, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ… ఇలా పెద్దాచిన్నా అనే తారతమ్యం లేకుండా తిట్టుకు తిట్టు, దెబ్బకు దెబ్బ అన్నట్టుగా కొడాలి మీడియా ఎదుట గట్టిగా కేకలేస్తూ సవాళ్లు విసిరేవారు. ఆ పట్టాభినేనా… ఇవాళ గన్నవరం కోర్టు ఎదుట మౌనంగా దండం పెడుతూ వెళ్లేదని ఎవరికైనా అనుమానం వస్తుంది.
అరచేతులు, ఇతరత్రా ఎర్రగా కందిపోయి ఉండడాన్ని పట్టాభి పోలీస్ వాహనం నుంచి ప్రదర్శించారు. గన్నవరం కోర్టులో హాజరుపరిచేందుకు ఆయన్ను పోలీస్ వాహనంలో తీసుకొచ్చారు. తన ఎల్లో మీడియాను, తెలుగు తమ్ముళ్లను చూడగానే పట్టాభికి ధైర్యం వచ్చింది. దీంతో చేతులు గాల్లోకి లేచాయి. ప్రత్యర్థులను కొట్టడానికి కాదు సుమా! తనను పోలీసులు చితక్కొట్టారంటూ గాయాలను చూపడం విశేషం.
గతంలో ఇలాగే సరిగ్గా సాయంకాలం వేళ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకొచ్చారు. ఆ రాత్రి తన జీవితంలో కాళరాత్రి అని అనేక సందర్భాల్లో రఘురామకృష్ణంరాజు వాపోయిన సంగతి తెలిసిందే. ఈ రాత్రికి బతికి బట్ట కడితే చాలు అని మనసులో దేవుళ్లందరినీ రఘురామ ప్రార్థించుకున్నారు. అప్పట్లో రఘురామను తెల్లారి కోర్టులో హాజరు పరిచారు. అప్పట్లో ఆయన కనీసం నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. తనను కొట్టిన వారికి శిక్ష విధించేందుకు ఆయన ఇప్పటికీ అలుపెరగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా పట్టాభిని చూస్తుంటే… రఘురామ ఎపిసోడే గుర్తు కొస్తోంది. రఘురామ కంటే ఈయన్ను ఇంకొంచెం ఎక్కువ సమయం పోలీసులు తమ అదుపులో పెట్టుకున్నారు. నిన్న సాయంత్రం ఆరు గంటలకు పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 20 గంటల పాటు పోలీసులు తమ అదుపులో ఆయన్ను పెట్టుకున్నారు. చివరాఖరుకు కోర్టుకు తీసుకొచ్చారు. పోలీస్ వాహనం నుంచి నెమ్మదిగా దిగారు.
ఆయన నోటి నుంచి మాట లేదు. కేవలం తనను కొట్టారని చెప్పేందుకు సంకేతంగా గాయాలను చూపారు. అసలు పట్టాభి చేసిన పాపం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యర్థులు తమను తిట్టడాన్ని తిప్పి కొట్టడానికి, అదే రీతిలో పట్టాభి జవాబు ఇవ్వడమే నేరమా? అని నిలదీస్తున్నారు. ఆ మాత్రం దానికి చేతులు, కాళ్లు, వీపు విమానం మోగేలా చావబాదే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. పట్టాభి తన భావప్రకటనా స్వేచ్ఛను అనుసరించి ప్రత్యర్థులపై ఏదో రెండు తిట్లు తిట్టారని, అదే ప్రతిపక్షాల హక్కు అని నినదిస్తున్నారు.
ఏపీ సీఐడీ, ఏపీ పోలీసుల లాఠీ దెబ్బలకు స్పష్టమైన తేడా కనిపిస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. గతంలో ఏపీ సీఐడీ పోలీసులు కొట్టిన దెబ్బలకు రఘురామ కొన్ని నెలల పాటు అడుగులు ముందుకు వేయలేకపోయారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పట్టాభికి అంత సమస్య లేదని, కానీ కొట్టడాన్ని చట్టం అంగీకరించదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పట్టాభిపై భౌతికదాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. ఇందులో రెండో మాటకే తావులేదు.
పట్టాభిని గతంలో మాదిరిగా కోర్టులో హాజరుపరిస్తే, ఏం చేయాలో అక్కడే నిర్ణయం జరిగేదని, పోలీసులు చట్టాన్ని చేతల్లోకి తీసుకోవడం ఏంటని టీడీపీ నేతలు బలంగా వాదిస్తున్నారు. ఒళ్లంతా వాచిపోయేలా కొట్టడానికి పోలీసులకు చేతులు, మనసు ఎలా వచ్చాయో అని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేగా మరి!