గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఎంత ప్రేమ వుందో ఇవాళ్టి వీడ్కోలు సభ ద్వారా తెలిసొచ్చింది. దేశ వ్యాప్తంగా బీజేపీ కాకుండా ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లోని పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఏపీలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం.
ఇటీవల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చత్తీస్‌గఢ్‌కు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్‌కు విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు పలికారు. గవర్నర్‌ను సీఎం ఘనంగా సత్కరించారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తూ గవర్నర్‌పై తన అవ్యాజమైన ప్రేమను ప్రదర్శించారు.
ఒక తండ్రిలా, రాష్ట్ర కుటుంబ పెద్దలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అండగా నిలిచారని కొనియాడారు. గవర్నర్‌తో తీపి జ్ఞాపకాలను ఎప్పటికీ మరువలేనని ఆయన అన్నారు. గవర్నర్ వ్యవస్థకు బిశ్వభూషణ్ హరిచందన్ నిండుదనం తీసుకొచ్చారని ప్రశంసలతో ముంచెత్తారు.
హరిచందన్ ఉన్నత విద్యావేత్త అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయాన్ని ఆచరణలో చూపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరించారని కృతజ్ఞత చాటుకున్నారు. నిండు నూరేళ్లు జీవించాలని జగన్ ఆకాంక్షించారు.
గవర్నర్ మాట్టాడుతూ సీఎం జగన్ చూపిన గౌరవం, ఆప్యాయత మరువలేనివని అభిమానాన్ని చాటుకున్నారు. ఏపీని విడిచి వెళ్లడం బాధగా ఉందన్నారు. జగన్ చాలా బాగా పని చేస్తున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ తనకు రెండో కుటుంబం అని, జీవితాంతం గుర్తించుకుంటానని గవర్నర్ అన్నారు. ఇలా ఒకరికొకరు అభిమానంతో మాట్లాడుకోవడం ఆకట్టుకుంది. ఎలాంటి విభేదాలకు చోటు లేకుండా గవర్నర్ తన పదవీ కాలంలో కొనసాగారు.