వార్తలు అందించడం తెలిసిన వాడికి, వార్తలు ఎలా తయారు చేయాలో పెద్దగా చెప్పనక్కరలేదుగా, టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కు ఈ విద్య ఇంకా బాగా తెలుసు. అందుకే చిన్న విషయానికి కాస్త పెద్ద హడావుడే చేసారు.
విషయం ఏమిటంటే, ఈ రోజు ఉదయం టీవీ9 ఆఫీసుకు రవిప్రకాష్ వచ్చారు. వచ్చిన రెండు నిమషాలకే రిసెప్షన్ లో పలకరించి, లిఫ్ట్ ఎక్కి మీదకు వెళ్లిపోయారు. కానీ ఆ మరుక్షణం లోనే ఆ వీడియో బయటకు వచ్చింది. మళ్లీ తన పనులు అయ్యాక రవిప్రకాష్ కిందకు వచ్చారు. అప్పటికే అక్కడ వున్న మీడియా జనాలు ఆయనను పలకరించారు.
తను టీవీ9 లో భాగస్వామిని అని, తనతో పాటు మైహోమ్, మెగా, ఇంకా మూర్తి అనే మరో వ్యక్తి కూడా భాగస్వాములు అని, అక్కౌంట్స్ పరిశీలించడానికి వచ్చానని చెప్పి మరీ రవిప్రకాష్ కారు ఎక్కి వెళ్లిపోయారు.
నిజానికి అలా చెప్పకుండా కూడా రవిప్రకాష్ వెళ్లిపోవచ్చు. లేదా కంపెనీలో పని వుండి వచ్చా అని చెప్పి కూడా వెళ్లొచ్చు. అలా కాకుండా తనకు అందులో వాటా వుందని (అది పదిశాతం అని తెలుస్తోంది) అక్కౌంట్స్ చూడడానికి వచ్చానని చెప్పడం వెళ్లడం అన్నది రవిప్రకాష్ వార్తల సృజన నైపుణ్యానికి ఉదాహరణ.
ఎందుకంటే రవిప్రకాష్ లోపలికి వెళ్లి బోర్డ్ మీటింగ్ పనులు చూసుకుని తిరిగి వచ్చేలోగా అక్కడ మీడియా వుండేలా కొందరు ఏర్పాట్లు చేసారని తెలుస్తోంది. వివిధ చానెళ్లు, మీడియా సంస్థలకు మెసేజ్ లు పెట్టి అక్కడకు రప్పించారని భోగట్టా. అంటే తను ఎలాగూ టీవీ9 లో సమావేశానికి వెళ్తున్నాను కదా, పనిలో పని లైమ్ లైట్ లో వున్నట్లు వుంటుంది, కవరేజ్ వుంటుందని రవిప్రకాష్ ఈ ప్లాన్ చేసారు అనుకోవాల్సి వస్తోంది.
ప్రస్తుతం రవిప్రకాష్ ఆర్ ఛానెల్ అనే కొత్త శాటిలైట్ చానెల్ పెట్టే పనిలో బిజీగా వున్నారని తెలుస్తోంది.
అబద్దం చెప్పారా?
అక్కౌంట్స్ చెకింగ్ కు వచ్చానని రవిప్రకాష్ బాహాటంగా చెప్పారు. కానీ టీవీ9 అధికార వర్గాల ద్వారా తెలిస్తున్నది ఏమిటంటే అలాంటిది ఏదీ లేదని. కంపెనీలో 97 శాతం వాటా ఒకే సంస్థది అని, మిగిలిన మూడుశాతం వాటా మిగిలిన వారిది అని, అలాంటి వారిలో రవిప్రకాష్ ఒకరు అని వెల్లడించారు. కంపెనీ ఈజిఎమ్ సమావేశం మార్చి 2న ఏర్పాటు చేసినట్లు ఈ నెల 6న నోటీసు ఇచ్చామన్నది వివరణ. మైనర్ షేర్ హోల్డర్ కావడం వల్ల అక్కౌంట్స్ తనిఖీ అనే వ్యవహారం తలెత్తదని, జస్ట్ డాక్యుమెంట్లు చూసుకోవడం తప్ప వేరు కాదని టీవీ 9 అధికార వర్గాలు వివరించాయి, మరి ఈ లెక్కన చూస్తే రవిప్రకాష్ అబద్దం చెప్పారా? అన్న అనుమానం కలుగుతోంది.