కాపుల‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్న ప‌వ‌న్‌

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుప‌డ్డారు. రెండు రోజుల క్రితం అకాల వ‌ర్షాల‌కు న‌ష్ట‌పోయిన రైతుల ప‌రామ‌ర్శ పేరుతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏపీలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై త‌న స‌హ‌జ‌రీతిలో ప‌వ‌న్…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుప‌డ్డారు. రెండు రోజుల క్రితం అకాల వ‌ర్షాల‌కు న‌ష్ట‌పోయిన రైతుల ప‌రామ‌ర్శ పేరుతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏపీలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై త‌న స‌హ‌జ‌రీతిలో ప‌వ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌న‌ని మొహం మీదే చెప్పిన జ‌గన్‌కు 60 శాతం కాపులు ఓట్లు వేశార‌ని ప‌వ‌న్ వాపోయారు. త‌న‌కు ఎందుకు అండ‌గా నిల‌బ‌డ‌ర‌ని ప్ర‌జ‌ల్ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు దిమ్మ తిరిగేలా పేర్ని నాని స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో పేర్ని నాని మాట్లాడారు. రైతుల ప‌రామ‌ర్శ పేరుతో చంద్ర‌బాబుకు ఉప‌యోగ‌ప‌డేలా ప‌వ‌న్ రాజ‌కీయం చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. బాబు కోసమే జ‌న‌సేన పార్టీని పెట్టాడంటూ మ‌రోసారి ప‌వ‌న్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ఆరు నెలలకు ఒకసారి పవన్ రోడ్డుపైకి వస్తున్నాడని దెప్పి పొడిచారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో కూడా పవన్ ఇట్లే విమర్శించాడ‌ని గుర్తు చేశారు.

కేవ‌లం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసేందుకే ప‌వ‌న్‌క‌ల్యాణ్ రోడ్డుపైకి వ‌స్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌నం కోసం ప‌ట్టుమ‌డి ప‌ది రోజులు ఎప్పుడైనా ప‌నిచేశావా? అని ప‌వ‌న్‌ను ఆయ‌న నిల‌దీశారు. కాపుల‌ను బీసీల్లో చేరుస్తామ‌ని 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ప్పుడు చంద్ర‌బాబు హామీ ఇచ్చి, ఆ త‌ర్వాత మోసం చేశాడ‌ని మండిప‌డ్డారు. నాడు కాపుల‌కు ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌కుండా చంద్ర‌బాబు మోసిగిస్తుంటే ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని ప‌వ‌న్‌ను నిల‌దీశారు. కాపుల రిజ‌ర్వేష‌న్ కోసం పోరాడిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కుటుంబాన్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం హింసించడాన్ని పేర్ని నాని గుర్తు చేశారు. అప్పుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ నోటికి తాళం వేసుకున్నాడ‌ని విరుచుకుప‌డ్డారు.

కాపుల‌ను జ‌గ‌న్ మోస‌గించార‌నే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై నాని తీవ్ర‌స్థాయిలో రియాక్ట్ అయ్యారు. చంద్రబాబులా కాపులను మోసం చేయనని జగన్ ముందే చెప్పార‌న్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే రిజర్వేషన్లు ఉంటాయని నిజాయితీగా జ‌గ‌న్ చెప్పార‌ని గుర్తు చేశారు.  కాపులను దగా చేసింది చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాదా? అని ఆయ‌న నిల‌దీశారు. కాపులను పవన్ కల్యాణ్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడ‌ని ఆరోపించడం గ‌మ‌నార్హం. భీమ్లానాయ‌క్ సినిమాకు ఆంధ్రాలో 30 కోట్ల రూపాయ‌లు న‌ష్ట వ‌చ్చింద‌ని ప‌వ‌న్ వాపోవ‌డంపై నాని చుర‌క‌లు అంటించారు.

సినిమా బాగుంటేనే జనం చూస్తార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. రూ.100 కోట్లు దాటిన పవన్ కల్యాణ్ సినిమా ఏదైనా ఉందా? రూ.100 కోట్ల మార్కెట్టే లేనప్పడు రూ.30కోట్ల నష్టం ఎలా వస్తుంది? అని ఆయ‌న నిల‌దీశారు. డబ్బింగ్, కాపీ సినిమాలు తీస్తే ఎవరు చూస్తారు? అని ప్ర‌శ్నించారు. రాజకీయాల్లో కుల ప్రస్తావన తెచ్చిందే పవన్ కల్యాణ్ అని చీవాట్లు పెట్టారు. అస‌లు కుల ప్రస్తావన లేకుండా ఒక్కరోజైనా మాట్లాడారా? అని ప్ర‌శ్నించారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఒకటే అని తాము చాలా కాలంగా చెబుతున్నామ‌న్నారు.