జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఆ పార్టీ తిరుపతి కమిటీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తిరుపతిలో పోటీ చేయాలని జనసేన తిరుపతి నూతన కమిటీ తీర్మానం చేసింది. తిరుపతి నుంచి పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని నూతన కమిటీ హామీ ఇవ్వడం విశేషం. ఇవాళ జనసేన తిరుపతి నగర కమిటీ బాధ్యతలు స్వీకరించింది.
2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తిరుపతి జనసేన నాయకులు కీలక తీర్మానం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తిరుపతిలో పవన్‌కల్యాణ్ సామాజిక వర్గం బలంగా ఉంది. గతంలో ప్రజారాజ్యం స్థాపించినప్పుడు ఆ పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి తిరుపతితో పాటు స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిలిచారు. చిరంజీవి సొంతూరు మొగల్తూరు. చిరంజీవి ఆత్తగారి ఊరు మొగల్తూరు పక్కనే ఉన్న పాలకొల్లు.
పాలకొల్లు, తిరుపతిలలో చిరంజీవి తిరుగులేని విజయం సాధిస్తారని అందరూ అనుకున్నారు. అయితే చిరంజీవి సొంతూరు పాలకొల్లులో జనం ఓడించారు. కాంగ్రెస్ మహిళా అభ్యర్థి ఉషారాణి చేతిలో చిరంజీవి ఓటమిపాలయ్యారు. తిరుపతిలో మాత్రం చిరంజీవి విజయం సాధించి పరువు కాపాడుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజారాజ్యం విజయాన్ని జనసేన సెంటిమెంట్‌గా భావిస్తోంది. గతంలో చిరంజీవి గెలిచిన తిరుపతి నుంచే జనసేనాని పవన్‌కల్యాణ్ కూడా పోటీ చేస్తే బాగుంటుందని ఆ పార్టీ భావన. గత ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ భీమవరం, గాజువాకలో నిలబడి రెండుచోట్ల ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు. మరోసారి అలాంటి ఫలితం పునరావృతం కాకుండా వుండాలంటే, తిరుపతి సురక్షితమని జనసేన బలంగా నమ్ముతోంది.
అందుకే తిరుపతిలోనే పవన్‌కల్యాణ్ నిలబడాలంటూ ఏకంగా తీర్మానం చేసి, పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. ఒకవేళ తిరుపతిలో పవన్‌కల్యాణ్ నిలబడాలని నిర్ణయించు కుంటే మాత్రం … విజయం నల్లేరు మీద నడక మాత్రం కాదు. గతంలో చిరంజీవి గెలిచిన నాటి పరిస్థితులకు, ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. ముందు తాను ఎక్కడ నిలబడాలో పవన్‌కల్యాణ్ తేల్చుకుంటే, తర్వాత రాజకీయ పరిణామాలు ఎన్ని రకాల మలుపులు తిరుగుతాయో ఎవరికి తెలుసు?