ఇపుడైతే హీరోలకి బిల్డప్ ఎంట్రీ అవసరం. యాక్షన్ సీన్‌తోనో, పాట లేదా ఫైటింగ్తోనో ఎంట్రీ ఇస్తారు. ఒకప్పుడు హీరో మానవాతీత శక్తి కాదు. సాధారణమైన మనిషి. పరాక్రమవంతుడే. అయినా, దాన్ని చూపడానికి కొంచెం టైం పట్టేది. ఫైటింగ్‌లు వున్నా క్లైమాక్స్‌లో వుండేవి. 1970 తర్వాత బిల్డప్ మెల్లగా వచ్చింది.
NTR సినిమాల్లో హీరో ఎంట్రీ ఎలా వుండేదో చూద్దాం. పాతాళభైరవిలో అంజిగాడితో కర్రసాము చేస్తూ NTR ఫస్ట్ సీన్ వుంటుంది. జగదేకవీరుని కథలో హీరోని “జయజయ జగదేక ప్రతాప” అని పొగుడుతున్న పాటతో ఎంట్రీ. ఈ సీన్లో హీరో సాహసవంతుడని, అతన్ని చూస్తే తమ్ముడికి ద్వేషమని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఉమ్మడి కుటుంబంలో యమధర్మరాజుగా ఎంట్రీ. సతిసావిత్రి నాటకంలో వాణిశ్రీ సావిత్రిగా నటిస్తే , NTR యముడు. 1978లో వచ్చిన సతిసావిత్రిలో వీళ్లిద్దరు అదే పాత్రల్లో నటించడం విశేషం.
మిస్సమ్మలో హీరో ఎంట్రీ మరీ సాదాసీదాగా వుంటుంది. ఆ రోజుల్లో కథే హీరో. ఒకరి ఇంట్లోకి ట్యూషన్ మాస్టర్‌గా NTR వస్తే, అదే ఇంట్లో సావిత్రి సంగీతం టీచర్. ఇద్దరూ ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ వుంటారు.
దొరికితే దొంగలులో మాత్రం కొంచెం బిల్డప్. ఇన్స్పెక్టర్గా హీరో ఎంట్రీ. హైదరాబాద్‌కి ప్రత్యేక అసైన్మెంట్ ఇచ్చి పంపుతారు. నిండు మనసులులో హీరో జైల్లో వుంటాడు. కోపంగా ఆవేశంగా వుంటాడు. ఎయ్ అని గార్డు పిలిచాడని సెల్ తలుపుని తంతాడు. విడుదల చేస్తున్నపుడు బట్టలుతో పాటు చాకు కూడా ఇస్తారు జైలు అధికారులు. హీరో రౌడీ అని చిన్న బిల్డప్. బాగ్దాద్ గజదొంగలో “ఎవడురా దొంగ” అని పాట పాడుతూ హీరో వస్తాడు. అతను రాబిన్‌హుడ్ టైప్ అని పాటలోనే తెలిసిపోతుంది. గాలి మేడలులో పొలానికి నీళ్లు కడుతూ కనిపిస్తాడు.
డ్రైవర్రాముడులో పెద్ద డైలాగ్‌తో ఎంట్రీ ఇచ్చి, లారీని ఛేజ్ చేసి ఫైట్ కూడా చేస్తాడు. డ్రైవర్ రాముడంటే ఏమనుకుంటున్నావ్ అంటాడు. యుగపురుషుడులో బిల్డప్ సీన్‌తో ఎంట్రీ. కరాటే ఫైటర్‌గా NTR అంతటి హీరోపై కాళ్లు విసరలేక ఫైట్ మాస్టర్లు పడే ఇబ్బందులు కూడా కనిపిస్తాయి.
అడవిరాముడులో కూడా ఫైట్‌తోనే ఎంట్రీ. “మంచితనానికి సేవకున్ని, దుర్మార్గుల పాలిట యమున్ని” అనే డైలాగ్ చెప్పి మరీ తంతాడు. వేటగాడులో తుపాకీ తీసుకుని వేటకి బయలుదేరుతాడు. కొండవీటి సింహంలో అయితే బందిపోటు దొంగల డెన్‌కి వెళ్లి పెద్ద డైలాగ్ చెప్పి సింహాన్ని ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్ అంటాడు. అడవిరాముడు (1977) తరువాత ఫ్యాన్స్ హడావుడి పెరిగింది. అంతకు ముందు కూడా వుండేది కానీ, హీరో కనబడగానే పువ్వులు, కాయిన్స్ విసరడం మొదలైంది. దీంతో బిల్డప్ ఫైట్స్, డైలాగులు స్టార్టయ్యాయి.
గజదొంగలో డెన్లోకి కారులో వస్తాడు. అనుచరులతో డైలాగ్‌లు చెప్పి బ్యాంక్ దోపిడీకి బయలుదేరుతాడు. సర్దార్ పాపారాయుడులో శ్రీదేవి స్కూటర్ని అడ్డదిడ్డంగా నడిపితే బైక్‌లో ఛేజ్ చేస్తాడు. మప్టీలో వున్న ఇన్స్పెక్టర్ కోటు ఎందుకు వేసుకుంటాడో? పాత సినిమాల్లో NTR గుర్రం కళ్లెం పట్టాడంటే వెనుక తెరలు కదులుతూ వుంటాయి. సర్దార్ పాపారాయుడు టైంకి కూడా బైక్‌లో NTR రావడం స్టూడియోలో తీయడం ఆశ్చర్యం.
సర్కస్ రాముడులో కారు యాక్సిడెంట్‌తో ఎంట్రీ. సరదా రాముడులో విదేశాల నుంచి విమానంలో దిగుతాడు. వెంటనే రౌడీలతో ఫైట్. ఇంగ్లీష్ సూపర్మాన్ చూసి తెలుగులో కూడా తీసారు. సూపర్మాన్ డ్రెస్‌లో NTRని చూసి జనం జడుసుకున్నారు. ఆంజనేయస్వామికి దండం పెట్టి, గాల్లో ఎగురుకుంటూ వెళ్లి ఇద్దరు పిల్లల్ని కాపాడుతాడు. హీరో ఎంట్రీ సూపర్ రేంజ్‌లోనే.
ఇప్పటి హీరోలు ఏడాదికి ఒక్క సినిమా తీయడానికే అలసిపోతున్నారు. మరి NTR ఇన్ని వందల సినిమాల్లో ఎలా నటించాడో మరి!
జీఆర్ మహర్షి