మహానాడు సక్సెస్ టీడీపీ నేతల్లో నూతనోత్సాహాన్ని నింపింది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంతో ముందుగానే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. అధికారాన్ని నిలుపుకోడానికి వైసీపీ, మళ్లీ దక్కించుకోడానికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు.
అధికార పార్టీ సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర నిర్వహించింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాదుడేబాదుడు, మహానాడు కార్యక్రమాలను నిర్వహించింది. రానున్న రోజుల్లో మినీ మహానాడు కార్యక్రమాలను ప్రతి జిల్లాలో నిర్వహించనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా గడపగడపకూ మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికి వెళ్లి మూడేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తోంది.
ఈ నేపథ్యంలో అధికార పార్టీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఘాటు విమర్శలు చేశారు. విశాఖలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వారిలో 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. గతంలో తమ పార్టీ 103 సీట్లు గెలిస్తే, 9 మందికి మంత్రి పదవులు ఇచ్చారని చెప్పుకొచ్చారు.
వైసీపీ, టీడీపీలలో ఎవరిది సామాజిక న్యాయమని ఆయన ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తానే మొదటిసారి మంత్రి పదవులు ఇచ్చినట్టు జగన్ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు. అప్పులు తెచ్చి మీట నొక్కేందుకు సీఎం అవసరం లేదన్నారు. ఒక మనిషిని పెట్టుకున్నా సరిపోతుందని వెటకరించారు.
వైసీపీ ప్రభుత్వంలో బీసీ మంత్రులు నోరులేని మూగజీవులన్నారు. పదవులు మాత్రమే వారివని, అధికారం మాత్రం నలుగురు చేతుల్లో ఉందన్నారు. రాష్ట్రాన్ని విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలకు ధారాదత్తం చేశారని ఘాటు ఆరోపణలు చేశారు. ఈ నలుగురు నేతలను టీడీపీ టార్గెట్ చేయడం గమనార్హం. మహానాడు వేదికగా చంద్రబాబు కూడా ఇవే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.