పవన్ కల్యాణ్ కెరీర్లో ఉన్న నిజమైన సూపర్ హిట్ చిత్రాల్లో బద్రి కూడా ఒకటి. అందులో ఓ చిన్న సన్నివేశం ఉంటుంది. తన చెల్లెలిని ట్రాప్ చేస్తున్నాడని తెలుసుకున్న ప్రకాష్ రాజ్ (నందా)‘‘నేనేం చేస్తానో నాకే తెలియదు’’ అంటూ వార్నింగ్ ఇస్తాడు. అలవాటుగా మెడ చుట్టూచేయి వేసి రుద్దుకున్న పవన్ కల్యాణ్ (బద్రి- బద్రీనాధ్) ‘‘ముందు ఏం చేయాలో డిసైడ్ చేసుకో.. ఎందుకంటే అదే జరుగుద్ది’’ అంటూ హెచ్చరిస్తాడు. ఈ సీన్ అప్పట్లో అభిమానులకు కిక్ ఇచ్చింది.
ఇప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయజీవితంలో ఎదురై ఉన్న సందర్భం కూడా ఈ సీన్ లాగానే ఉంది. కాకపోతే ఇక్కడ పవన్- నందా పాత్రను పోషిస్తున్నాడు. తానేం చేయాలో తనకే తెలియని స్థితిలో ఉన్నాడు. ముందు ఏం చేయాలో డిసైడ్ చేసుకో.. అంటూ ఫ్యాన్స్ ఆయనను అభ్యర్థించే పరిస్థితి. పవన్ కల్యాణ్ వారాహి వాహనం ఎక్కేలోగా.. డిసైడ్ చేసుకోవాల్సిన కీలకమైన అంశం.. బీజెపీతో బంధం!
వ్యతిరేక ఓటు చీలనివ్వను అని భీషణమైన భీష్మ ప్రతిజ్ఞ చేసిన పవన్ కల్యాణ్ దానికి తగినట్టుగా చంద్రబాబు పల్లకీ మోయాలనే కృతనిశ్చయంతో ఉన్నారన్నది నిజం. కానీ ఆయన ప్రస్తుతం బిజెపి ఉక్కు కౌగిలిలో ఉన్నారు. ఆ కౌగిలినుంచి బయటకు రావడం ఎలా? అనేది ఆయనకు అంతు చిక్కడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విశాఖ ఉక్కు లాంటి ఎన్నటికీ నెరవేరే అవకాశం లేని అంశాల పేరు చెప్పి.. బిజెపిని తిట్టేసి పొత్తునుంచి బయటకు రావడం చాలా ఈజీ. కానీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాబోతున్న నరేంద్రమోడీని తిట్టడం, ఆయనతో శత్రుత్వం పెట్టుకోవడం, మళ్లీ గెలుస్తాడో లేదో గ్యారంటీ లేని చంద్రబాబు కోసం అవసరమా? అనేది పవన్ కల్యాణ్ లో ఉన్న మీమాంస.
మోడీతో సున్నం పెట్టుకోవడానికి చంద్రబాబే సిద్ధంగా లేకపోగా, ఆయన భజన చేస్తుండగా.. తానెందుకు వైరం పెట్టుకోవాలనేది ఆలోచన. అందుకే బిజెపిని కూడా చంద్రబాబు పల్లకీకి బోయీగా మార్చాలనేది ఆయన కోరిక. అందుకు ఆ పార్టీ ఒప్పుకోవడం లేదు. కానీ, రాష్ట్రయాత్ర చేయడానికి వారాహిని సిద్ధం చేసుకున్న పవన్ కల్యాణ్, ఆయాత్ర మొదలు పెట్టడానికి ముందే బిజెపితో బంధం ఉందా లేదా, తెలుగుదేశంతో బంధం ఉందా లేదా అధికారికంగా కూడా ప్రకటించాలి.
పొత్తు నిర్ణయాలను బట్టి.. ఆయన వారాహి రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటే వారికి ప్రయోజనం ఉంటుంది. ఈ రెండు విషయాల్లో క్లారిటీ రాకుండా.. వాహనం రెడీగా ఉన్నది కదాని.. ఎక్కి రాష్ట్రమంతా తిరగడం మొదలెడితే.. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగానే ఉంటుంది. శ్రమ తప్ప ఫలితం దక్కకపోవచ్చు.అందుకే కొత్తసంవత్సరం కూడా వచ్చేస్తున్న సందర్భంలో అభిమానులు అందరూ పవన్ కల్యాణ్ నుంచి కోరుకుంటున్నది ఒక్కటే.. రాజకీయంగా ఎలాంటి ముందడుగు వేయబోతున్నామో వెంటనే డిసైడ్ చేసుకోవాలని! మరి పవన్ కు ఆ సంగతి అర్థమవుతుందో లేదో!!