బండి చెప్పింది ఇదీ ….అధిష్టానం మనసులో ఏముందో …?

రాజకీయాల్లో ఎప్పుడూ అభిప్రాయాలు నిలకడగా ఉండవు. ప్రజల, పార్టీల, నాయకుల అభిప్రాయాలు మారుతూనే ఉంటాయి. అధికారం సాధించడానికి పార్టీలు, నాయకులు ఏమైనా చేస్తారు. రాజకీయాల్లో ఏ పార్టీ పర్మినెంట్ మిత్రుడు కాదు. పర్మినెంట్ శత్రువూ…

రాజకీయాల్లో ఎప్పుడూ అభిప్రాయాలు నిలకడగా ఉండవు. ప్రజల, పార్టీల, నాయకుల అభిప్రాయాలు మారుతూనే ఉంటాయి. అధికారం సాధించడానికి పార్టీలు, నాయకులు ఏమైనా చేస్తారు. రాజకీయాల్లో ఏ పార్టీ పర్మినెంట్ మిత్రుడు కాదు. పర్మినెంట్ శత్రువూ కాదు. రాష్ట్ర నాయకులు ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తారు. కానీ అధిష్టానం లెక్కలు మరో విధంగా ఉంటాయి. చివరకు అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అవుతుంది. తెలంగాణలో బీజేపీ -టీడీపీ పొత్తు విషయంలో అలాగే కావొచ్చేమో చెప్పలేం. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం సభతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు తెలంగాణాపై ఫోకస్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు . 

గత ఎన్నికల ఓటమి తర్వాత క్రమంగా ప్రాభవాన్ని కోల్పోయిన తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవం కోసం చంద్రబాబు మళ్ళీ తెలంగాణాలో అడుగు పెట్టారు. పార్టీకి పునర్వైభావాన్ని తీసుకురావాలని చంద్రబాబు భావిస్తూ తెలంగాణాలో వేస్తున్న అడుగులు తెలంగాణా రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. తెలంగాణాలో టీడీపీ ఎంట్రీ కేవలం బీజేపీతో పొత్తు కోసమే అన్న చర్చ ప్రధానంగా జరిగింది. ఏకంగా బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, మంత్రులు, చంద్రబాబును టార్గెట్ చేసి ఈ విషయంలో తీవ్ర విమర్శలు గుప్పించారు.

కేవలం బీజేపీతో పొత్తు కోసమే, ఎన్నికల రాజకీయాలలో భాగంగా చంద్రబాబు మళ్లీ తెలంగాణకు వస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాదు బిజెపి నేతలలో సైతం దీనిపై ఒక సందిగ్ధం నెలకొంది. నిజంగానే చంద్రబాబుతో బిజెపి పొత్తు పెట్టుకుంటుందా? అన్న అనుమానం బిజెపి నేతలలో సైతం వ్యక్తమైంది. ఈ క్రమంలోనే తాజాగా బిజెపి సీనియర్లు మాజీ ఎంపీ విజయశాంతి, ఎంపీ అరవింద్ తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో క్లారిటీ ఇవ్వాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కోరారు. దీనిపై స్పందించిన బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి టీడీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.

ఇక ఇదే విషయాన్ని కార్యకర్తలకు కూడా చెప్పాలని ఆయన సూచించారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆశలపై నీళ్లు పోసినట్లయింది. టీడీపీకి తెలంగాణలో ఉన్న ఒకే ఒక ఆప్షన్ బిజెపి. ప్రస్తుతం బీజేపీ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేసింది. మొదటి నుంచి కేసీఆర్ ను వ్యతిరేకించే చంద్రబాబు, కేసీఆర్ తో పొత్తు పెట్టుకునే అవకాశం అంతకంటే లేదు. ఇక ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తే ఒంటరిగా పోటీ చేయాల్సిందే తప్ప పొత్తుతో ముందుకు వెళ్లే ఛాన్స్ లేదని, తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది.

మరి టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం ఏం చేయబోతున్నారు? అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి కేసీఆర్ పార్టీని ఓడించే సీన్ ఉంటుందని అనుకోలేం. వాళ్ళు తమ బలాన్ని అతిగా ఊహించుకుంటున్నారు. కాబట్టి బండి సంజయ్ చెప్పిందే తుది నిర్ణయం కాకపోవొచ్చు. ఢిల్లీ పెద్దల మనసులో ఏముందో చెప్పలేం. వాళ్ళ లెక్కలు వేరేగా ఉంటాయి కాబట్టి టీడీపీతో కలిసి పోటీ చేసినా చేయొచ్చు. రాజకీయాల్లో ఏ క్షణం ఏమైనా జరగొచ్చు.