బీజేపీకి ప‌వ‌న్ ప‌రోప‌కారం!

ఏమీ లేని చోట పాగా వేయ‌డం బీజేపీకే సాధ్యం. వామ‌ప‌క్ష పార్టీలు బ‌లంగా ఉన్న‌ త్రిపుర‌, ప‌శ్చిమ‌బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో సైతం బీజేపీ ఉనికి చాటుకుంది. ఇలా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ…

ఏమీ లేని చోట పాగా వేయ‌డం బీజేపీకే సాధ్యం. వామ‌ప‌క్ష పార్టీలు బ‌లంగా ఉన్న‌ త్రిపుర‌, ప‌శ్చిమ‌బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో సైతం బీజేపీ ఉనికి చాటుకుంది. ఇలా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా తిష్ట వేయ‌డానికి బీజేపీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ‌లో 2023లో అధికారంలోకి ఎలాగైనా వచ్చి తీరాల‌నే ప‌ట్టుద‌ల బీజేపీలో క‌నిపిస్తోంది.

2018లో కేవ‌లం ఒకే ఒక్క సీటులో గెలుపొందిన బీజేపీ, ఐదేళ్లు తిరిగే స‌రికి అధికారంలోకి వ‌స్తామ‌నే ధీమాలో ఉందంటే, ఆ పార్టీ వ్యూహం, పోరాటాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. తెలంగాణ‌లో అధికార పార్టీని కాద‌ని ఉప ఎన్నిక‌ల్లో రెండు అసెంబ్లీ సీట్లు గెలుపొందం బీజేపీకి అమిత‌మైన శ‌క్తిని ఇచ్చింది. ఉప ఎన్నిక‌ల్లో గెలుపుతో అధికారంలోకి వ‌స్తామ‌నే ధీమాలో ఆ పార్టీలో పెరిగింది. ఈ ధీమానే బీజేపీకి స‌గం బ‌లం.

ఇక ఏపీ విష‌యానికి వ‌స్తే ఎంతో ముందుగానే జ‌న‌సేన‌, బీజేపీ పొత్తు కుదుక్చుకున్నాయి. ఏ ఎన్నిక‌ల్లోనైనా క‌లిసిమెలిసి బరిలో దిగి ప్ర‌త్య‌ర్థుల‌తో క‌ల‌బ‌డి నిల‌బ‌డ‌తామ‌ని నాడు జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు గొప్ప‌గా చెప్పారు. ఆ త‌ర్వాత ఎప్పుడూ క‌లిసింది లేదు, నిలిచింది లేదు. ఎవ‌రికి వారే య‌మునాతీరే అన్న‌ట్టుగా ఆ రెండు పార్టీల పంథా వుంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌ను ఎదుర్కోడానికి అంద‌రూ క‌లిసి రావాల‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ముక్త‌కంఠంతో నిన‌దిస్తున్నారు. ఇందుకోసం త్యాగాల‌కు సిద్ధ‌మ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

చంద్ర‌బాబు పిలుపున‌కు ప‌వ‌న్ సానుకూలంగా స్పందించారు. జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు మాత్రం చాలు చాలు మీ త్యాగాలు చాలా చూశామ‌ని దెప్పి పొడిచారు. కుటుంబ పార్టీల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాలు చేస్తామ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. నంద్యాల జిల్లాలో నిన్నటి ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తున్న అప్పులు, అలాగే ఆడ‌వాళ్లు, ద‌ళితుల‌పై దాడుల గురించి బీజేపీ -కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్తాన‌న్నారు. ఏపీ ప‌రిస్థితుల‌ను వివ‌రించి బీజేపీ పెద్ద‌ల్ని ఒప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పుకొచ్చారు. అంటే జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా టీడీపీతో క‌లిసి ప్ర‌యాణించాల్సిన అవ‌స‌రాన్ని బీజేపీ పెద్ద‌ల‌కు చెప్పి, తాను చెప్పిన‌ట్టు వినేలా చేస్తాన‌నేది ప‌వ‌న్ మాట‌ల ఆంత‌ర్యం. 

ఒక‌వేళ విన‌క‌పోతే త‌న దారి తాను చూసుకుంటాన‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. ఈ నేప‌థ్యంలో త్యాగం పేరుతో జ‌న‌సేన‌, బీజేపీల‌ను త‌న‌వైపు తిప్పుకునేందుకు టీడీపీ వ్యూహం ర‌చించింది. ఈ వ్యూహంలో ఇప్ప‌టికే ప‌వ‌న్ ప‌డిపోయారు. 

జ‌గ‌న్‌ను గ‌ద్దె దించ‌డ‌మే జ‌న‌సేన త్యాగం. బీజేపీ మాత్రం త్యాగాల ఊసే లేకుండా త‌న పార్టీని బ‌లోపేతం చేసుకునే ప‌నిలో ఉంది. జ‌న‌సేన‌తో అంట‌కాగితే మ‌రోసారి టీడీపీకి ద‌గ్గ‌ర చేసి, శాశ్వ‌తంగా పార్టీ బ‌లోపేతం కాకుండా చేస్తుంద‌నే భ‌యం బీజేపీలో ఉంది. ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం వుండ‌గానే జ‌న‌సేనాని మ‌న‌సులో ఏముందో బ‌య‌ట‌పెట్టుకోవ‌డం ద్వారా త‌మ‌కు మంచి చేశార‌నే భావ‌న‌లో బీజేపీ వుంది. ఇక‌పై జ‌న‌సేన‌తో జాగ్ర‌త్త‌గా వుండాల‌ని బీజేపీ త‌మ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.