ఈ మధ్య హైదరాబాద్‌లో రెండు సంఘటనలు జరిగాయి. నగర శివార్లలో జంట హత్యలు జరిగాయి. నగరం నడిబొడ్డున ఒక యువకుడిని భార్య ఎదుటే హత్య చేశారు. మొదటి దానికి కారణం లైంగిక సంబంధాలు, రెండోదానికి మతాంతర వివాహం లేదా పరువు హత్య. ఇక్కడి పత్రికలు ఈ రెండింటిని నేర వార్తలుగానే చూశాయి. పోలీసులు చట్ట పరిధిలో తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నారు.
ఒకవేళ ఇవే సంఘటనలు విజయవాడలో జరిగితే వెంటనే సీన్ మారిపోయి వైసీపీ ప్రభుత్వానికో, లేదా జగన్ మెడకో చుట్టేవాళ్లు. నిందితులు వైసీపీ కార్యకర్తలో, లేదా సానుభూతిపరులో అయితే చెప్పాల్సిన పనిలేదు. జగన్ హయాంలో పోలీసులు నిద్రపోతున్నారని, వైసీపీ నాయకులే దగ్గరుండి హత్యలు చేయిస్తున్నారని పేపర్లన్నీ నిండిపోయి పరామర్శ యాత్రలు జరిగేవి.
కలర్ ఎట్లా వుంటుందంటే జగన్ స్వయంగా కడప, పులివెందులలో రౌడీల ప్యాక్టరీలు పెట్టి శిక్షణ ఇచ్చి నియోజకవర్గానికి ఇంత మందిని పంపుతున్నాడని నమ్మించే విధంగా. కోట్ల మంది జనాభా వున్న రాష్ట్రంలో నేరాలు జరుగుతాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పోలీస్ వ్యవస్థ వుండే లండన్‌లో కూడా నేరాలు జరుగుతున్నాయి. క్రూరమైన పోలీసులున్న ఇజ్రాయిల్‌లో కూడా నేరాలు ఆగలేదు. నేరాల వెనుక సామాజిక కారణాలు చాలా వుంటాయి.
నేరాల్ని ఎవరూ సమర్థించరు. పోలీసులు సకాలంలో స్పందించకపోతే చర్యలు తీసుకోవాల్సిందే. తీసుకున్నారు కూడా. ఆడవాళ్లకి రక్షణే లేదనే విధంగా రాజకీయం చేయడం వల్ల మొత్తం సమాజానికే నష్టం. పిల్లల్ని తల్లి జాగ్రత్తగా చూసుకోవాలని హోంమంత్రి వనిత చెబితే దానికి విపరీత అర్థాలు వెతికి నానా రకాలుగా విమర్శించారు. ఆ మాట అంటే ఆమె నేరాల్ని సమర్థించినట్టా?
ఈ మధ్య ఒక రేప్ కేసులో వేగంగా విచారణ జరిగి శిక్ష పడితే అది పోలీసుల సమర్థతగా కనిపించదు. డ్యూటీలో వున్న మహిళా పోలీసుల వాష్ రూం అవసరాల కోసం జగన్ ప్రభుత్వం కార్‌వాన్‌లు కొంటే అది మహిళా అనుకూల వార్తగా ఎవరికీ కనిపించదు.
జగన్ ప్రభుత్వ విధానాల్ని విమర్శించుకోండి. అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కూడా. ప్రతిదాన్ని భూతద్దంలో చూపిస్తే జనం దేన్నీ నమ్మరు. జగన్ జనంలోకి రాడు అంటారు. వస్తేనేమో ట్రాఫిక్ ఆంక్షలతో జనజీవితం అస్తవ్యస్తం అంటారు. గత ముఖ్యమంత్రులు ఎవరైనా ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా రోడ్లపై వెళ్లారా? వీఐపీలు వచ్చినపుడు పోలీసులు అతి చేయడం కొత్తగా ఏమైనా జరిగిందా?
మోకాలికి, బట్టతలకి ముడి పెట్టడం అనే సామెత అర్థం కావాలంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూడాల్సిందే!
జీఆర్ మహర్షి