కాపులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మోసగించారని జనసేనాని పవన్‌కల్యాణ్ విమర్శించడంపై వైసీపీ నేతలు మండిపడిపడుతున్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి, ఆ తర్వాత వారి గొంతు కోశారని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. మోదీ సర్కార్ ఆర్థిక వెనుకబడిన అగ్రకులస్తుల కోసం తీసుకొచ్చిన 10 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లలో …ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ గత ఎన్నికల ముందు చంద్రబాబు డ్రామా ఆడారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా రాజానగరంలో వారాహి విజయభేరి యాత్రలో కాపుల రిజర్వేషన్లపై పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన మొదలు కాగానే కాపుల రిజర్వేషన్ ఎందుకు రద్దైందో సీఎంను కాపు నాయకులు అడగాలని సూచించారు. అలాగే ప్రతిదానికి తనను తిట్టడం మానేసి, కాపుల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మంచి చేసే 5 శాతం రిజర్వేషన్ ఎందుకు తీసేశావ్ జగన్ అని నిలదీయాలని పవన్ డిమాండ్ చేశారు. దీనికి జగన్‌తో పాటు వైసీపీలో గెలిచిన కాపు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని ఆయన కోరారు.
ఇంత వరకూ బాగానే వుంది. నిజంగా తన సామాజిక వర్గంపై పవన్‌కు అంత ప్రేమే వుంటే, రానున్న ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే 5 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించే దమ్ముందా అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తన సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతానికి వెళ్లి జగన్‌పై వ్యతిరేకత కలిగించడానికి తప్ప, సొంత సామాజిక వర్గానికి ప్రయోజనం కలిగించాలనే ఆలోచన పవన్‌లో ఏ మాత్రం లేదని వారు విమర్శిస్తున్నారు.
జగన్‌కు చిత్తశుద్ధి వుంది కాబట్టే, కాపులు ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాల్లో ప్రచారం చేస్తూ, కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వలేనని తేల్చి చెప్పిన సంగతిని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. కాపులపై ప్రేమ మాటల్లో కాదు, చేతల్లో చూపాలని వైసీపీ నేతలు హితవు చెబుతున్నారు. కూటమి మేనిఫెస్టోలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.