జాలిగా అడిగితే జోలె నిండుతుంది.. ఓట్లు పడ్తాయా?

పవన్ కల్యాణ్ ప్రారంభించినది కొత్త పద్ధతేమీ కాదు. రాజకీయ పార్టీలు అనాదిగా చేస్తున్నదే. పార్టీ నిర్వహణకు అందరి దగ్గరనుంచి డబ్బులు పోగేయడం అనేది అన్ని పార్టీలూ చేసే పని. Advertisement కాకపోతే పవన్ కల్యాణ్…

పవన్ కల్యాణ్ ప్రారంభించినది కొత్త పద్ధతేమీ కాదు. రాజకీయ పార్టీలు అనాదిగా చేస్తున్నదే. పార్టీ నిర్వహణకు అందరి దగ్గరనుంచి డబ్బులు పోగేయడం అనేది అన్ని పార్టీలూ చేసే పని.

కాకపోతే పవన్ కల్యాణ్ తరఫున ఆయన అన్నయ్య నాగబాబు.. ప్రత్యేకంగా  ఒక ప్రకటన చేస్తూ.. రాష్ట్రంలో ఉన్న ప్రజలు, పవన్ అభిమానులు అందరినీ పార్టీకి విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.

పది రూపాయల నుంచి వారికి తోచినట్లుగా ఎంత మొత్తమైనా ఇవ్వవచ్చునని పిలుపు ఇస్తున్నారు. ప్రజలు చాలా సులభంగా.. పార్టీ హుండీలో డబ్బులు వేసేయడానికి యూపీఐ నెంబరునుకూడా ప్రకటించారు. 

ఇలా విరాళాలు అడగడం ఒక మంచి  రాజకీయ వ్యూహం కూడా! ఎందుకంటే.. ఒకసారి ప్రజలు పార్టీకి విరాళం ఇచ్చారంటే.. ఆ పార్టీని వారు సొంతం చేసుకుంటారు. తమదిగా భావిస్తారు. తమది అనే విశ్వాసం ఉంటే తప్ప.. డబ్బులిచ్చే వరకు వ్యవహారం రాదు.

ఇందులో ఏమీ బలవంతం లేదు గనుక.. ప్రజలు స్వచ్చందంగా డబ్బులు ఇవ్వడం అంటూ జరిగితే.. పార్టీతో వారికి ఒక అనుబంధం ఏర్పడుతుంది. పార్టీని ప్రమోట్ చేయడమూ.. తమ ఓట్లతో పాటు, తమ మాట చెల్లుబాటు అయ్యే వ్యక్తులతో ఓట్లు వేయించడమూ కూడా వారు బాధ్యతగా భావిస్తారు అనేది ఇందులో వ్యూహం. 

అంతా బాగానే ఉంది. కానీ ఇలాంటి వ్యూహాలు సర్వత్రా వర్కవుట్ అవుతాయా? అనేది పెద్ద మీమాంస. ఎందుకంటే.. సాధారణంగా ఒక పార్టీకి క్రియాశీల సభ్యులు అనే అనుబంధం కూడా ఇంకా చాలా బలమైనది.

పార్టీలో క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారంటే.. వారు పార్టీ జెండాను సతతం మోయడానికి సిద్ధపడిన వారే అయి ఉంటారు. కానీ చాలా సందర్భాల్లో కొన్ని పార్టీల ఎన్నికల పనితీరును పరిశీలిస్తే.. ఒక్కో నియోజకవర్గాల్లో  వారి పార్టీకి ఎందరు క్రియాశీల సభ్యులున్నారో.. అన్ని ఓట్లు కూడా రావు. సభ్యుల లెక్కలను కాగితాల మీద చూసుకుని మురిసిపోయే పార్టీలు.. ఎన్నికల తంతు అయ్యేసరికి ఖంగు తినే అనుభవాలు ఎదురవుతుంటాయి. 

పవన్ కల్యాణ్ విషయానికి వస్తే.. ఇలాంటి అనుభవాలు అనేకం. పవన్ కల్యాణ్ ప్రసంగాలు విని వెర్రెత్తిపోయి విజిల్స్ వేసే జనంలో సగం మంది ఓట్లు వేసినా కూడా.. ఆయన ఈ పాటికి ఎప్పుడో సీఎం అయిపోయేవారు. పవన్ సభలకు అంతటి క్రేజ్ ఉంటుంది.

పవన్ కనపడగానే పూనకం తెచ్చుకుని విజిల్స్ వేసే వాళ్లలో మెజారిటీ ఆయనకు ఓట్లు వేయడం లేదు. అందుకే పర్సనల్ గా కూడా పరాజయాలు తప్పడం లేదు. 

పైగా పార్టీకి విరాళాలు అడిగే తరహా వేరేగా ఉండాలి. పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు.. దాన్ని కాస్తా దేబిరించే వ్యవహారంలాగా తయారు చేశారు.

పార్టీకి విరాళాలు అడిగేప్పుడు.. మన పార్టీ సమర్థంగా పరిపాలన సాగించబోతోంది.. అలాంటి మంచి పార్టీకి ప్రజలందరూ యజమానులు.. పార్టీ నిర్వహణ బాధ్యతను మీరు కూడా పంచుకోండి.. లాంటి పడికట్టు మాటలతో అడిగితే బాగుంటుంది గానీ.. పవన్ కల్యాణ్ పాపం సొంత డబ్బులు పెట్టుకుని పార్టీ నడుపుతున్నాడు. మీరందరూ తలా ఓ చెయ్యి వేయండి.. అని జాలి పుట్టించే మాటలు చెప్పడం పార్టీకి వర్కవుట్ అయ్యే వ్యవహారం కాదు.

పవన్ కల్యాణ్ ఇప్పటిదాకా తన స్వార్జితమూ సొంత డబ్బుతోనే పార్టీని నడుపుతూ వచ్చారు.. లాంటి పేద డైలాగులు వినిపించారు. 

ఇలా జాలి పుట్టించడం ద్వారా.. జోలె నిండవచ్చు! పాపం పవన్ దగ్గర డబ్బులు అయిపోయాయి.. సినిమాలు కూడా ఆడట్లేదు.. ఇక డబ్బులెలా వస్తాయి అని జాలిపడి కొందరు విరాళాలు ఇవ్వవచ్చు. కానీ.. వాళ్లందరూ ఓట్లు వేసేస్తారని భ్రమపడి బలాన్ని అతిగా ఊహించుకుంటే మాత్రం పార్టీ పప్పులో కాలేసినట్టే!!