జనసేనాని పవన్‌కల్యాణ్ ఆవేదన వర్ణనాతీతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన భార్యల గురించి పదేపదే ప్రస్తావించడం ఆయన హృదయాన్ని గాయపరిచింది. దీంతో వారాహియాత్రలో భాగంగా బహిరంగ సభల్లోనూ, అలాగే నియోజకవర్గ నాయకుల సమావేశాల్లోనూ బాధను తన వాళ్లతో పంచుకుంటున్నారు. తాజాగా తాడేపల్లిగూడెం జనసేన వీరమహిళలు, నాయకుల సమావేశంలో మరోసారి సీఎం జగన్ గురించి ఆయన మాట్లాడారు.
మనసులోని బాధను బయటికి కక్కారు. విడాకులు ఇచ్చిన తర్వాత మాజీ భార్యల గురించి పట్టించుకోని విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అలాంటిది తాను విడిచిపెట్టిన భార్యల గురించి జగన్‌కు ఎందుకని ఆయన సభాముఖంగా నిలదీయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పవన్ ఉద్వేగపూరిత ప్రసంగం జనసేన నాయకుల్ని ఆలోచింపజేసింది. తన భార్యల గురించి జగన్ పదేపదే అంటుంటే చిరాకేస్తోందని వాపోయారు.
‘ జగన్ పదే పదే పెళ్లాం పెళ్లాం అంటుంటే.. ఆ భాష చూస్తుంటే చిరాకేస్తోంది. నా పెళ్లాన్ని అంటే పట్టించుకోను. నేను విడాకులు తీసుకున్నా. కానీ జగన్ మాత్రం నా పెళ్లిళ్లు పట్టుకుని అక్కడే ఉన్నాడు’ అంటూ పవన్ ఆవేదనతో చెప్పుకొచ్చారు. ఇదే సభలో జగన్‌ను ఉద్దేశించి జగ్గూభాయ్ అని పదేపదే పవన్ అన్నారు. పవన్ వ్యవహార శైలి ఎలా వుందంటే, ప్రత్యర్థులు ఎలా మాట్లాడాలో తానే చెబుతానని అంటారు.
తన పెళ్లిళ్ల గురించి అసలే మాట్లాడొద్దని పవన్ ఎంత ఎక్కువగా కోరుకుంటే, ప్రత్యర్థులు అంతకు రెట్టింపుస్థాయిలో మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారు. జగన్‌ను క్రిమినల్, తాజాగా జగ్గూ భాయ్ అనడం రాజకీయ విమర్శగా చూడాలా? లేక వ్యక్తిగతంగా చూడాలా? అన్నది పవనే చెప్పాలి. తన వ్యక్తిగతానికి సంబంధించి టచ్ చేస్తే ఎలా ఇరిటేట్ అవుతానో, ఇతరులకు కూడా మనసు, వాళ్లకంటూ స్పందించే గుణం వుంటుందని పవన్ అర్థం చేసుకుంటే అసలు ఇబ్బందులే ఎదురయ్యేవి కావు.
కానీ చంద్రబాబునాయుడి కోసం పవన్ అనవసరంగా వైసీపీ నేతలతో తిట్లు తినాల్సి వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడెలా మాట్లాడాలో పవన్‌కు దిక్కుతోచడం లేదు. ఎంతసేపూ తాను, తన కుటుంబం తప్ప మరొక అంశమే ప్రస్తావనకు తీసుకురాకపోవడం పవన్‌కే చెల్లింది. ఇవాళ్టి మీటింగ్‌లో పవన్ నోటి నుంచి కొన్ని ఆణిముత్యాలు జాలువారాయి. ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలని తాను కోరుకోలేదన్నారు.
ఒకవేళ అలా అనుకుని వుంటే కాంగ్రెస్‌లో చేరి ఏదో ఒక పదవి తెచ్చుకునేవాడినని ఆయన అనడం గమనార్హం. జనసేనను స్థాపించి పదేళ్లైంది. ఇంకా అత్యవసరంగా అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని చెప్పడం పవన్‌కు మాత్రమే చెల్లింది. అయోమయానికి పెద్దన్న పవన్ అంటే అతిశయోక్తి కాదు.