పవన్ కల్యాణ్ కు అస్త్రాలు అందిస్తున్న ఈనాడు!

వ్యవస్థలో ఉండే లోపాలను నిర్దిష్టంగా గుర్తిస్తే గనుక.. ఖచ్చితంగా వాటిని సరిదిద్దాలి. వ్యక్తుల్లో లోపాలు ఉన్నట్లయితే వారిని ఏరివేయడానికి, దిద్దడానికి ప్రయత్నించాలి. అయితే వ్యక్తుల్లో లోపాలను వ్యవస్థకు ఆపాదించి నిందలు వేయడం అనేది చాలా…

వ్యవస్థలో ఉండే లోపాలను నిర్దిష్టంగా గుర్తిస్తే గనుక.. ఖచ్చితంగా వాటిని సరిదిద్దాలి. వ్యక్తుల్లో లోపాలు ఉన్నట్లయితే వారిని ఏరివేయడానికి, దిద్దడానికి ప్రయత్నించాలి. అయితే వ్యక్తుల్లో లోపాలను వ్యవస్థకు ఆపాదించి నిందలు వేయడం అనేది చాలా నీచమైన వ్యవహారం. వ్యక్తులను బూచిగా చూపించి.. వ్యవస్థకు ఉన్న క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి జరిగే ప్రయత్నం హేయమైనది. 

ఇప్పుడు నెంబర్ వన్ దినపత్రికగా తమ గురించి తాము చెప్పుకునే ఈనాడు అదే పనిచేస్తోంది. ఒకవైపు పవన్ కల్యాణ్ వాలంటీర్ల మీద అవాకులు చెవాకులు పేలుతూ నానా గందరగోళం సృష్టిస్తుండగా, ఆయన చేతికి మరిన్ని అనుచితమైన అస్త్రాలు అందించడానికి ఈనాడు ప్రయత్నిస్తున్నది.

‘కొందరు వాలంటీర్లు అసాంఘిక శక్తులు’ పేరుతో ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. వివిధ నేరాలకు పాల్పడిన వాలంటీర్లు, వారి నేరమయ చరిత్రల గురించిన కథనం ఇది. వాలంటీర్లలో ఇలాంటి వాళ్లున్నారు గనుక ఆ వ్యవస్థ తప్పు అనేది ఈనాడు చాటిచెప్పదలచుకున్న ఉద్దేశం. ఇప్పుడు, తన రెండో విడత పాదయాత్రలో వాలంటీర్లను భ్రష్టు పట్టించడమే జీవితాశయంగా ముందుకు సాగుతున్న పవన్ కల్యాణ్ ఈ వార్తాకథనాన్ని అందిపుచ్చుకుంటారన్నమాట. తాను చెప్పినట్టుగా వాలంటీర్లు కేవలం విమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడే వారు మాత్రమే కాదని.. వారు ఇంకా అనేక రూపాల అసాంఘిక శక్తులు అని ఆయన చెలరేగిపోతారు. 

పవన్ కల్యాణ్ కు తలాతోకా తెలియదని అనుకోవచ్చు. ఎవరు ఏ స్క్రిప్టు రాసి ఇస్తే దానిని చదివి తరించే వ్యక్తి ఆయన. ఇవాళ ఈనాడు స్క్రిప్టు ను రాబోయే రెండు మూడు రోజుల పాటు చదువుతుంటారు. కాకపోతే.. ఇలాంటి అబద్ధాలతో ఒక వ్యవస్థ మీద నింద వేయడానికి ఈనాడుకు ఎలా మనసొప్పింది. అసలు అది జర్నలిజం విలువలు, నైతిక విలువలు పాటిస్తున్న పత్రికేనా? అనే అనుమానం పలువురికి కలుగుతోంది. 

వాలంటీర్లు గా రాష్ట్రంలో సుమారు రెండున్నర లక్షలమంది పనిచేస్తున్నారు. ఇంత పెద్ద వ్యవస్థలో మొత్తం రెండున్నర లక్షల మంది కూడా కడిగిన ముత్యాలే అయిఉంటారని అనుకోవడం భ్రమ. వారిలో సాధారణమైన చిత్తచాంచల్యాలు అవకాశవాద ప్రవృత్తులు, నేరమయమైన బుద్ధులు ఉండేవారు కూడా బోలెడు మంది ఉంటారు. లేరని అనలేం. కానీ.. అలాంటి పురుగులు దొరికినప్పుడు ఏరివేసుకుంటూ ముందుకు సాగాలి.. అంతే తప్ప.. ఆ వ్యవస్థను నిందించడం ఎలా సబబు అనిపించుకుంటుంది? అనేది తటస్థుల ప్రశ్న.

ఉదాహరణకు పోలీసు వ్యవస్థనే తీసుకుంటే… వారు అందించే సేవలు అగణ్యంగా ఉంటాయి. అలాగని పోలీసుల్లో నేరాలు చేసేవాళ్లు, భార్యలను చంపేవాళ్లు, హత్య కేసుల్లో తెరవెనుక ఉండి నడిపించే వాళ్లు లేరని అనగలమా? అలాంటి సంఘటనలు బయటపడుతూనే ఉన్నాయి కదా.. వారి వలన.. యావత్ పోలీసు వ్యవస్థనే నేరస్తుల అడ్డాగా చిత్రీకరిస్తే ఎలా ఉంటుంది. 

అంతెందుకు ఈనాడు సంస్థ పవిత్రమైనది, విలువలు పాటిస్తున్న మహానుభావుల కూటమి అనే అనుకుందాం. ఆ పత్రికలో పనిచేసే వేలమంది విలేకర్లలో అవినీతి పరులు, దందాలుచేస్తున్న వాళ్లు లేరని ఈనాడు యాజమాన్యం గుండెల మీద చేయివేసుకుని చెప్పగలదా? మరి అలాంటి కొందరున్నంత మాత్రాన యావత్ ఈనాడును భ్రష్టుపట్టిపోయిన అవినీతి పుత్రిక అని అంటే వారికి ఎలా ఉంటుంది. ఈ సంగతి ఆలోచించాలి.

మంచీ చెడూ విచక్షణ తెలియని అజ్ఞాని పవన్ కల్యాణ్ కావొచ్చు. కానీ, ఈనాడు ఔచిత్యం ఏమైంది. ‘‘వాలంటీర్లు అసాంఘిక శక్తులు’’ అని బురద చల్లేస్తూ, దాని ముందర ‘‘కొందరు’’ అనే పదం తగిలించినంత మాత్రాన అది పరిశుద్ధ కథనం అయిపోతుందా? వారే ఆలోచించుకోవాలి.