జగన్ బలాలపైనే గురి పెడుతున్న పవన్

అరయంగ కర్ణుడీల్గె ఆర్గురి చేతన్ అన్నది మహాభారతంలోని కర్ణుడి జీవితం ఏ విధంగా అంతమయ్యింది అనేది ఒక్క మాటలో చెప్పే వాక్యం. కుంతి, ఇంద్రుడు, గురువు, భూదేవి, కృష్ణుడు, అర్జునుడు ఇలా అందరూ తలా…

అరయంగ కర్ణుడీల్గె ఆర్గురి చేతన్ అన్నది మహాభారతంలోని కర్ణుడి జీవితం ఏ విధంగా అంతమయ్యింది అనేది ఒక్క మాటలో చెప్పే వాక్యం. కుంతి, ఇంద్రుడు, గురువు, భూదేవి, కృష్ణుడు, అర్జునుడు ఇలా అందరూ తలా చేయి వేసి కర్ణుడి వధకు కారణం అయ్యారు. ఇప్పుడు ఇదే స్కీమును రివర్స్ లో అప్లయ్ చేస్తున్నారు వర్తమాన ఆంధ్ర భారతంలో ప్రతిపక్షం అంతా కలిసి. 

తమ పార్టీ, తమ సామాజిక వర్గం పట్ల కొరకరాని కొయ్యగా తయారయ్యారు జగన్. ఎలా పక్కకు తప్పించాలి. అందుకే ఎన్ని ఎత్తులు ఎత్తాలో అన్నీ ఎత్తుతున్నారు. తమ దగ్గర వున్న సమస్త మీడియాను తాకట్టు పెట్టారు. పవన్ లాంటి వాళ్లను ఎలా తీసుకున్నారో కానీ మొత్తానికి దగ్గరకు తీసుకున్నారు. ఇప్పుడు అందరూ కలిసి ‘కర్ణుడిని చంపడానికి వేసిన స్కీము’ ను ఆదర్శంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది.

అంటే ఎలా అంటే.. జగన్ బలాలు ఏమిటి? వాటిని నిర్వీర్యం చేయడం ఎలా? ఇదీ స్కెచ్.

జగన్ జనాలకు డబ్బులు పంచుతున్నారు.. ఇది అసలైన బలం

దీనిని ఎలా ఎదుర్కోవాలి. అభివృద్ధి లేదు. అప్పుల పాలయిపోతోంది రాష్ట్రం. ఇలా ప్రచారం ప్రారంభించారు. కానీ జనం ఇంకా నమ్మడం లేదన్న అనుమానం వుండనే వుంది. అందుకే ఈ స్కీములు అన్నీ మోసం, మీ డబ్బులే మీకు ఇస్తున్నారు. అన్నీ పెంచేసి ఆ డబ్బులే మీకు ఇస్తున్నారు అంటూ ప్రచారం.

జగన్ అవినీతి పరుడు

జగన్ అవినీతి పరుడు. మద్యంలో డబ్బులు తినేస్తున్నాడు అంటూ ప్రచారం. పోనీ దీనిమీద అంత నమ్మకం వుంటే ఓ కేసు వేయచ్చు కదా. వేయరు. ఎందుకంటే మనం వేసిన బురద మనమే కడిగేస్తే ఎలా? అందుకే బురద వేస్తారు తప్ప నిరూపించరు.

రెడ్ల హవా

జగన్ వెనుక రెడ్డి సామాజిక వర్గ బలం వుంది. అందుకే జనాలకు రెడ్ల మీద విముఖత కలుగచేయాలి. అందుకే పవన్ సదా రెడ్ల మీద ధ్వజం ఎత్తుతూ వుంటారు. ఆ రెడ్డి ఇలా ఈ రెడ్డి ఇలా అంటూ ప్రచారం సాగిస్తుంటారు. గత పదేళ్ల రాజకీయ జీవితం లో ఒక చౌదరి ఇలా లేదా ఒక కమ్మ ఇలా అని పవన్ చెప్పడం ఎప్పుడైనా గమనించారా?

వాలంటీర్లు

జగన్ కు వాలంటీర్ల రూపంలో బలమైన సైన్యం వుందని తెలుసు అందుకే వాలంటీర్లను టార్గెట్ చేయాలి. వాలంటీర్ల వల్ల మూడో ప్రపంచ యుద్దం ముంచుకు వస్తోందన్న లెవల్ లో ప్రచారం సాగించాలి. జనం భయపడిపోవాలి. ఈ మేరకు పవన్ అరవాలి. ‘మన’ మీడియా రాయాలి.

ఎస్సీ.. ఎస్టీలు. .మైనారిటీలు

ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు జగన్ ఓటు బ్యాంక్ గా వున్నారని తెలుసు. అందుకే ఎస్సీల మీద దాడులు జరిగిపోతున్నాయంటూ హడావుడి. మైనారిటీలు తనను నమ్మాలంటే పవన్ వేడుకోవడం. ఎస్సీలకు జగన్ తీరని అన్యాయం చేసేస్తున్నారంటూ పేజీలకు పేజీలు వార్తలు వండి వార్చడం.

ఇలా ఓ పథకం ప్రకారం, ఓ స్కీము ప్రకారం సాగుతోంది పవన్ ప్లస్ కుల మీడియా కలిసి చేస్తున్న హడావుడి. ఈ పథకాలు ఎక్కడ పురుడు పోసుకుంటున్నాయో బుర్రలో కాస్త గుంజు వున్న జనాలకు తెలియంది కాదు.

జిల్లాల స్కీము

కాపులు బలంగా వున్న ఈస్ట్-వెస్ట్ లోనే పవన్ గింగిరాలు తిరుగుతున్నారు. అక్కడ వైకాపా ఓట్ బ్యాంక్ కు కన్నం పెట్టే పవన్ భుజాల మీద వుంది. కృష్ణ-గుంటూరు జిల్లాల్లో ఈసారి సామజిక సమీకరణలు ఒక్కటే వైకాపా ను దూరం పెడతారనే నమ్మకం వుంది. అంటే నాలుగు జిల్లాలు వైకాపా నుంచి గుంజుకోవచ్చు.

భాజపా కోసం తహ తహ

ఇన్ని చేసినా జగన్ ను తట్టుకోలేమేమో అన్న భయం వుండనే వుంది. అందుకే జగన్ ను తట్టుకోవాలంటే భాజపా అండ కావాలి. ఆ అండ కోసమే అహరహం తపిస్తున్నారు. కలవరిస్తున్నారు.

ఇలా బలాలు అన్నీ ఏదో విధంగా లేకుండా చేస్తే తాము నెగ్గేయవచ్చు అన్నది విపక్షాల స్కీము. ఎవరైనా తమ బలం పెంచుకుని నెగ్గాలనుకుంటారు. కానీ ఎదుటి వాడి బలాన్ని లాక్కుని కాదు. కానీ మన విపక్షానికి ఒకటే కావాలి. ఎవరు ఏమి అనుకున్నా, ఎలా అనుకున్నా అనవసరం. అధికారం లాక్కున్నామా లేదా. అదే పాయింట్.