ఏపీ బీజేపీ నూతన రథసారథి దగ్గుబాటి పురందేశ్వరికి సొంత పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మొదటి పరీక్ష పెట్టారు. పొత్తులపై ఆదినారాయణరెడ్డి మరోసారి తన సొంత ఎజెండాతో మాట్లాడ్డం చర్చనీయాంశమైంది. బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఇవాళ పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై బీజేపీ అధిష్టానం చూసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. జనసేనతో కలిసి ఉన్నామని ఆమె అన్నారు. మున్ముందు కూడా జనసేనతో కలిసి రాజకీయ ప్రస్థానం సాగిస్తామని తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి కడపలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రయోజనాల దృష్ట్యా రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఈ విషయంలో కేంద్ర బీజేపీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని ఆయన చెప్పడం చర్చనీయాంశమైంది. బీజేపీ అనేది గంగానది లాంటిదని, అందులో చిన్నచిన్న నదులొచ్చి కలుస్తుంటాయన్నారు.
ఒకవైపు కేంద్ర బీజేపీనే పొత్తుల సంగతి చూసుకుంటుందని పురందేశ్వరి చెప్పిన రోజే, కడపలో బీజేపీ నాయకుడు మాత్రం రానున్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పడానికే తాను ప్రెస్మీట్ పెట్టాననడం దేనికి సంకేతం? బీజేపీ అధిష్టానానికి లేని ఆత్రుత, ఆదినారాయణరెడ్డిలో కనిపించడం వెనుక రాజకీయ కుట్రను పురందేశ్వరి గ్రహిస్తారా? పొత్తులపై కేంద్ర బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నా, పార్టీ నియమావళిని ధిక్కరించి ఆదినారాయణరెడ్డి మాట్లాడ్డాన్ని పురందేశ్వరి నాయకత్వంలోని ఏపీ బీజేపీ భరిస్తుందా? సహిస్తుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఇలా ఆదినారాయణరెడ్డి పార్టీ నియమావళికి విరుద్ధంగా మాట్లాడ్డం ఇదే మొదటిసారి కాదు. కేవలం టీడీపీ ప్రయోజనాల్ని కాపాడేందుకు బీజేపీలో ఆదినారాయణరెడ్డి కొనసాగుతున్నారనేది బహిరంగ రహస్యమే. బీజేపీని వ్యక్తిగత స్వార్థానికి వాడుకుంటున్న ఆదినారాయణరెడ్డిపై చర్య తీసుకునే దమ్ము పురందేశ్వరికి వుందా? అనే చర్చకు తెరలేచింది. పురందేశ్వరి బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో, తాము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని టీడీపీ అనుకూల బీజేపీ నేతలు భావిస్తున్నారా? అనే అనుమానం లేకపోలేదు.