జనసేనాని పవన్‌కల్యాణ్ ఓ విచిత్ర నాయకుడు. ఎప్పుడెలా మాట్లాడ్తారో ఆయనకే అర్థం కాదు. నిన్న మాట్లాడిన మాటపై నేడు నిలబడడు. ఇదే ఆయన ప్రత్యేకత. ఈ లక్షణమే ఆయన్ని రాజకీయాల్లో వెనక్కి తోస్తోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరం ఉంది.
టీడీపీ, వైసీపీలకు వ్యతిరేకంగా బలమైన, నమ్మకమైన ప్రత్యామ్నాయ నాయకత్వం కావాలి. ప్రత్యామ్నాయాన్ని పవన్‌కల్యాణ్ భర్తీ చేస్తాడని భావిస్తే, ఆయన అసలుకే ఎసరు తెచ్చారు. చంద్రబాబు పల్లకీ మోయడంలో ఉన్న శ్రద్ధాసక్తులు, ఓపిక ఆయనకు ప్రజాసమస్యల పరిష్కారంలో లేవు. అందుకే ఆయన ప్రజల విశ్వసనీయత కోల్పోయారు.
తాజాగా జనవాణి- జనసేన భరోసా అంటూ మరో టైంపాస్ కార్యక్రమాన్ని చేపట్టారు. వీకెండ్స్‌లో నిర్వహించతలపెట్టే ఈ కార్యక్రమం… ఇవాళ రెండో విడత విజయవాడలో జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రజల నుంచి వినతిపత్రాలను పవన్ స్వీకరించారు. పవన్ మాట్లాడుతూ సీఎం సహాయనిధి, ఆరోగ్యశ్రీకి సంబంధించిన సమస్యలు తన దృష్టికి ఎక్కువగా వచ్చాయన్నారు. వీటిని సంబంధిత అధికారులకు పంపిస్తానన్నారు.
అధికార మదంతో కొట్టుకుంటారు కాబట్టే వైసీపీ నేతలంటే తనకు చిరాకు అన్నారు. అధికారం ఉంది కదా అని దౌర్జన్యాలు చేస్తే తీవ్ర ఉద్యమాలు వస్తాయని ఆయన హెచ్చరించారు. దౌర్జన్యాలు పెరిగితే ఏదో ఒక రోజు ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు. ప్రజలు మిమ్మల్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తారని ఆయన హెచ్చరించారు. పవన్‌కల్యాణ్ హెచ్చరికలను గమనిస్తే… ఎంతసేపూ వాళ్లు అది చేస్తారు, ఇది చేస్తారని అనడమే తప్ప, ప్రజాఉద్యమంలో తన పాత్ర ఏంటనేది చెప్పరు.
నిజంగా అధికారాన్ని అడ్డంపెట్టుకుని వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే తానే వారిని ఎందుకు ఉరుకులు, పరుగులు పెట్టించరనే ప్రశ్న వస్తోంది. ఎవరో ఉద్యమిస్తారు… ఏదో చేస్తారని చెబుతుండడంతో పవన్ పాత్ర ఏంటనే నిలదీత ఎదురవుతోంది. కొంచెం ఈ వైఖరి మార్చుకుని ప్రజాఉద్యమ నిర్మాణంలో తన పార్టీ భాగస్వామి అవుతుందనే భరోసా కల్పిస్తే, తప్పక భవిష్యత్ వుంటుంది.