మహిళల రక్షణకు జనసేనాని పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారు. ఎందుకో ఆయన మహిళల గురించి నీతులు చెబితే, వినేవాళ్లెవరికైనా అదో రకమైన ఫీలింగ్. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మహిళలకు శుభాకాంక్షలు చెబుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మహిళల రక్షణ, సంక్షేమం తమ బాధ్యతగా ఆయన పేర్కొనడం గమనార్హం. పవన్ ప్రకటనలో ఏముందంటే…
“ప్రతి స్త్రీమూర్తికీ మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లగల సత్తా వీరి సొంతం. వీరికి మనం అందించాల్సింది ప్రోత్సాహం మాత్రమే. విద్య, ఉద్యోగాల్లో రాణించేలా చేయడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించేలా చేస్తాము. నా అక్కలు నా చెల్లెమ్మలు.. అని నాలుక చివరి మాటలతో సరిపుచ్చము. ప్రతి ఆడపడుచుకీ రక్షణ ఇవ్వడం, వారి సంక్షేమానికి కట్టుబడి ఉండటం… రాబోతున్న మా ఉమ్మడి ప్రభుత్వం బాధ్యత అని తెలియచేస్తున్నాను”
నా అక్కలు నా చెల్లెమ్మలు.. అని నాలుక చివరి మాటలతో సరిపుచ్చమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పరోక్షంగా పవన్ దెప్పి పొడిచారు. పవన్ ఇలా మాట్లాడే, ప్రత్యర్థుల నుంచి పది మాటలు అనిపించుకుంటున్నారు. పవన్‌లాంటి వాళ్లతో మహిళలకు రక్షణ, భద్రత లేకుండా పోయిందని వైసీపీ నేతలు విమర్శిస్తుంటారు. మూడు పెళ్లిళ్లు చేసుకుని, మహిళలను వంచించాడనేది వైసీపీ నేతల ఆరోపణ.
అందుకే మహిళల గురించి పవన్ ఏదైనా మాట్లాడినా విడ్డూరంగా వుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ, సంక్షేమం వుంటుందని పవన్ చెప్పడం విశేషం. మహిళల విషయంలో తనపై ఆరోపణల నుంచి బయటపడేందుకు వారి గురించి పవన్ గొప్పగా చెబుతుంటారు. అందులో భాగంగానే ఈ ప్రకటన చూడాల్సి వుంటుంది.