పెదనాన్న కుమార్తె, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలైన షర్మిలను చూసి వివేకా కుమార్తె డాక్టర్ సునీత గుణపాఠం నేర్చుకోలేదు. రాజకీయాలంటే అశామాషీ వ్యవహారం కాదు. రాజకీయాల్లో రాణించడం సులువు అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి లేదు. తెలంగాణలో షర్మిల సొంతంగా పార్టీ పెట్టి, మూడేళ్లలో తన దగ్గరున్న డబ్బును కూడా పోగొట్టుకున్నారు. చేతులు కాల్చుకున్న తర్వాత షర్మిలకు తాను ఎంచుకున్నది సరైంది కాదని అర్థమైంది.
అయినప్పటికీ షర్మిల తప్పు మీద తప్పు చేస్తూనే వున్నారు. దేశంలో ఏ మాత్రం ప్రభావం చూపని కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరారు. ఏపీని విభజించిన పార్టీగా కాంగ్రెస్‌పై ప్రజానీకం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆ కోపం ఇప్పట్లో చల్లబడేలా లేదు. ఏపీ రాజకీయాల్లో ప్రవేశించి సరైన పార్టీని ఎంచుకోకపోవడం ఆమె చేసిన తప్పు.
కనీసం షర్మిలను చూసైనా వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత గుణపాఠం తెచ్చుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కడప జిల్లా రాజకీయాల్లో ఆమె ప్రవేశించాలని ఉత్సాహంగా ఉన్నారు. ఈ నెల 15న తన తండ్రి వర్ధంతిని పురస్కరించుకుని రాజకీయ భవిష్యత్‌పై సునీత ప్రకటన చేయనున్నారని సమాచారం.
ఆ రోజు కడపలో ఆత్మీయుల సమావేశం నిర్వహించనున్నారు. ముందుగా పులివెందులలో ఆత్మీయ సమావేశం నిర్వహించ తలపెట్టారు. అయితే అక్కడ ఒక సమావేశ హాల్‌ను ఇచ్చినట్టే ఇచ్చి, ఆ తర్వాత ఒత్తిళ్ల వల్ల వీలు కాదని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. కనీసం పులివెందులలో సమావేశం పెట్టుకోడానికి కూడా ఒక హాల్‌ను దక్కించుకోలేని దయనీయ స్థితి. దీన్ని బట్టి రాజకీయం ఎలా వుంటుందో డాక్టర్ సునీతకు అర్థమై వుండాలి.
తండ్రిని చంపిన హంతకులకు శిక్ష పడేలా డాక్టర్ సునీత చేసిన పోరాటాన్ని ఎవరైనా అభినందిస్తారు. ఇదే సందర్భంలో రాజకీయానికి వస్తే, చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ తదితరుల స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటున్నారనే ముద్ర పడ్డ తనను ఆదరిస్తారనే ఎలా అనుకుంటున్నారో ఆమెకే తెలియాలి.
ఢిల్లీలో కూచొని జగనన్నకు ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేసినంత ఈజీ కాదు రాజకీయం. ఏదో ఆవేశంతో రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకుని, ఆ తర్వాత బాధపడితే ప్రయోజనం వుండదు. కావున డాక్టర్ నర్రెడ్డి సునీత ఆవేశంతో కాకుండా, ఆలోచనలో రాజకీయ అరంగేట్రంపై నిర్ణయం తీసుకోవడం మంచిది.