ఏపీ రాజకీయాల్లో ఉన్నంత విచిత్ర పరిస్థితి దేశంలో మరే రాష్ట్రంలోనూ ఉండదేమో! ఏపీలో ప్రభావం చూపే అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీకి కొమ్ము కాస్తున్నాయి. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ చేతిలో దర్యాప్తు వ్యవస్థల్ని చూసి ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు వణికిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ తీవ్రమైన అన్యాయం చేసినా, చేస్తున్నా ప్రశ్నించలేని దయనీయ స్థితిలో ఏపీ పార్టీలున్నాయి.
ప్రశ్నించక పోయినా, ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు. బీజేపీపై పొగడ్తలు కురిపించడానికి ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతుంటాయి. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై ఒంటికాలిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేవడాన్ని అనేకమార్లు చూశాం. కాంగ్రెస్‌పై ఆయన బాధ వేరే.
తాజాగా విజయసాయిరెడ్డి ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదుర్చుకుంటున్న నేపథ్యంలో ఆయన పోస్టు చర్చనీయాంశమైంది. ఇంకా ఆ మూడు పార్టీల మధ్య అధికారికంగా పొత్తు కుదరకనే, కూలిపోతుందని ఆయన శాపం పెట్టడం గమనార్హం.
“2014-19 మధ్య కాలంలో ఏపీకి చేసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్దానాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా వుంటుంది? ఇది మరొక ప్యాకేజీతో ఏర్పాటైన పొత్తు. ఈ మూడు కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుంది. సుస్థిర ప్రభుత్వం కోసం వైసీపీ కి ఓటు వేయండి”
ఇదీ ఆయన పోస్టులోని సారాంశం. 2014లో కూడా ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని, ఆ తర్వాత కాలంలో విడిపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. రానున్న రోజుల్లో కూడా అదే పునరావృతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పనిలో పనిగా ఏపీ ప్రజలకు సుస్థిర ప్రభుత్వం కావాలంటే… వైసీపీనే ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేయడం విశేషం.