టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్ మాట వింటే ఆ పార్టీకి మంచి భవిష్యత్ వుంటుందని సొంత పార్టీ యువ నేతలు అభిప్రాయపడుతున్నారు. జనసేనతో పొత్తును లోకేశ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. పవన్‌కల్యాణ్ అతిని భరించలేమనేది లోకేశ్ బలమైన అభిప్రాయం. ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చినా, పవన్ అనుచరుల ఆగడాలను నిరోధించలేమని లోకేశ్ పార్టీ అంతర్గత సమావేశాల్లో గట్టిగా వాదించారని అంటున్నారు.
తాజాగా బీజేపీతో పొత్తు కుదుర్చుకోడానికి చంద్రబాబు ఢిల్లీ వెళుతున్న సందర్భంలో లోకేశ్ చాలా స్పష్టంగా తన అభిప్రాయాల్ని వెల్లడించినట్టు తెలిసింది. ఎట్ట పరిస్థితుల్లోనూ జనసేన, బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ సీట్లు మించకూడదని బాబును హెచ్చరించి మరీ ఢిల్లీకి సాగనంపినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ సీట్లపై లోకేశ్‌కు పెద్దగా పట్టింపు లేకపోయినా, అసెంబ్లీకి సంబంధించి చాలా పట్టుదలగా ఉన్నట్టు సమాచారం.
అందుకే చంద్రబాబు కూడా బీజేపీకి ఆరు అసెంబ్లీ సీట్లకు మించి ఇవ్వలేనని బీజేపీకి తెగేసి చెప్పారనే మాట వినిపిస్తోంది. దీని వెనుక లోకేశ్ ఒత్తిడే కారణం. జనసేన, బీజేపీలకు పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ సీట్లు ఇవ్వడం కూడా ఎక్కువే అని లోకేశ్ అంటున్నట్టు తెలిసింది.
అయితే కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందని, ఆ పార్టీ అవసరం వుంటుందని, కావున సీట్ల విషయంలో చూసీచూడనట్టు సర్దుకుపోవాలని సీనియర్ నేతలు లోకేశ్‌కు నచ్చ చెప్పినట్టు తెలిసింది. ఎవరెన్ని చెప్పినా 30 సీట్లకు అదనంగా ఒక్క సీటు ఇవ్వడానికి కూడా లోకేశ్ ఇష్టపడడం లేదన్నది వాస్తవం. చివరికి ఏమవుతుందో చూడాలి.