ఏపీ చట్టసభలో ప్రాతినిథ్యం లేని పార్టీ అధినేత, రెండు చోట్ల నిలిచి కనీసం ఒక్క చోటైనా గెలవని నాయకుడు కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటూ రంకెలేస్తున్నారు. పార్టీ పెట్టి 9 సంవత్సరాలైనా ఇంత వరకూ ఎమ్మెల్యేగా గెలిచే దిక్కులేని నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అవాకులు చెవాకులు పేలుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనో విచిత్ర నాయకుడు. అపారమైన అజ్ఞానం ఆయన సొంతం. గమ్యం లేని రాజకీయ ప్రయాణం ఆయన లక్ష్యం. రాజకీయ పార్టీ ఎందుకు స్థాపించారో, ఎవరికి మద్దతు ఇచ్చారో, ఇస్తున్నారో, ఇస్తారో ఆయనకే తెలియనంత అజ్ఞానం. ఎప్పుడెలా నడుచుకుంటారో చివరికి ఆయనకే తెలియనంత అజ్ఞానం. అజ్ఞానం నుంచి బయటిపడి పార్టీని కాపాడుకుందామన్న ధ్యాస ఏ మాత్రం లేదు. తాజాగా కొత్త నినాదాన్ని అందుకున్నారు.
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఆయన ఆశయమట! ఇంతకూ పేరు చెప్పకుండానే గుర్తు పట్టేంత అజ్ఞాన లీడర్‌గా గుర్తింపు పొందారాయన. ఆయనే జనసేనాని పవన్‌కల్యాణ్. ఎక్కడి నుంచి వచ్చాడ్రా బాబూ అని ఏపీ ప్రజానీకం విసిగి పోయేంతగా వ్యవహరిస్తున్నారు. వైసీపీని గద్దె దించేలా వచ్చే ఎన్నికల్లో వ్యూహాలు వుంటాయని ఆయన తేల్చి చెప్పారు. దీని కోసం అప్పటి పరిస్థితులను బట్టి ఎవరితో కలవాలో, ఏం చేయాలో ఆలోచిస్తామని ఆయన అన్నారు.
ఇప్పుడేదో ఆయన టీడీపీతో విడిగా వున్నట్టు బిల్డప్. ‘వైసీపీ విముక్త ఏపీ కోసం ఇప్పటి వరకూ అధికారం చూడని అన్ని వర్గాలను కలుపుకొని అడుగులు వేస్తాం’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు సీఎం అయితే మాత్రం… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, బలిజ తదితర కులాలకు అధికారం దక్కినట్టు అర్థం చేసుకోవాలా? అని ప్రశ్నించే వాళ్లకు పవన్ సమాధానం ఏంటి? జగన్‌పై విద్వేషానికి హద్దూఅదుపూ ఉండగా? ఇంత ఓర్వలేని తనమా?
విచక్షణ కోల్పోయేంత ద్వేషమా? ఈ సంబడానికి రాజకీయ పార్టీ ఎందుకు? పల్లకీ మోయాలనుకుంటున్న పార్టీలో జనసేనను విలీనం చేయొచ్చు కదా? ఇతర పార్టీలు పట్టించుకోకపోయినా, పదేపదే జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనని చెప్పడం అంటే అజ్ఞానం కాక మరేంటి? పార్టీ పెట్టినప్పటి నుంచి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే పవన్‌కల్యాణ్ అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు.
తన పార్టీ అధికారంలోకి వచ్చే మార్గం గురించి ఆలోచిస్తే… కాసిన్ని ఓట్లైనా పడతాయి. చంద్రబాబు అధికారం కోసం జనసేనాని తపిస్తున్నారనే సంకేతాలు జనంలోకి వెళ్లాయి. ఇది జనసేనకు మరోసారి రాజకీయంగా తీవ్ర నష్టం చేస్తుంది. దాని నుంచి బయట పడాలంటే ముందు తనలోని అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి.