కాశ్మీర్లో భాజపా ప్రభుత్వం ఏర్పడుతుందా? ప్రస్తుతానికి అక్కడ కేంద్రం పరిపాలనే సాగుతోంది. తొందర్లో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం చెబుతోంది. ఎన్నికలు నిర్వహించేలోగా.. అక్కడ ఎంతమంది కొత్త ఓటర్లు తయారౌతారు. ఆ కొత్త ఓటర్లు ఏయే ప్రాంతాల నుంచి వలస వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఓటర్లుగా నమోదు చేయించుకుంటారు. అనే అంశాలు చాలా కీలకం. ఎందుకంటే.. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ద్వారా.. మొత్తం శాసనసభనే భారతీయజనతా పార్టీ చేజిక్కించుకునే యోచన చేస్తున్నదా అనే భయం కాశ్మీరీ పార్టీల్లో కలుగుతోంది.
ఇందులో కేవలం రాజకీయ కోణం మాత్రమే కాదు.. ఇంకో ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇతర ప్రాంతాలనుంచి వలస వెళ్లి అక్కడ అందరూ ఓటర్లుగా నమోదు చేయించుకుంటే.. వారి మానప్రాణాలకు భద్రత ఏమాత్రం ఉంటుందనేది కూడా అనుమానమే. అలాంటి కొత్త ఓటర్లు తమ ప్రాంత అస్తిత్వానికి ప్రమాదం తలపెట్టడానికే వచ్చారని స్థానికులు తలిస్తే.. హత్యలు, ఊచకోతలు మళ్లీ పునరావృతం అయినా ఆశ్చర్యం లేదు.
ఓటర్ల జాబితాల్లో కొత్తగా బయటి వ్యక్తులను చేర్చడానికి జరుగుతున్న ప్రయత్నాలను జమ్మూకాశ్మీర్ లోని పార్టీలని ఐక్యంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి ప్రయత్నం తమకు ఆమోదయోగ్యం కాదంటున్నాయి. న్యాయస్థానాలతో సహా అన్నిచోట్లా ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తాం అని హెచ్చరిస్తున్నాయి. మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలో అనేక పార్టీల నాయకులు సమావేశమై ఈ మేరకు తమలోఉన్న భయాన్ని వ్యక్తం చేశారు.
ఇలాంటి ప్రయత్నం వల్ల స్థానికులైన డోగ్రా, కశ్మీరీ, పహరీ గుజ్జర్, సిక్కులు తమ అస్తిత్వం కోల్పోతారని కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనలో నిజం ఉంది. కానీ.. వారి న్యాయపోరాటం ఫలిస్తుందన్న నమ్మకం మాత్రమే కలగడం లేదు.
ఎందుకంటే.. ఒకసారి ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత.. జమ్మూ కాశ్మీర్ లో కూడా దేశంలోని ఏ ప్రాంతం వారైనా వచ్చి స్థిరపడవచ్చు. స్థిరపడడం అంటేనే.. ఆటోమేటిగ్గా అక్కడే ఓటు హక్కును కూడా పొందవచ్చు. బయటివారి ప్రాబల్యం పెరిగేకొద్దీ.. గెలుపు అవకాశాలు బిజెపికే పెరుగుతాయి. బయటి వారు వచ్చి అక్కడ స్థిరపడగల వాతావరణం కల్పించినదే బిజెపి గనుక.. వారికి జైకొట్టే వారే.. అక్కడ చేరుతారు.
ఏతావతా.. శాసనసభ ఎన్నికలు ముగిసే సమయానికి జమ్మూకాశ్మీర్ లో కమలపతాకం రెపరెపలాడే అవకాశం ఉన్నదని పలువురి విశ్లేషణ. లేదా.. కమల పతాకం ఎగిరరే వాతావరణం ఏర్పడిన తర్వాతనే శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తారనేది మరో విశ్లేషణ.
370 చట్టం రద్దయిన నేపథ్యాన్ని వాడుకుని.. ఆ ముసుగులో అక్కడకు తమ అనుకూలురను పెద్దసంఖ్యలో పంపి.. రాజకీయాధికారం కోసం కుట్రలు చేస్తారనడం నిజమే అయితే గనుక.. అది పరోక్షంగా అనేక కొత్త సమస్యలకు కూడా కారణమవుతుంది. ఆ సంగతి పాలకులు తెలుసుకోవాలి.