జనసేన పార్టీలో గట్టిగా చెప్పుకోదగ్గ నాయకులు ఎవరు అని అడిగితే.. మూడో పేరు చెప్పడానికి పార్టీ కార్యకర్తలే కాదు, బహుశా పవన్ కల్యాణ్ కూడా తడబడతారేమో. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తప్ప ఆ పార్టీకి ఇప్పటిదాకా మరొకర సీనియర్, ముఖ్య నాయకుడు లేరు.
ఒకరిద్దరు ఉండేవారు.. ఇప్పుడు పార్టీ మూడో నేతకు దారిలేని పార్టీగానే ఉంది. అలాంటి జనసేనలో ముఠాలు కూడా ఉన్నాయా? ముఠాలు కట్టి.. ఒక నాయకుడిని బద్నాం చేయడానికి కుట్రపూరిత ప్రచారాలు చేస్తున్నవారు కూడా ఉన్నారా? అసలు నాయకులే లేరు మొర్రో అనుకుంటూ ఉంటే.. ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకోవడం కూడానా? అనే చర్చ వినిపిస్తోంది.
పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జనసేన నాయకులకు హెచ్చరికలు కూడా చేశారు. అందరూ క్రమశిక్షణతో ఉండాలని, పార్టీలో ప్రోటోకాల్ ను కాదని, సోషల్ మీడియాలో పార్టీ నాయకుల మీద రచ్చ చేస్తే, విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నాయకుల మధ్య విభేదాలు ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలే తప్ప.. సోషల్ మీడియాకు ఎక్కకూడదని హితవు చెప్పారు.
మీరు వేరే పార్టీల్లోకి వెళ్లిపోయినా పర్లేదు.. ఇక్కడే ఉండి ఇతర పార్టీ నాయకులతో కలిసి రాజకీయాలు చేస్తే సహించేది లేదు అని హెచ్చరించారు. ప్రజారాజ్యం పార్టీ మునిగిపోయినప్పటినుంచి.. పార్టీలో ఉండే నాయకులు.. నిత్యం పార్టీని ముంచేయడానికి కుట్రలు చేస్తూనే ఉంటారు అనే అభిప్రాయానికి పవన్ ఫిక్సయిపోయినట్లుంది. మనుషుల్ని నమ్మడం అనేది ఆయన మర్చిపోయినట్లుంది.
తిరుపతిలో కూడా.. ప్రజారాజ్యం పార్టీని వైఎస్ కుటుంబ కోవర్టులు ముంచేశారని చాలా పెద్ద మాట వాడారు. ఇప్పుడు తన సొంత పార్టీలో ఉన్న నాయకుల్ని.. ఇతర పార్టీల వారితో కలిసి రాజకీయాలు చేయొద్దని అంటున్నారు. అంటే… ఇప్పటికీ పవన్ కల్యాణ్, తన జనసేనలో జగన్మోహన్ రెడ్డి అనుకూల వ్యక్తులు ఉన్నారని భయపడుతున్నట్లే కనిపిస్తోంది.
ఒకవేళ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలతో సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు వచ్చి ఉంటే కూడా.. వెంటనే దానిని కుట్ర రాజకీయాలనే ముద్ర వేసేసి వారిని అవమానిస్తూ, నిత్యం అనుమానిస్తూ ఉంటే పవన్ కల్యాణ్ అసలు పార్టీని ఎలా నడుపుతారు. పార్టీలో ఉన్నవారంతా తన వెనుక గోతులు తవ్వుతున్నారేమో అనే భయం పవన్ లో మితిమీరిపోతున్నట్టుందని పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.
ఇలాంటి భయాలతోనే.. పార్టీనే నమ్ముకుని ఉన్న అనేక మంది నాయకుల్ని కూడా.. ఎదగనివ్వకుండా, వారికి ఎక్స్‌పోజర్ ఇవ్వకుండా చేస్తున్నారని పార్టీ లో విమర్శలున్నాయి. పవన్ అది వ్యూహం అనుకుంటుండవచ్చు గానీ, అదే పార్టీ పుట్టిముంచుతుందనేది పలువురి ఉవాచ.