మునుగోడులో బిజెపి సెల్ఫ్ గోల్!

మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే.. ఏదో ఆయన సొంత హవా, పెట్టగల డబ్బు బట్టి గెలవాల్సిందే తప్ప.. బిజెపి హవా వల్ల గెలుస్తారని అనుకుంటే పొరబాటు. మంచో చెడో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…

మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే.. ఏదో ఆయన సొంత హవా, పెట్టగల డబ్బు బట్టి గెలవాల్సిందే తప్ప.. బిజెపి హవా వల్ల గెలుస్తారని అనుకుంటే పొరబాటు. మంచో చెడో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఒక సొంత ఇమేజి, ప్రజాదరణ తయారు చేసుకున్నారు. దాన్ని నమ్ముకునే ఇప్పుడు బిజెపి అక్కడరంకెలు వేస్తోంది. 

కోమటిరెడ్డి బిజెపి హవాని నమ్ముకుని రాజీనామా చేయలేదు. అదే సమయంలో భవిష్యత్తులో ఏదైనా అద్భుతం జరిగి.. బిజెపి ఇంకా బలంగా తయారైపోతే తనకు లబ్ది ఉంటుందనే ఆశ తప్ప.. ఇప్పటికిప్పుడు ఆయనకు బిజెపి వల్ల ఒరిగేది లేదు. ఇదొక ఈక్వేషన్ కాగా, నిజానికి మునుగోడు సభలో బిజెపి మాట్లాడిన మాటలు సెల్ఫ్ గోల్ వేసినట్లుగానే ఉన్నాయి. కేసీఆర్ ట్రాప్ లో చిక్కుకోవడం ద్వారా.. బిజెపి అలా సెల్ఫ్‌గోల్ వేసుకుంది.

బిజెపి జవాబు చెప్పలేని మూడు ప్రశ్నలను సామాన్యుడి ఎదుట ఉంచి కేసీఆర్ సవాలు విసిరారు. వాటిలో ఒక్క ప్రశ్నకు మాత్రమే బిజెపి జవాబు చెప్పింది. ఒక దానికి మిన్నకుండిపోయింది. మరో విషయంలో దెబ్బతింది. 

పెరుగుతున్న పెట్రోలు ధరలు, వంటగ్యాస్ ధరలు, వ్యవసాయ మీటర్లను కేసీఆర్ ప్రస్తావించారు. పెట్రో ధరల విషయంలో మోడీ సర్కరు రెండుసార్లు ధరలు తగ్గించినా కేసీఆర్ తదనుగుణంగా తగ్గించలేదని బిజెపి నాయకులు ఒక పసలేని జవాబు చెప్పారు. వంటగ్యాస్ విషయంలో మిన్నకుండిపోయారు. వ్యవసాయ మీటర్ల విషయంలో సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. 

ఎలాగంటే.. హుజూరాబాద్, దుబ్బాకల్లో కూడా బిజెపి గెలిచిందని, అక్కడ వ్యవసాయ మీటర్లు వచ్చాయా? అని కమల నాయకులు ప్రశ్నించారు. ఇది అచ్చంగా ప్రజలను వంచించడానికి చెప్పిన అబద్ధపు మాట. ఒక ఎమ్మెల్యే గెలిస్తే తన నియోజకవర్గంలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టించడం ఎలా సాధ్యమవుతుంది. యావత్ తెలంగాణలోకి మీటర్లు అడుగే పెట్టకుండా.. కేసీఆర్ అడ్డుగోడలా నిల్చున్నంత కాలమూ.. ఎన్నిచోట్ల బిజెపి గెలిచినా వ్యవసాయానికి మీటర్లు పెట్టడం సాధ్యం కాదు. ఆ నిర్ణయం కేసీఆర్ ది. 

దుబ్బాక, హుజూరాబాద్ ఎమ్మెల్యేలది కాదు. బిజెపి చెబుతున్న మాటల మర్మం ఎలా ఉన్నదంటే.. రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి వచ్చే వరకు మీకు వ్యవసాయ మీటర్ల బెడద ఉండదు. అని చెబుతున్నట్లుగా ఉంది. ఇలాంటి మాటలతో ఆ పార్టీ పరువేపోతోంది.

బిజెపి నాయకులకు తమ మీద వస్తున్న నెగటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టడం చేతకాకపోతే పోయె.. దానివలన మునుగోడులో కోమటిరెడ్డి ఓటమికి కూడా బాటలు వేస్తారేమో అనే అభిప్రాయం కూడా పలువురిలో కలుగుతోంది.