జనసేనాని పవన్‌కల్యాణ్ మహిళలపై ప్రత్యేక దృష్టి సారించారు. మహిళలంటే విపరీతమైన ప్రేమాభిమానాలు తనకు ఉన్నట్టు నిరూపించుకునేందుకు భారీ డైలాగ్‌లు కొడుతుంటారు. అంతెందుకు, జనసేన పార్టీకి చెందిన మహిళా నాయకులకు వీర మహిళలని పేరు పెట్టిన పవన్ అంతరంగాన్ని అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ అగ్రహీరోగా, పవర్‌స్టార్‌గా ఆయనకు మహిళల్లో అభిమానులుండొచ్చు.
అయితే రాజకీయాలకు వచ్చే సరికి తన వ్యక్తిగత జీవితం మహిళల ఆదరణ చూరగొనదనే ఆత్మన్యూనత భావం పవన్‌ను వెంటాడుతోందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ప్రత్యర్థులు ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు. ఎందుకంటే పవన్ ఇంత వరకూ అధికారంలో లేరు. దీంతో ఆయనపై అవినీతి ఆరోపణలు చేసే అవకాశం లేదు. దీంతో పవన్ పర్సనల్ లైఫ్ ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యింది.
పవన్ నిత్య పెళ్లి కొడుకు అంటూ ప్రత్యర్థులు ఒక ముద్ర వేశారు. దీన్ని ఎంత చెరిపేసుకుందామన్నా, వీలు కాని దుస్థితి. అవినీతిపరులనైనా సమాజాన్ని పట్టించుకోదు. కానీ, వివాహ జీవితంలో స్థిరత్వం లేకుండా, మూడు నాలుగేళ్లకు ఒక మహిళను పెళ్లాడుతూ పోతే, పౌర సమాజం అసహ్యించుకుంటుంది. పవన్‌కల్యాణ్ సినిమా నటుడిగా ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ , వివాహాల విషయంలో మాత్రం ఆయన నైతికంగా అపరాధిగా నిలబడాల్సి వస్తోంది.
పవన్‌ను నిత్య పెళ్లి కొడుకుగా సమాజానికి చూపి, ఆయన్ను రాజకీయంగా అనుసరించే జనసేన నాయకులు, కార్యకర్తలను కూడా పోకిరీలుగా చిత్రీకరించడంలో టీడీపీ, వైసీపీ సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా తనతో వివాహ బంధంలో వుంటూ, మరో మహిళతో బిడ్డ కంటే ఎలా వుంటుందనే రేణూదేశాయ్ ప్రశ్న… పవన్‌కు వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎప్పటికీ ఇబ్బందికరమే. తన వ్యక్తిగత విషయాల్ని ప్రత్యర్థులు ఎందుకు మాట్లాడుతున్నారని పవన్ పదేపదే ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
దీంతో మరింతగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రత్యర్థులు అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. నిన్నటి ఏలూరు సభలో పవన్ మాట్లాడుతూ వాలంటీర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణ చేశారు. ఇదంతా మహిళల ఆదరణ పొందే క్రమంలో పవన్ ఆడుతున్న డ్రామాగా చెబుతున్నారు. మహిళల విషయంలో తన వ్యక్తిగత నడవడిక అంత గొప్పగా లేదని సమాజం భావిస్తోందనే ఆలోచనే పవన్‌ను కుదురుగా ఉండనివ్వడం లేదు.
పవన్ అంటే అమ్మాయిల పిచ్చోడనే అభిప్రాయాన్ని జనంలో కలిగించడంలో వైసీపీ, టీడీపీ , ఆ పార్టీల అనుకూల మీడియాలు విజయవంతం అయ్యాయి. అందుకే జనసేన అంటే మెజార్టీ మహిళా లోకం అంటరాని పార్టీగా చూస్తోంది. జనసేన నాయకులు, కార్యకర్తలంటే… మహిళల వ్యతిరేకులుగా పౌర సమాజం భావిస్తోందన్న ఆలోచన ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. జనసేనలో సభ్యత్వం వుండాలంటే… పోకిరీ లక్షణాలు ఉండాలనే బలమైన అభిప్రాయం సమాజంలో ఉంది. ఇదంతా పవన్ వ్యక్తిగత జీవితం తాలూకూ వేసిన నెగెటివ్ ముద్ర అని చెప్పక తప్పదు. దీని నుంచి బయటపడడం పవన్‌కు, ఆ పార్టీ నాయకులకు సాధ్యమయ్యే పనికాదు.
పవన్ ప్రసంగాల్లో ఎక్కువగా మహిళలకు సమయం కేటాయించడం వెనుక బలమైన కారణం వుంది. పవన్ ప్రత్యర్థులు, ఇతర నాయకుల వ్యక్తిగత జీవితాల్లో చోటు చేసుకోని ఘటనలు, జనసేనానికే మాత్రం సొంతం. వీటన్నింటి నుంచి బయటపడేందుకు పవన్ పదేపదే మహిళల శ్రేయోభిలాషి అనే అభిప్రాయం కలిగించేందుకు పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటారు. మహిళలపై సానుభూతి వ్యాఖ్యలన్నీ వారిలో తనపై వ్యతిరేక భావన తుడిపేసుకునేందుకే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.