అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమరనాధ్‌కు తెలుగుదేశం పార్టీలో లుకలుకలు కలసివస్తున్నట్లుగా ఉన్నాయని అంటున్నారు.
అనకాపల్లి నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు ఇద్దరు కీలక నాయకుల మధ్య రసవత్తరమైన పోరు సాగుతోంది. ఒకరు మాజీ ఎమ్మెల్యే అయితే మరొకరు మాజీ ఎమ్మెల్సీ. ఈ ఇద్దరూ చంద్రబాబుకు ఆప్తులే.
అయితే మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ నాన్ లోకల్‌గా ఉన్నారు. ఆయన పెందుర్తికి చెందిన వారు. అనకాపల్లిలో 2014 ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు. 2019లో మాత్రం జగన్ ప్రభంజనంలో ఓటమి చెందారు.
ఇక అప్పట్లోనే టిక్కెట్ కోసం ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావుకు నామినేటెడ్ పదవి ఇచ్చి చంద్రబాబు సర్దుబాటు చేశారు. ఈసారి మాత్రం టిక్కెట్ తనకే ఇవ్వాలని ఆయన పట్టుదల మీద ఉన్నారు. తాను నూరు శాతం స్ధానికుడిని అని ఆయన వాదన వినిపిస్తున్నారని అంటున్నారు.
ఈ ఇద్దరు నేతలలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా రెండవ వర్గం పనిచేస్తుందా అన్న ఆందోళన కూడా ఉంది. ఈ పరిణామాలనే ఇపుడు యువ మంత్రి గుడివాడ అమరనాధ్ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అనకాపల్లిలో గవర సామాజికవర్గానికి ధీటుగా కాపులు కూడా ఉన్నారు. టీడీపీలో టిక్కెట్ కోసం పోటీ పడుతున్న ఇద్దరూ గవర సామాజికవర్గం వారే. దాంతో వారిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా కాపుల మద్దతుతో పాటు టీడీపీలో వర్గ పోరు కూడా కలసివచ్చి గుడివాడ గెలుపు సునాయాసం అవుతుందని వైసీపీ అంచనా వేసుకుంటోందిట.