2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో టీడీపీపై జనసేనాని పవన్‌కల్యాణ్ ఏ విమర్శలు చేశారో, ఇప్పుడు వైసీపీపై వాటినే పునరావృతం చేస్తున్నారు. సభ పెడితే చాలు…. నా భార్య, మా తల్లి, మా పిల్లల్ని బూతులు తిట్టారంటూ వ్యక్తిగత అంశాల్ని ఎక్కువగా, సామాజిక సమస్యలను తక్కువగా మాట్టాడ్డం పవన్‌కు వ్యసనంగా మారింది. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఆయన్ను తిట్టడం పవన్‌కు అలవాటుగా మారింది. దీంతో పవన్ ప్రసంగాలు జనాలకు బోరు కొడుతున్నాయి.
ఇదేంద్రా బాబూ… 24 గంటలూ నా పెళ్లాన్ని తిట్టారు, మా అమ్మను అన్నారంటూ ఏడ్పులని ప్రజలు అసహనం ప్రదర్శిస్తు న్నారు. 2019 ఎన్నికలకు ముందు కూడా తన తల్లి, భార్యను టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా టార్గెట్ చేశారని, దుష్ప్రచారం చేస్తున్నారంటూ ట్విటర్ వేదికగా ఎల్లో మీడియా యజమానులపై ఘాటు కామెంట్స్ చేశారు. ఈ వ్యవహారంలో పవన్‌పై ఎల్లో మీడియా అధిపతి ఆర్కే పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో తనపై లోకేశ్ హత్యాయత్నం చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
ఇప్పుడు వైఎస్ జగన్‌పై అవే ఆరోపణల్ని పునరావృతం చేయడం గమనార్హం. నిన్నటి ఏలూరు సభలో పవన్ అసహనానికి హద్దే లేకుండా పోయింది. మహిళలపై వలంటీర్లు వలపన్నారని పవన్ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ పిచ్చి పతాక స్థాయికి చేరిందనేందుకు ఇదే నిదర్శనమని ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు.
ఏలూరులో ఆదివారం జరిగిన వారాహి రెండో దశ విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తూ… ‘నా జోలికి వస్తే డొక్క చించుతా. చావుకు సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా. ఎప్పుడు ఎవరు నన్ను చంపుతారో నాకే తెలీదని ప్రతీ రోజూ నా తల్లి, భార్యకు చెప్పి బయటకు వస్తున్నా. ఎప్పుడైనా చావడానికి సిద్ధమే. దాడి చేయాలని చూస్తే చొక్కా గుండీ విప్పి మరీ ఎదురెళ్తా. నేను రాజకీయ విలువల గురించి మాట్లాడుతుంటే నా ఇంటి ఆడబిడ్డలు, తల్లి, పిల్లల గురించి ఈ వైసీపీ నాయకులు నీచంగా మాట్లాడుతున్నారు’ అని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో చెలరేగిపోయారు.
ఎంతసేపూ… నేను, నేను అనడమే కనిపిస్తోంది. మా ఇంటి ఆడబిడ్డల్ని తిడుతున్నారని ఆయన సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత బాధల్ని చెప్పుకోడానికా వారాహి యాత్ర చేపట్టిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చావుకు భయపడేది లేదనే సినిమా డైలాగ్ ఆయన ప్రసంగాల్లో తప్పనిసరైంది. అలాగని చావుకు తెగించి ఏం చేశారని ప్రశ్నిస్తే… నో ఆన్సర్.
సరిగ్గా పది కిలోమీటర్లు నడిచిన దాఖలాలు ఆయన రాజకీయ ప్రస్థానంలో లేవు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఏపీలో వలంటీర్లు అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారనే విషయాన్ని జనాలకు తెలియజేయాలని కేంద్ర నిఘా సంస్థలు తనకు చెప్పినట్టు పవన్ కామెడీ చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటివి ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో అని జనాలు విసుగ్గా ఉన్నారు.