‘తాను వెళితే మజ్జిగకు గతిలేదు.., పెరుగుకు చీటీ పంపాట్ట’ అన్న సామెత చందంగా ఉంది పవన్ కల్యాణ్ వ్యవహారం. తాను ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కంటున్న, పొద్దస్తమానమూ షూటింగ్ ల మధ్య గ్యాప్ దొరికినప్పుడెల్లా చెలరేగిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యేకే దిక్కులేదు.. అలాంటిది.. ఏదో పండగలకు శుభాకాంక్షలు, జెండా ఎగరేయడాలూ వంటి కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైన తెలంగాణ అసెంబ్లీలో ఏకంగా పదిమంది ఎమ్మెల్యేలు తన పార్టీ తరఫున ఉండాలని కోరుకుంటున్నారు.
అత్యాశకు వెళ్లి మాట్లాడుతున్నారో, అమాయకంగా సెలవిస్తున్నారో తెలియదు గానీ.. పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో కూడా తమ పార్టీ అస్తిత్వం గురించి ఆశలు వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా నాచుపల్లిలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలను గమనిస్తే.. ఆయనలో ఎంత గందరగోళం ఉన్నదో అందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థితిలో నేను లేను.. వారినుంచి నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను అని పవన్ అంటున్నారు. సందేశం సంగతి సరే, ఆయన తన మాటల ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు ఏం సంకేతం ఇవ్వదలచుకుంటున్నారో కూడా అర్థం కావడం లేదు.
తెలంగాణలో భాజపాతో పొత్తు ఉండదు అంటారు.. కానీ తన మద్దతు వారికి ఉంటుందంటారు. అదే సమయంలో.. 7 నుంచి 14 ఎంపీ సీట్లలో తమ పార్టీ అభ్యర్థులు పోటీచేస్తారని అంటున్నారు. పోటీచేయకపోయినా కూడా రాష్ట్రమంతా జనసేన ప్రభావం చూపించాలనీ అంటున్నారు. పనిలోపనిగా అసెంబ్లీ సీట్ల విషయంలో ఎవరైనా పార్టీలు తనతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వస్తే సిద్ధం అని కూడా సెలవిస్తున్నారు.
ఇంతగా అస్పష్టమైన మాటలతో తనలోని కన్ఫ్యూజన్, గందరగోళాన్ని ప్రజల మీదికి వెదజల్లే నాయకుడు ప్రస్తుత రాజకీయాల్లో మనకు కనిపించరు. భాజపాతో పొత్తు ఉండదు- మద్దతిస్తా అంటున్న ఈ నాయకుడు.. మరొకరు పొత్తు పెట్టుకుని ముందుకు వస్తే వారిని ఏం చేస్తారు? కాపురం చేయను కానీ కలిసి ఉంటా.. కాపురానికి ఇంకెవరైనా ముందుకు వస్తే రెడీ.. ఎవరైనా సరే.. అని చెబుతున్నట్లుగా ఉంది. పవన్ కల్యాణ్ కు అసలు తాను మాట్లాడుతున్న మాటల అర్థం తనకైనా తెలుసో లేదో అనిపిస్తోంది.