చేతులెత్తేసిన ప‌వ‌న్‌…తేల్చుకోవాల్సింది కాపులే!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ అజ్ఞాన‌మో, మ‌రొక‌టో…. కార‌ణం ఏదైనా ఆయ‌న రాజ‌కీయంగా చేతులెత్తేశారు. ఇంత‌కాలం నాగ‌బాబు త‌దిత‌ర జ‌న‌సేన నాయ‌కులు జ‌న‌సేన ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అని చెబుతున్న‌వ‌న్నీ ఉత్తుత్తివే అని ఇవాళ్టితో తేలిపోయింది.…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ అజ్ఞాన‌మో, మ‌రొక‌టో…. కార‌ణం ఏదైనా ఆయ‌న రాజ‌కీయంగా చేతులెత్తేశారు. ఇంత‌కాలం నాగ‌బాబు త‌దిత‌ర జ‌న‌సేన నాయ‌కులు జ‌న‌సేన ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అని చెబుతున్న‌వ‌న్నీ ఉత్తుత్తివే అని ఇవాళ్టితో తేలిపోయింది. చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోయ‌డం త‌ప్ప‌, త‌న‌కు రాజ‌కీయంగా మ‌రో ప్ర‌త్యామ్నాయం లేద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌రోక్షంగా స్ప‌ష్ట‌త ఇచ్చారు. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాలు, ప్ర‌శ్నించ‌డానికే పార్టీ లాంటి మాట‌ల‌న్నీ ఆర్భాట ప్ర‌క‌ట‌న‌లే అని తేలిపోయింది.

పవ‌న్‌క‌ల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ పొత్తుల‌పై దాదాపు క్లారిటీ ఇచ్చారు. టీడీపీతో సీట్ల సంగ‌తి తేల‌డం ఒక్క‌టే మిగిలి వుంది. టీడీపీ పేరు ఎత్త‌కుండానే ఆయ‌న పొత్తుల‌పై ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే…

“ఖ‌చ్చితంగా పొత్తు పెట్టుకుంటాం. కొంద‌రిని ఒప్పిస్తాం. సీఎం సీటు ఇస్తే త‌ప్ప పొత్తుకు ఒప్పుకోవ‌ద్ద‌ని సూచించే వాళ్లున్నారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 137 సీట్ల‌లో అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌డ‌మే గొప్పు. 137 సీట్ల‌లో  క‌నీసం 30 నుంచి 40 సీట్ల‌లో గెలిచి వుంటే, సీఎం సీటు డిమాండ్ చేయాల‌నే వాద‌న‌కు బ‌లం వుండేది. అప్పుడు క‌ర్నాట‌క‌లో జేడీఎస్ నేత కుమార‌స్వామి గౌడ్‌లాగా నాకు అవ‌కాశాలుండేవి. భాగ‌స్వామ్య పార్టీని ముఖ్య‌మంత్రి ప‌ద‌విని డిమాండ్ చేయాలంటే క‌నీసం 30 లేదా 40 ఎమ్మెల్యే సీట్లు చేతిలో వుండాలి”

అలాగే రాయ‌ల‌సీమ‌లో త‌న‌కు బ‌లం లేద‌ని ఆయ‌న ఒప్పుకున్నారు. త‌న‌కు బ‌లం ఉన్న చోట త‌ప్ప‌క అభ్య‌ర్థుల‌ను నిల‌బెడుతామ‌న్నారు. బ‌లం అంటే త‌న సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉన్న ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో అని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. ఆ జిల్లాల్లో 36 శాతం వ‌ర‌కూ జ‌న‌సేన ఓటు బ్యాంక్ వుంద‌ని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొన్ని విష‌యాల‌పై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అలాగే త‌న సామాజిక వ‌ర్గానికి స్ప‌ష్ట‌త ఇచ్చారు.

సీఎం సీటు అడిగేంత బ‌లం త‌న‌కు లేద‌ని, చంద్ర‌బాబునాయుడి ప‌ల్ల‌కీ మోయ‌డానికి సిద్ధంగా ఉండాల‌ని త‌న పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. అలాగే వైసీపీని ఓడించ‌డానికి టీడీపీకి బేష‌ర‌తుగా పొత్తుకు సిద్ధ‌మ‌నే సంకేతాలు ఇచ్చారు. కాపు నాయ‌కుడైన ప‌వ‌న్‌క‌ల్యాణ్ సీఎం కావాల‌న్న హ‌రిరామ‌జోగ‌య్య త‌దిత‌ర ఆ సామాజిక వ‌ర్గం ఆకాంక్ష‌ను మొగ్గ ద‌శ‌లోనే ప‌వ‌న్ తుంచేశారు. త‌న త‌పన‌, ఆరాటం చంద్ర‌బాబునాయుడిని సీఎం చేయ‌డ‌మే అని ఇవాళ మ‌రింత స్ప‌ష్ట‌త ఇచ్చారు.

ఇక తేల్చుకోవాల్సింది మీరే అని కాపులు, బ‌లిజ‌, త‌దిత‌ర అనుబంధ కులాలకు తేల్చి చెప్పారు. త‌న బానిస‌త్వాన్ని గౌర‌వించి, వెంట న‌డిచే వాళ్లే త‌న వాళ్ల‌ని మ‌రోసారి ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. ఈ విష‌యంలో ప‌వ‌న్‌ని అభినందించాల్సిందే. ఎందుకంటే ఇందులో మోసం, కుట్ర‌లు లేవు. వైఎస్ జ‌గ‌న్‌పై అక్క‌సుతో చంద్ర‌బాబును నెత్తిన పెట్టుకోవాల‌నే మ‌న‌సులోని ఉద్దేశాన్ని బ‌హిరంగ ప‌రిచారు. 

ప‌వ‌న్ మాదిరిగానే చంద్ర‌బాబును మోయాల‌నే ఉత్సాహం ఉన్న వాళ్లు జ‌న‌సేన‌లోనే ఉండొచ్చు. జ‌న‌సేన కార్యక‌ర్త‌లుగా టీడీపీ జెండాలు మోస్తూ ఊరేగ‌వ‌చ్చు. ఇంత స్ప‌ష్టంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెబుతుంటే, ఆయ‌న్ను తిడుతూ అదే పార్టీలో ఉండ‌డం వృథా. ప‌వ‌న్ ఆశ‌యాలు, ఆకాంక్ష‌లు న‌చ్చని వాళ్లు త‌మ దారి ఏటో చూసుకోవ‌చ్చు. లేదంటే చంద్ర‌బాబుకు  భుజం కాసే ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డొచ్చు. ముఖ్యంగా ఆయ‌న్ను అభిమానించే ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం తేల్చుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది.