పవన్ ‘ఇల్లు’ అంటే.. జగన్ ‘పెళ్లి’ అంటారు..

‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ అనేది పాపులర్ సామెత! ఈ రెండు పనులు కూడా చాలా ప్రయాసతో కూడుకున్నవి అని సామెతను రూపొందించిన పెద్దల ఉద్దేశం కావొచ్చు. కానీ.. ఈ డబ్బు…

‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ అనేది పాపులర్ సామెత! ఈ రెండు పనులు కూడా చాలా ప్రయాసతో కూడుకున్నవి అని సామెతను రూపొందించిన పెద్దల ఉద్దేశం కావొచ్చు. కానీ.. ఈ డబ్బు పుష్కలంగా ఉండాలే గానీ.. రెండూ కూడా చాలా సునాయాసమైన వ్యవహారాలు అని అనేక సందర్భాల్లో నిరూపణ అవుతూనే ఉంటుంది. అదే సమయంలో.. ఇల్లు- పెళ్లి చుట్టూ నాయకులు  ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ ఉండడం కూడా జరుగుతోంది. పవన్ కల్యాణ్ తన మాటల్లో మరే అంశమూ దొరకలేదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇళ్ల గురించి మాట్లాడుతోంటే.. జగన్మోహన్ రెడ్డి పవన్ కల్యాణ్ చేసుకున్న పెళ్లిళ్ల గురించి మాట్లాడుతుంటారు.

పవన్ కల్యాణ్ తాజాగా విశాఖపట్నంలో వారాహి విజయయాత్రలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన రుషికొండ నిర్మాణాలను కూడా పరిశీలించాలని అనుకున్నారు. రుషి కొండ నిర్మాణాల పరిశీలనకు ప్రభుత్వానికి అభ్యంతరాలేమీ లేవు.

గతంలో ఇతర పార్టీల నాయకులు, సీపీఐ నారాయణ వంటి వారు పరిశీలించాలని అడిగినా పోలీసులు అనుమతించారు. అయితే తాను అడుగు తీసి అడుగువేస్తే చాలు ఆర్భాటంగా జాస్తిగా ఉండాలని కోరుకునే పవన్ తీరు తెలుసు గనుక కొన్ని ఆంక్షలు విధించారు. పదివాహనాలు వెళ్లడానికి అనుమతించడే చాలా ఎక్కువ. మొత్తానికి అక్కడిదాకా వెళ్లే ప్రయత్నంలోనే పవన్ కల్యాణ్ కాస్త రభస చేయాలని చూశారు.

పవన్ వెంట   భారీగా జనసందోహాన్ని పోగేసుకుని వస్తున్నందువల్ల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ రోడ్డమ్మట అంచెలవారీగా భద్రత వ్యవస్థను పోలీసులు ఏర్పాటుచేశారు. అయినా పవన్, జోడుగుళ్ల పాళెం కూడలి వద్ద రద్దీగా ఉండగా.. ఒక్కసారిగా కారు దిగేసి.. అక్కడ గందరగోళం ఏర్పడేలా చేయాలని ప్రయత్నించారు. పోలీసులు ఆయనను బతిమాలి మళ్లీ కారులో కూర్చెబెట్టాల్సి వచ్చింది.

ఇంతా కలిపి పవన్ సాధించింది ఏమిటి? జగన్ కు ఎన్ని ఇళ్లు కావాలి? ఉన్న ఇళ్లు చాలవా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న పవన్ అజ్ఞానానికి ప్రతీక. ఎందుకంటే.. జగన్ తన వ్యాపారాలు తానుచేసుకుంటున్నప్పుడు బెంగుళూరులో ఇల్లు కట్టుకున్నారు. తండ్రి మరణం తర్వాత.. ఏపీ రాజకీయాల్లోకి వచ్చాక హైదరాబాదులో, విభజన తర్వాత తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు. ఇవేమీ చట్టవ్యతిరేకమైనవి కాదు. రుషికొండ వద్ద నిర్మాణం అవుతున్నది జగన్ సొంత ఆస్తి, సొంత ఇల్లు కాదు. అది విశాఖలో జగన్ అధికారిక నివాసం అనే ప్రకటన కూడా ఇప్పటిదాకా లేదు. అయినా పవన్ కల్యాణ్ ఓర్వలేని వైఖరి ఆయనతో ఇలాంటి మాటలు అనిపిస్తోంది.

పవన్ ఇలా తలాతోకా లేకుండా జగన్ ఇళ్ల గురించి మాట్లాడుతున్నందువల్లనే, వైసీపీ నాయకులు కూడా పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారు. జగన్ కు ఒక ఇల్లు చాలదా? అని ప్రశ్నిస్తే.. పవన్ కు ఒక పెళ్లి చాలలేదా? అని ప్రశ్నలు ఎదురవుతాయని అంటున్నారు. మొత్తానికి పవన్ తన మాటలతో తనమీదకు అస్త్రాలు సంధించడానికి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటోంది.