పవన్ తిక్కతో మారిన లెక్కలు

నాకో తిక్కుంది, దానికీ ఓ లెక్కుంది. ఇది పవన్ డైలాగ్‌. రాజకీయాల్లో ఇది రివ‌ర్స్ అయ్యింది. నాకో లెక్కుంది, దానికీ ఓ తిక్కుంది. పవన్ సినిమా హీరో. ఏక కాలంలో రకరకాల ఎమోషన్స్ స్క్రీన్‌పై…

నాకో తిక్కుంది, దానికీ ఓ లెక్కుంది. ఇది పవన్ డైలాగ్‌. రాజకీయాల్లో ఇది రివ‌ర్స్ అయ్యింది. నాకో లెక్కుంది, దానికీ ఓ తిక్కుంది. పవన్ సినిమా హీరో. ఏక కాలంలో రకరకాల ఎమోషన్స్ స్క్రీన్‌పై చూపించాలి. సినిమా ఒక భ్రాంతి. రాజకీయాలు వాస్తవం. అయితే పవన్‌కి రెండూ ఒకటే .

పవన్ తన లెక్కలు మార్చడంతో అన్ని పార్టీల్లో సంతోషం, భయం ఒకేసారి కలుగుతున్నాయి. మొన్నటివరకూ పొత్తులు అంటూ వారాహి ఎక్కగానే మారుమనసు పొంది నేనే సీఎం అన‌డం స్టార్ట్ చేసాడు. దీన్ని తిక్క అనాలో, లేక దానికో లెక్కుంది అనుకోవాలో తెలియక అన్ని పార్టీల వాళ్లు (జనసేన‌తో సహా) క‌న్ఫ్యూజ్ అవుతున్నారు.

ముందు తెలుగుదేశానికి వద్దాం. ఆ పార్టీ పుట్టినప్పుటి నుంచీ సొంతంగా పోటీ చేయాలంటే భయం. 83లో కూడా ఎన్టీఆర్ పొత్తుల‌కి ప్రయత్నించి, విఫలం కావడంతో సొంతంగా పోటీ చేసాడు. మనేకాగాంధీకి బలం లేకపోయినా ఐదు  సీట్లు ఇచ్చారు. గతం సంగతి వదిలేస్తే ఈసారి బాబుకి భయం పట్టుకుంది. జగన్ వ్యతిరేక ఓటు చీలితే మ‌ళ్లీ వైసీపీనే వ‌స్తుంద‌ని. అదే జరిగితే బాబు రాజకీయ జీవితం ముగిసినట్టే. అందుకని పవన్‌తో పొత్తుకి వెంపర్లాడుతున్నాడు. 

జనసేనకి ఓ పాతిక సీట్లు ఇచ్చి మేనేజ్ చేద్దామ‌నుకుంటే ఎక్క‌డో చెడింది. దాంతో పవన్ నేనే సీఎం అన‌డం స్టార్ట్ చేసాడు. ప‌వ‌న్‌ని సీఎం చేయ‌డానికి బాబు పిచ్చోడు కాదు. అప్పుడప్పుడు మతిస్థిమితం లేకుండా మాట్లాడినా, ప‌ద‌వి వదులుకునేంతగా మైండ్ పోలేదు.

తెలుగుదేశం నాయ‌కుల్లో ఈ పరిణామం సంతోషం ఎందుకు కలిగించిందంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవడం వల్ల ఈసారి సునాయాసంగా గెలుస్తామనే భ్రమ ఒకటి ఏర్పడింది. అయితే పొత్తు పేరుతో పవన్ తమ సీట్ల‌కి ఎక్కడ ఎసరు పెడతాడోనని భయం వుంది. ముఖ్యంగా కాపుల ఓట్లు ఎక్కువ వున్న‌ నియోజకవర్గ నాయకుల్లో. పొత్తులేదంటేనే వాళ్ల‌కి ప్ర‌శాంత‌త‌.  భయం ఎందుకంటే గతంలో వున్నంత బ‌ల‌హీనంగా ఈ సారి ప‌వ‌న్ లేడు.  

2019లో జగన్‌ని సీఎం చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయ్యారు కాబ‌ట్టి ప‌వ‌న్‌ని ప‌ట్టించుకోలేదు. ఈ సారి చంద్రబాబుని సీఎం చేయాల‌నే కాంక్ష క‌న‌బ‌డ‌డం లేదు. జగన్ పై మునుపటి ప్రేమ లేదుకానీ, ఎలాగైనా ఓడించాల‌నే తీవ్ర‌త లేదు.  దీనికి కారణం సంక్షేమ ఓటు బ్యాంక్ కొంత స్థిరంగా వుండడం. మరి కొత్తగా ఛాన్స్ ఇవ్వాలంటే ఆ ఆప్షన్ పవన్ కే వస్తుంది. 

అయితే పార్టీకే నిర్మాణ‌మే లేని దుర్గ‌తి ఉండ‌డంతో  ముఖ్యమంత్రి అనే పదం ఆయన డిక్ష‌న‌రీలోకి రావ‌డం అసంభ‌వం. కానీ ఈసారి కొన్ని సీట్లు వ‌స్తాయి. ఓటు బ్యాంక్ పెరుగుతుంది. గెలిచినా గెల‌వ‌క‌పోయినా చాలా మందిని ఓడిస్తాడు.  అదే టీడీపీ భయం. జగన్ వ్య‌తిరేక ఓటు చీల్చి త‌మ‌ని ముంచుతాడ‌ని. కాపు పార్టీ అని పవన్ చెప్పుకోకపోయినా, కాపులు బలంగా వున్న నియోజకవర్గాల్లో టీడీపీకి ప్ర‌మాదం త‌ప్ప‌దు.

పవన్ సొంతంగా పోటిచేస్తే ఏ రకంగా చూసినా వైసీపీకి లాభం క‌న‌ప‌డాలి. జగన్ వ్య‌తిరేక ఓటు చీలిపోవ‌డం వ‌ల్ల వైసీపీ సుల‌భంగా గెలుస్తుందనే ఆనందం కంటే వాళ్ళలో భయమే ఎక్కువ వుంది. దానికి కార‌ణం గతంలో జగన్ వెంట నిలిచిన యువత, ఈసారి అంత బ‌లంగా పార్టీలో లేదు. జగన్ హ‌యాంలో వాలంటీర్‌, స‌చివాల‌య ఉద్యోగాలు త‌ప్ప ఇంకేమీ రాలేదు. కనీసం టీచ‌ర్ నోటిఫికేష‌న్ కూడా లేదు. స్కూళ్ల‌ని కలిపేయడం వల్ల (రేషనలైజేషన్), వచ్చే అవకాశం కూడా లేదు. గ్రూప్ ఎగ్జామ్స్ మరిచి చాలా కాలమైంది. వాలంటీర్‌, సచివాలయ జీతాలు వాళ్ళ ఆకాంక్ష‌లకి తగినవి కావు. ఆ మాత్రం డ‌బ్బు స్విగ్గీ, జొమాటాల్లో కూడా వ‌స్తుంది.

అదే విధంగా గత ఎన్నికల్లో కాపులు జగన్ వెంట బలంగా నిలబడ్డారు. ఈ సారి పవన్‌తో వున్నా లేకపోయినా జగన్‌తో సాలీడ్‌గా అయితే లేరు. గోదావ‌రి జిల్లాల‌తో పాటు, రాయలసీమలోని కొన్ని కాపు ప్రభావిత నియోజక వర్గాల్లో పవన్‌తో వైసీపీకి ప్ర‌మాదం వుంది. జ‌గ‌న్ వ్య‌తిరేక ఓటుని చీల్చడంతో వైసీపీకి లాభంతో పాటు అంతే నష్టం కూడా వుంది.

సంక్షేమ పథకాల అమల్లో జ‌గ‌న్‌కి మంచి పేరు వుంది. ఆ పేరును చెడ‌గొట్టడానికి కొందరు ఎమ్మెల్యేలు, చోటా నాయ‌కులు చేస్తున్న కృషి కూడా  తక్కువేం కాదు. అనేక నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు వారి అనుచ‌రులు  వందల కోట్లు సంపాదిస్తున్నారని, భూదందాల‌కి పాల్ప‌డుతున్నార‌ని జ‌నం నమ్ముతున్నారు. ఈ విషయాలు పాదయాత్రలో లోకేష్ ప్రస్తావించినా ఆయన వాయిస్‌కి విలువలేదు. ఎందుకంటే అవినీతిలో తెలుగుదేశం తక్కువేం కాదు.

అయితే పవన్ సినిమా హీరో కాబ‌ట్టి నాట‌కీయంగా చెప్పే డైలాగ్‌లు యూత్‌ని ప్ర‌భావితం చేస్తాయి. ఎన్నిక‌ల నాటికి పార్టీకి గుదిబండలుగా వున్న ఎమ్మెల్యేల‌ని  మారిస్తే చెప్పలేం కానీ, వాళ్లే అభ్య‌ర్థులైతే, జనసేన గెలిచినా గెలవక‌పోయినా వాళ్ళని గ్యారెంటీగా ఓడిస్తుంది.  

స్వయంగా తానే ఓడిపోయిన ప‌వ‌న్‌కి ఈసారి అంతసీన్ ఉందా? ఏ క్షణమైనా వారాహి దిగి, సినిమా షూటింగ్‌ల‌కి వెళ్లేపోయే ప‌వ‌న్‌ని న‌మ్ముతారా? ఖచ్చితంగా నమ్మరు. పవన్‌ని నమ్మి ఓట్లు వేయ‌రు. కానీ ఆయన మాటలు నమ్మి వైసీపీకి ఓటు  వేయకుండా పోయే ప్ర‌మాదం గ్యారెంటీగా ఈ సారి వుంది.

గత ఎన్నికల్లో వైసీపీ కోసం చొక్కాలు చించుకుని, రక్తాలు కార్చుకుని దళాలు పని చేశాయి. ఈ ఐదేళ్ల‌లో వాళ్ల‌కి ఒరిగిందేమీలేదు. తెలుగుదేశమైనా, వైసీపీ అయినా జెండా మోసే వాడికి భుజం నొప్పి తప్ప, ఇంకేమీ మిగలదనే నైరాశ్యం వుంది.

పవన్ సొంతంగా పోటీ చేస్తే జనసేనలో ఆనందం ఎందుకంటే, పొత్తు తలనొప్పి లేకుండా అందరికీ టికెట్లు వస్తాయి. డబ్బులు ఎక్కువై ఒక‌సారి రాజ‌కీయాల్లో అదృష్టం పరీక్షించుకోడానికి ఎందరో సిద్ధంగా ఉన్నారు. వీళ్లెవ‌రూ జనసేన నాయ‌కులు కాదు. పవన్ ప్రత్యేకత ఏమంటే నాయ‌కులుగా ఎవర్నీ ఎదగనివ్వ‌డు. ఎన్నిక‌ల టైమ్‌కి ఎవ‌డొస్తే వాడే నాయకుడు. ఏమో గుర్రం ఎగరా వ‌చ్చు సామెత వుండ‌నే వుంది. టైమ్ బాగుంటే కొన్ని గుర్రాలు ఎగిరినా ఎగురుతాయి.

భయం ఎందుకంటే పొత్తు కుదిరితే అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువ కాబ‌ట్టి, అదే జరిగితే మంత్రి పదవులు పొంది, పవన్ పేరుతో చ‌క్రం తిప్పాల‌నుకున్న కొంద‌రు  డీలాపడిపోయారు. అయితే ఇప్పుడున్న య‌థాత‌థ‌స్థితి  ఎన్నికల నాటికి ఉండ‌క‌పోవ‌చ్చు. ప‌వ‌న్ బుర్ర‌లో ఏం పురుగు తొలుస్తుందో ఎవరికీ తెలియదు కాబ‌ట్టి, జ‌న‌సేన‌ బలపడుతుందో, బలహీనపడుతుందో చెప్పలేం.

ఈ మొత్తం ఆటలో బీజేపీ పాత్ర ఏంటి అంటారా? వీళ్లంతా కేవలం పాత్రధారులు, సూత్రధారి బీజేపీనే కదా! సర్కస్‌లో గర్జనలన్నీ, రింగ్ మాస్ట‌ర్‌ కొరడా తీసే వరకే!

జీఆర్ మ‌హ‌ర్షి