మూడు అయితే త‌ప్ప ప‌వ‌న్‌కు మూడ్ రాదా?

జీవితంలో ఒక్కొక్క‌రికి ఒక్కో ల‌క్కీ నంబ‌ర్ వుంటుంది. త‌మ‌కు క‌లిసొచ్చిన సంఖ్య‌ను ల‌క్కీ నంబ‌ర్‌గా, దాన్ని సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా అలాంటి సెంటిమెంట్‌గా గౌర‌విస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ల‌క్కీ నంబ‌ర్…

జీవితంలో ఒక్కొక్క‌రికి ఒక్కో ల‌క్కీ నంబ‌ర్ వుంటుంది. త‌మ‌కు క‌లిసొచ్చిన సంఖ్య‌ను ల‌క్కీ నంబ‌ర్‌గా, దాన్ని సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా అలాంటి సెంటిమెంట్‌గా గౌర‌విస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ల‌క్కీ నంబ‌ర్ 3 అని ఆయ‌న అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు. ఎందుకు ఆయ‌న ఒక‌టి, రెండు వ‌ద్దు, మూడు మాత్రం ముద్దు అనే నినాదం ఇస్తున్నారు.

ఇందుకు వ్య‌క్తిగ‌త జీవిత‌మైనా, రాజ‌కీయాలైనా అతీతం కాద‌ని ఆయ‌న చెబుతున్నారు. త‌న వైవాహిక జీవితంలో ఒక‌టి, రెండు పెళ్లిళ్లు క‌లిసి రాలేద‌ని, దీంతో వారికి భారీ మొత్తంలో భ‌ర‌ణం చెల్లించి, చ‌ట్ట‌బ‌ద్ధంగా విడాకులు తీసుకుని ముచ్చ‌ట‌గా మూడో పెళ్లి చేసుకున్నాన‌ని బ‌హిరంగంగా చెప్పారు. 

త‌న మూడు పెళ్లిళ్లు గురించి విమ‌ర్శించే వాళ్లు, అంత మోజు వుంటే వాళ్లు కూడా చేసుకోవ‌చ్చ‌ని వ్యంగ్యంగా అన్న సంగ‌తి తెలిసిందే. ఒక‌టికి మించి పెళ్లిళ్లు చేసుకోవ‌డం త‌న‌కు స‌ర‌దా కాద‌ని, క‌లిసి రాక‌పోవ‌డంతోనే అలా చేయాల్సి వ‌చ్చింద‌ని ఎంతో ఆవేద‌న‌తో ఆయ‌న చెప్ప‌డాన్ని మ‌రిచిపోవ‌ద్దు. స‌రే, ఆయ‌న ఓపిక‌, ఆయ‌నిష్టం, ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకుంటారు. రెండో వ్య‌క్తికి ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితంతో సంబంధం లేదు.

ఇక రాజ‌కీయాల విష‌యానికి వ‌స్తే, అదేంటో గానీ ఒంట‌రిగా లేదా జంట‌గా చేస్తుంటే క‌లిసిరాన‌ట్టున్నాయి. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వెంట‌నే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. దీంతో జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి రానున్న రోజుల్లో ఏపీలో ప్ర‌త్యామ్నాయ కూట‌మిగా బ‌లంగా ముందుకొస్తుంద‌ని అంతా భావించారు. పొత్తు కుదుర్చుకోవ‌డ‌మే త‌ప్ప‌, క్షేత్ర‌స్థాయిలో ఇంత వ‌ర‌కూ క‌లిసి ప‌ని చేసిన దాఖ‌లాలు లేవు. బీజేపీతో పొత్తులో ఉన్న‌ప్ప‌టికీ, ఆయ‌న మ‌న‌సంతా చంద్ర‌బాబు చుట్టూ తిరుగుతోంది.

ఇలా అయితే జ‌గ‌న్‌ను గ‌ద్దె దించ‌డం క‌ష్ట‌మ‌ని, అంతా క‌లిసిపోదామ‌ని ఆయ‌న అంటున్నారు. మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీతో సంబంధం లేకుండానే టీడీపీతో క‌లిసి మూడు పార్టీలు కూట‌మిగా ఏర్ప‌డుతాయ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఒక‌వైపు టీడీపీతో వ‌ద్దే వ‌ద్దు, మ‌నిద్ద‌రం క‌లిసి ముందుకెళ్దామ‌ని బీజేపీ నేత‌లు నెత్తీనోరూ కొట్టుకుని చెబుతున్నారు. బీజేపీ అభిప్రాయాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, తాను చెప్పిన‌ట్టే న‌డ‌వాల‌ని మూర్ఖంగా పొత్తుల‌పై ప్ర‌క‌టిస్తున్నార‌నే విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతోంది.

మూడు పార్టీలు క‌లిసి కూట‌మిగా ఏర్ప‌డుతాయ‌నే ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌పై నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ప‌వ‌న్ ల‌క్కీ నంబ‌ర్ 3 అని, దాన్ని ఎందుకు అర్థం చేసుకోర‌ని సెటైర్స్ విసురుతున్నారు. ప‌వ‌న్‌కు ఒక‌టి, రెండు సంఖ్య‌లు అచ్చిరావ‌ని, మూడైతే త‌ప్ప ఆయ‌న‌కు మూడ్ రాద‌ని వెట‌క‌రిస్తున్నారు. ప‌వ‌న్ అజ్ఞాన ప్ర‌క‌ట‌న‌ల‌పై టీడీపీ, బీజేపీ కూడా నివ్వెర‌పోతున్న‌ట్టు స‌మాచారం.