మతాల మాటఎత్తే పవన్.. యూసీసీపై మాట్లాడరా?

ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా మూడు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తలపడుతున్నాయి. వీటిలో వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు జనసేనకు ఒక ప్రధానమైన వ్యత్యాసం ఉంది. తొలిరెండు పార్టీలు తమ తమ విధానాల్లో, ప్రసంగాల్లో కులమతాల గొడవలను…

ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా మూడు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తలపడుతున్నాయి. వీటిలో వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు జనసేనకు ఒక ప్రధానమైన వ్యత్యాసం ఉంది. తొలిరెండు పార్టీలు తమ తమ విధానాల్లో, ప్రసంగాల్లో కులమతాల గొడవలను పెద్దగా ప్రస్తావించవు.

కానీ.. పవన్ కల్యాణ్ సంగతి అలా కాదు. జనం ముందుకు వచ్చిన ఏ సందర్భంలోనైనా సరే.. కులాల గోల, మతాల గోల మాట్లాడకుండా.. ఆయన ఊరుకోలేరు. ఈ విషయాన్ని మనం పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో విధానం ఉంటుంది. కుల మతాలే తన రాజకీయ మనుగడకు జీవనాడి అని పవన్ భావిస్తే అది ఆయన ఇష్టం.

తణుకు బహిరంగసభలో  ప్రసంగించిన పవన్ కల్యాణ్ హిందూత్వాన్ని చాలా బాగా వెనకేసుకు వచ్చారు. ఆయన ప్రస్తావించిన అంశాలన్నీ పాచిపోయినవే అయినప్పటికీ.. జగన్ సర్కారును హిందూ వ్యతిరేక సర్కారుగా ప్రొజెక్టు చేయడానికి ఆయన తన శక్తివంచన లేకుండా తపన పడుతున్నారు. రామతీర్థం విగ్రహాలను నరికేశారని, అంతర్వేదిలో రథం తగులబెట్టారని.. విగ్రహాల పునఃప్రతిష్ఠ కూడా జరిగిపోయిన చాలా కాలానికి ఆయన నోరెత్తడం ఆశ్చర్యకరం.

అదంతా కూడా ఓకే గానీ.. మతాల గురించి ఇంతగా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్.. ప్రధానంగా దేశంలోని అన్ని మతాల వ్యవహారాలను ప్రభావితం చేసే ఉమ్మడి పౌరస్మృతి విషయంలో ఎందుకు నోరుమెదపకుండా ఉంటున్నారు.? ఇది సామాన్యులకు కలుగుతున్న ప్రశ్న. మిగిలిన రెండు పార్టీలు మతాల గోల, కులాల గోలను ప్రస్తావించడం ప్రధానంగా తక్కువ.

అయితే హిందూ ధర్మం జోలికొస్తే సహించను.. పురోహితులకు అన్నవరంలో వేలం పాట పెట్టిన వాళ్లు ఇస్లాం, క్రిస్టియన్ మతాల్లో అలా చేయగలరా అంటూ రంకెలు వేస్తున్న పవన్ కల్యాణ్ భారతీయ జనతా పార్టీ నాయకులకంటె అతిగా హిందూత్వాన్ని సొంతం చేసుకుంటూ ఉండడం ఆశ్చర్యకరం. అదే సమయంలో ఆయన తన వారాహియాత్రలో ఒక్కో ఊరిలో ముస్లింలతో సమావేశాలు పెట్టుకుంటూ.. నేను బిజెపితో ఉన్నాను గనుక మీరు నన్ను నమ్మడం లేదు. మీరునన్ను నమ్మి గెలిపించండి. 

మీకు నేను అండగా ఉంటాను.. అంటూ అసంబద్ధమైన వాదనతో బేరం పెడుతున్నారు. గెలిపిస్తే అండగా ఉంటానని అంటున్న పవన్ కల్యాణ్.. మరి, ఇప్పుడు ముస్లిం సమాజం మొత్తం భయపడుతున్న యూసీసీ గురించి కనీసం తన మాట ఎందుకు చెప్పరు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు. ఈ మౌనం ద్వారా ఎవరిని వంచించాలని అనుకుంటున్నారు? అనేది కీలకమైన సంగతి!