బుజ్జగింపులకు నో, వేటు వేసేయడమే!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతున్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వివిధ పార్టీల నుంచి నాయకులు వచ్చి కాంగ్రెసులో చేరుతున్నారు. బలం పెరుగుతున్నదో లేదా, తాము చాలా బలపడిపోతున్నామనే భావన ఆ పార్టీ నాయకుల్లో పెరుగుతున్నదో…

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతున్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వివిధ పార్టీల నుంచి నాయకులు వచ్చి కాంగ్రెసులో చేరుతున్నారు. బలం పెరుగుతున్నదో లేదా, తాము చాలా బలపడిపోతున్నామనే భావన ఆ పార్టీ నాయకుల్లో పెరుగుతున్నదో అర్థంకాని విధంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహారం కనిపిస్తోంది. 

పదవులకోసం పార్టీ నాయకులు ఆందోళనలు చేయడం, గాంధీభవన్ కు రావడం అనేది చాలా మామూలు సంగతి. అయితే.. అలాంటి వారిపై సస్పెన్షన్ వేటు వేసేస్తానంటూ రేవంత్ బెదిరించడం, కత్తి ఝుళిపించి ఒకరి మీద వేటు వేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

కర్ణాటక ఎన్నికల తర్వాత.. తెలంగాణ కాంగ్రెసు పార్టీకి మంచి శకునాలు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి ఇందులోకి తరలివస్తున్న వారు ఉంటున్నారు. ఇంకా భారాస, బిజెపి లనుంచి కూడా పలువురు కాంగ్రెసు వైపు చూస్తున్నట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఖమ్మంలో రాహుల్ సభ సక్సెస్ కావడం కూడా పార్టీ కి మంచి కాన్ఫిడెన్సును పెంచింది. ఈ నేపథ్యంలో.. పార్టీలో ఉండే చిన్నచిన్న అసంతృప్తులను బుజ్జగించుకుంటూ ముందుకు సాగితే.. ఇంకా వారికి మంచి ఫలితాలు దక్కుతాయి. అయితే.. రేవంత్ కాస్త దురుసుగా ప్రవర్తిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు అంటున్నాయి.

కాంగ్రెసు పార్టీలో ముఠాతగాదాలు అనేది సర్వసాధారణం. పార్టీలోని నాయకులు పరస్పరం విభేదిస్తూ ఉండడమే ప్రాథమిక లక్షణంగా ఆ పార్టీ వర్ధిల్లుతూ ఉంటుంది. అంతమాత్రాన.. విభేదిస్తున్న వారిని వెలివేయడం అనేది అరుదుగా జరిగే సంగతి. అలాంటి కాంగ్రెసులో నల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం తురకపల్లి నుంచి వచ్చిన కార్యకర్తలు పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతున్నదని ఆందోళన చేశారు. 

అయితే గాంధీభవన్ లో వీరి ఆందోళన పీసీసీ చీఫ్ రేవంత్ కు ఆగ్రహం తెప్పించింది. ఆలేరు పరిధిలో 7 మండలాలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన వారికే పదవులు కట్టబెట్టి, ఒక్క మండలంలో మహిళకు పదవి ఇస్తే వ్యతిరేకించడం ఏంటంటూ.. ఆయన ఆగ్రహించారు. మొన్నటిదాకా మండల ప్రెసిడెంట్ గా ఉన్న నాయకుడు ఒకరిని సస్పెండ్ చేయాలని కూడా ఆదేశించారు.

నిజానికి పార్టీ పదవుల విషయంలో అసంతృప్తులు చెలరేగితో సర్ది చెప్పడం మంచి పద్ధతి. పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుందని ఆశపడుతున్న తరుణంలో ఏ ఒక్క కార్యకర్తను కూడా దూరం చేసుకోకపోవడం మంచి వ్యూహం అనిపించుకుంటుంది. కానీ, ఇలా అసంతృప్తి చూపించిన ప్రతివారి మీద వేటు వేసుకుంటూ పోతే.. పార్టీకి ఇక్కట్లు తప్పవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వేటు అనేది.. కోమటిరెడ్డితో విభేదాలకు ఒక సూచనగా భావించాలా అనే అభిప్రాయాలు కూడా వినవస్తున్నాయి.