‘స్థానికుడు కాదు’ అనే మాట ఒక్కటే కాదు, ‘గెలిచినా సరే.. ఆయన ఇక్కడ ఉండబోయేది లేదు’ అనే మాట బాగా ప్రజల్లోకి వెళుతూ ఉండడం అనేది పిఠాపురం నుంచి గెలిచి రాష్ట్ర మంత్రి అయిపోవాలని కలలు కంటున్న పవన్ కల్యాణ్ కు ఇబ్బందిగా మారుతోంది.
ఇప్పటికే ఆయన ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, అక్కడే తన నివాసం, మరియు స్థానిక కార్యాలయం అంటూ ప్రారంభించారు. కానీ అద్దె ఇల్లు ఎంతదైనా అద్దెదే కదా.. గాజువాక, భీమవరం లాగా ఎన్నికల్లో ఓడిపోతే పవన్ కల్యాణ్ దులుపుకుని వెళ్లిపోతాడే తప్ప.. అసలిక పిఠాపురం వైపున తిరిగిచూడరు కదా.. అనే వాదన ప్రజల్లో ఉంది.
పైగా వైఎస్సార్ కాంగ్రెస్ కూడా పవన్ లో ఉండే ఆ వైఖరినే ఎక్కువగా ప్రచారం చేస్తోంది. గెలిచేదాకా ఒక మాట చెప్తారని, గెలిచిన తర్వాత.. పిఠాపురం వైపు చూడరని అంటోంది. ఈ తరహా నష్టాన్ని నివారించేందుకు పవన్ కల్యాణ్ పిఠాపురంలో సొంత ఇంటిని కూడా నిర్మించుకోబోతున్నారు అనే ప్రచారానికి దిగుతోంది జనసేన. ఆ దిశగా ప్రజల్ని నమ్మించాలని అనుకుంటోంది.
పిఠాపురం ఇక మీదట పవన్ కల్యాణ్ శాశ్వత నివాస స్థలం కాబోతున్నదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రత్యేకంగా విలేకర్ల సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. శాసనసభ సమావేశాలు, కేంద్ర పర్యటనలు, పార్టీ కార్యకలాపాలు, సమావేశాల కోసం మినహా మిగిలిన సమయమంతా పవన్ కల్యాణ్ ఇక్కడే గడుపుతారని నాగబాబు, తన తమ్ముడు పవన్ తరఫున పిఠాపురం ప్రజలకు హామీ ఇచ్చేశారు.
నియోజకవర్గ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు, వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపేందుకు సిబ్బందిని కూడా నియమించుకుంటున్నట్టు వెల్లడించారు. పిఠాపురం శాశ్వత నివాసం గనుక.. అక్కడ సొంత ఇంటిని నిర్మించే పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని కూడా నాగబాబు చెప్పడం విశేషం.
సొంత ఇంటి పనులు ప్రారంభం అయ్యాయి అంటే అర్థం ఏమిటి? ఆల్రెడీ నిర్మాణం ప్రారంభించారా? అనేది ప్రజల సందేహం. గెలిచినా ఓడినా పిఠాపురం పవన్ కు శాశ్వత నివాసం అవుతుందనే నాగబాబు మాటలను జనం నమ్మాలంటే గనుక.. ఎన్నికల పోలింగ్ తేదీలోగా.. కనీసం ఇంటి నిర్మాణపు పనులు ప్రారంభించాలని, పునాదులైనా తవ్వించాలని ప్రజలు అంటున్నారు. లేకపోతే ఈ మాటలు కూడా పవన్ సినిమా డైలాగుల్లాగా నాటకీయమైనవిగానే భావించాల్సి ఉంటుందంటున్నారు.
అయినా రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టుగా.. పవన్ కల్యాణ్ తలచుకుంటే.. ఒక ఇంటికోసం స్థలం కొనడం, నిర్మాణం ఎంతసేపు అని కూడా అంటున్నారు. ఎన్నికల నామినేషన్ వేసే సమయంలో అందులో ఆస్తులు పేర్కొనాల్సి ఉంటుంది. ఆలోగా కనీసం పిఠాపురంలో స్థలం కొనుగోలు చేసి.. తన పేర ఉన్న ఆస్తిగా అఫిడవిట్ లో పవన్ కల్యాణ్ పేర్కొంటే ప్రజలు నమ్మడానికి కాస్త అవకాశం ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.