వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తనకు అణువణువు కక్ష, ద్వేషం ఉన్నాయని జనసేనాని పవన్‌కల్యాణ్ తనకు తానే పదేపదే నిరూపించుకుంటున్నారు. తాజాగా వారాహి యాత్ర, అంతకు ముందు వివిధ సందర్భాల్లో బహిరంగ సభల్లో, వివిధ సమావేశాల్లో పవన్ ప్రసంగంలోని ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. శనివారం కూడా ఆయన తన పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో పవన్ మరోసారి జగన్‌పై తన ఉద్దేశాన్ని చెప్పారు.
“నాకు ప్రభుత్వంపై, వ్యక్తిగతంగా సీఎంపై కక్ష లేదు. నన్ను పాలించే నాయకుడు నాకంటే నిజాయతీ పరుడైతేనే న్యాయం జరుగుతుంది” అని ఆయన అన్నారు. ఇదే మాట చంద్రబాబు, లోకేశ్ తదితర ప్రత్యర్థి పార్టీల నేతలపై పవన్ ఏనాడూ అనలేదు. ప్రత్యేకంగా జగన్, వైసీపీ నేతల విషయంలో మాత్రమే పవన్ అంటున్నారంటే, ఆ రకమైన సంకేతాలు జనంలోకి వెళుతున్నాయని జనసేనాని గ్రహించినట్టే కదా?
జగన్‌ను పవన్ ప్రత్యర్థిగా కాకుండా, శత్రువుగా చూస్తున్నారనే భావన విస్తృతంగా వ్యాపించింది. మనసులో ఎంతో ద్వేషాన్ని నింపుకుంటే తప్ప, తన ప్రత్యర్థిపై అంతలా విషం చిమ్మే అవకాశం ఉండదని పవన్ ప్రసంగాల్ని విశ్లేషిస్తున్న మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. రాజకీయంగా వైఎస్ జగన్‌కు చంద్రబాబునాయుడు ప్రధాన ప్రత్యర్థి. చంద్రబాబు కూడా హద్దుదాటి జగన్‌పై అవాకులు చెవాకులు పేలిన సందర్భాలు చాలా తక్కువ.
చంద్రబాబు, జగన్ పరస్పరం రాజకీయంగా తీవ్ర విమర్శలు చేసుకుంటుంటారు. బాబును ఉద్దేశించి పెద్ద మనిషి అంటూ జగన్ దెప్పి పొడుస్తుంటారు. జగన్‌ను ఇటీవల కాలంలో చంద్రబాబు సైకో అని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ పేరు ప్రస్తావించకుండా దత్త పుత్రుడని జగన్ విమర్శిస్తుంటారు. రాజకీయాల్లో వ్యంగ్యం ఒక విమర్శనా పద్ధతి. అదేంటో గానీ, పవన్ కొత్త తరహా రాజకీయ విమర్శలకు తెరలేపారు. చెప్పుతో కొడతా, నా కొడకల్లారా, తాట తీస్తా, తోలు తీస్తా ..ఇలా నోటికొచ్చినట్టు వైఎస్ జగన్, ఆయన పార్టీ నేతలపై పవన్ నోరు పారేసుకుంటున్నారు.
తనను పాలించే నాయకుడు తనకంటే నిజాయతీ పరుడు కావాలని పవన్ కోరుకున్నది నిజమే అయితే, మరి నాయకులను బట్టి రాజకీయ పంథా ఎందుకుండాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చంద్రబాబు పాలనలో అవినీతి పవన్‌కు అంత రుచిగా ఉందా? అని నిలదీస్తున్నారు. తనకు ఇష్టమైన నాయకుల పాలనలో అవినీతిపై నోరెత్తని పవన్, ఇప్పుడు తనకు గిట్టని జగన్ అధికారంలో ఉండడంతో ఓర్వలేక చిందులేస్తున్నారనే అభిప్రాయం బలపడింది.
జగన్‌పై తన విమర్శలు వ్యక్తిగత ద్వేషంతో చేస్తున్నవి ఉన్నవని తనకే ఒక అభిప్రాయం కలగడంతో, పదేపదే సీఎం, వైసీపీ ప్రభుత్వంపై కోపం, కక్ష లేవని కథలు చెబుతున్నారని పలువురు అంటున్నారు. అంతిమంగా పవన్ విద్వేష రాజకీయాలపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారని, ఎందుకంటే వారు విజ్ఞులని అంటున్నారు.