భారతీయ జనతా పార్టీ మీద అలకపూనిన తెలంగాణ సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లను హఠాత్తుగా బుజ్జగించడానికి అధినాయకులు ఢిల్లీకి పిలిపించారు. విపరీతమైన కార్యక్రమాల ఒత్తిడి ఉన్నప్పటికీ అమిత్ షా లాంటి దిగ్గజనేత వారికి సమయం కేటాయించారు.
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ స్థితిగతుల గురించి, గాడిలో పెట్టడం గురించి సుదీర్ఘంగా సుమారు రెండు గంటల పాటు చర్చించారు. అయితే భేటీ అనంతరం ఈ నాయకులిద్దరూ ప్రెస్ మీట్ లో వెల్లడించిన సమాచారాన్ని బట్టి వారిని బుజ్జగించడం కోసం పార్టీ పిలిపిస్తే.. వీరు పార్టీ హైకమాండ్‌నే బెదిరించి ఆ భేటీని ముక్తాయించినట్లుగా కనిపిస్తోంది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖకు చేరికల కమిటీ సారధిగా ఉన్న ఈటల రాజేందర్ కొంతకాలంగా పార్టీ నాయకుల పట్ల అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ మీద, అధికార పదవుల విషయంలోనే ఈ అసంతృప్తి పొడచూపినట్లుగా గుసగుసలు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి నాయకులను ఫిరాయింపజేసి బిజెపిలో కలుపుకోవడం కోసం ఉద్దేశించిన చేరికల కమిటీ సారథిగా ఈటల తన శక్తి వంచన లేకుండా కృషి చేశారు.
ఖమ్మం జిల్లాలోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెద్ద సుముఖంగా లేకపోయినప్పటికీ కేవలం తనకు ఆయనతో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని పురస్కరించుకొని బిజెపిలోకి తీసుకురావడానికి రెండు దఫాలుగా భేటీ అయి విఫల యత్నం చేశారు. ఇంకో రకంగా చెప్పాలంటే పొంగులేటితో రెండుసార్లు కలిసి సుదీర్ఘంగా మంతనాలు సాగించే ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ పరిస్థితులను బేరీజు వేసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంత బలహీనంగా ఉన్నదో కూడా ఆయనకు అర్థమైనట్లుగా కనిపిస్తోంది. ఈలోగా ఈటెల రాజేందర్ కు పార్టీ అధ్యక్ష పదవి దక్కుతుందనే ప్రచారం మొదలైంది.
బండి సంజయ్ ను రీప్లేస్ చేస్తూ ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని అంతా అనుకున్నారు. సంజయ్ కు కేంద్రమంత్రి పదవి దక్కుతుందనే పుకారు వచ్చింది. రోజుల వ్యవధిలోనే ఈ పదవుల కాంబినేషన్ల పుకార్లు తెరవెనుకకు వెళ్లి, ఈటల రాజేందర్ ను బిజెపి ఎన్నికల ప్రచార కమిటీ సారధిగా నియమిస్తారని వార్త వచ్చింది. అవేమీ కూడా కార్యరూపం దాల్చలేదు దాంతో సహజంగానే ఈటల రాజేందర్ కినుక వహించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోయిన నాటి నుంచి పార్టీతో అంటీ ముట్టునట్టుగానే ఉంటున్నారు తాజాగా తెలంగాణ కాంగ్రెస్లోకి ఇతర పార్టీల నాయకుల వలసల గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కూడా తిరిగి అదే గూటికి చేరుతారనే ప్రచారం మొదలైంది ఇద్దరినీ అధిష్టానం ఢిల్లీ పిలిపించింది. వారిని బుజ్జగించవచ్చునని అధిష్ఠానం తలపోసింది.
తీరా ఈ ఇద్దరూ కూడా రాష్ట్రంలో పార్టీ దూకుడు పెంచాల్సిన అవసరం ఉన్నదని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో సత్వర చర్యలు తీసుకోకుండా నాన్చే ధోరణి పార్టీ పరువు తీస్తున్నదని అధిష్ఠానాన్ని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ జోరు పెరుగుతున్న సమయంలో బిజెపి సైలెంట్ అయిపోతుండడం నష్టదాయకమని పార్టీని బెదిరించారు. వారి మాటలను గమనిస్తే.. పార్టీ మీద పూనిన అలక విషయంలో ఏమాత్రం మెత్తబడినట్టుగా కనిపించలేదు. తాము పార్టీకి చేసిన సూచనలను హైకమాండ్ ఎంతమేరకు పట్టించుకుంటుందో గమనించి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చునని వేచిచూస్తున్నట్టుగా ఉంది. ఈ ఇద్దరు నాయకుల అసంతృప్తిని సద్దుమణిగేలాచేసి, వారు పార్టీని వీడకుండా ఆపలేకపోతే.. సీట్లపరంగా తెలంగాణ బిజెపికి నష్టమెంతో తెలియదు గానీ.. పరువు మాత్రం సాంతం దెబ్బతింటుంది.