సాధారణంగా రాజకీయ నాయకులు వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు, సభలు నిర్వహించినప్పుడు.. అవి పార్టీ కార్యక్రమాలు అయితే గనుక.. అందుకు కాగల ఖర్చులను స్థానిక నాయకులు భరిస్తారు. స్థానికంగా ఎమ్మెల్యే స్థాయి పదవులపై ఆశ ఉన్నవారే ఖర్చుల సంగతి చూసుకుంటారు. కొన్ని చోట్ల పార్టీ కొంతమేర భరిస్తుండవచ్చు.
తెలుగుదేశం లాంటి పార్టీల్లో అయితే.. కేవలం పార్టీ నాయకుడు వస్తున్న కార్యక్రమాలు మాత్రమే కాదు.. అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో కొన్ని వందల మంది పాదయాత్రగా అటు తిరుపతి, ఇటు అరసవిల్లి బయల్దేరినప్పుడు కూడా వారికి సంబంధించిన ఖర్చులను చాలా వరకు తెలుగుదేశం వాళ్లే పెట్టుకుంటారు.
కానీ పవన్ కల్యాణ్ సాగిస్తున్న వారాహి యాత్రకు స్థానిక నాయకులు ఎవ్వరూ ఖర్చు పెట్టడం లేదట. మామూలుగా సభావేదిక ఎక్కిన ప్రతిసారీ.. నేను సినిమాలు చేసి పార్టీని నడుపుతున్నా.. నా కుటుంబం, పిల్లల కోసం దాచిన డబ్బులన్నీ పార్టీకోసం ఖర్చు పెడుతున్నా.. అని చెప్పుకుంటూ ఉండే పవన్ కల్యాణ్.. యాత్ర విషయానికి వచ్చేసరికి మనకు ఎవ్వరూ డబ్బులివ్వరు అని అంటున్నారు.
వైసీపీ నాయకుల్లా ఎమ్మెల్యే అభ్యర్థులకు ‘నవ్వు పది, ఇరవై లక్షలు ఖర్చు పెట్టు’ అని చెప్పలేం కదా అంటున్నారు. ఇక్కడ పవన్ ఏదో అక్కసు కొద్దీ వైసీపీ మీద నిందవేస్తున్నారు గానీ, తెలుగుదేశం అయినా స్థానిక నాయకులు పెట్టుకోవాల్సిందే. జనసేనకు మాత్రమే ఆ పరిస్థితి లేదని ఆయన మాటలద్వారా తెలుస్తోంది.
అలాంటి దుస్థితికి సరైన కారణాలే ఉన్నాయి. వైసీపీ తెదేపాలకు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులెవరో, లేదా ఆ స్థాయి ఆశావహులెవరో ఒక క్లారిటీ ఉంది. జనసేనకు అలా అభ్యర్థులెవరో తెలుసా? అభ్యర్థుల సంగతి తరువాత.. కనీసం ఏయే నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీచేస్తుందో వారికి తెలుసా? ఏయే సీట్లు అనేది తర్వాత.. కనీసం ఎన్ని సీట్లలో తమ పార్టీ పోటీచేస్తుందో వారికి తెలుసా? ఇలాంటి అంశాల మీద ఏ క్లారిటీ లేకుండా.. స్థానిక నాయకులు లక్షలకు లక్షల రూపాయలు డబ్బులు తగలేయడానికి ఎందుకు ముందుకు వస్తారు?
సినిమా షూటింగులు జరుగుతూ ఉంటే.. హీరో ఎవరికి ఏ దానధర్మాలు చేయాలన్నా.. నిర్మాత ఆ ఖర్చును భరిస్తూ ఉంటాడు. హీరోలకు అలాంటి పోకడ బాగా అలవాటు అయిపోయి ఉంటుంది. రాజకీయాల్లో కూడా తాము అడుగు బయటపెడితే ఖర్చులన్నీ ఇతరులు భరిస్తూ ఉండాలని కోరుకోవచ్చు. ఒకస్థాయి పార్టీ అయితే అలా జరుగుతుంది కూడా. పవన్ కల్యాణ్ తన పార్టీలో అభ్యర్థులు ఎవ్వరో ఇంకా ఎవ్వరికీ తేల్చి చెప్పకపోగా, వారు ఖర్చు పెట్టాలని ఆశించినా అలా జరగదు. సో, తన యాత్రకు అయ్యే సకల ఖర్చులు తానే పెట్టుకోవాల్సి వస్తే.. అది స్వయంకృతమే తప్ప.. ఔదార్యం కాదు.
అయినా, ‘‘దాతల సహాయంతో ముందుకు సాగుతున్నాం.. వైకాపాలా దోపిడీ చేయలేం కదా’’ అని కూడా పవన్ కల్యాణ్ అంటున్నారు. దాతలు అంటే ఎవరు? పవన్ యాత్రకు వాళ్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు. ఎన్ని కోట్ల ఖర్చులు పెడుతున్నారు? వారికి పవన్ ఎలాంటి తాయిలాల ఆశచూపించి ఖర్చులు పెట్టించుకుంటున్నారు. టికెట్ల ఆశచూపిస్తున్నారా? లేదా, తాను అధికారంలోకి వచ్చేసి.. వారికి లబ్ధి చేకూర్చేలా దోచిపెడతానని ముందే మాట ఇస్తున్నారా?
‘‘వైకాపాలాగా దోచుకోలేం కదా’’ అంటున్న పవన్ కల్యాణ్.. ‘‘ఏ దోపిడీ ఆఫర్లు ఆశ చూపించి.. ఆయన చెబుతున్న దాతల నుంచి ఖర్చులకు సొమ్ములు తీసుకుంటున్నారు…? ఆయన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.