మనదేశంలో- దేవుడు ఎంతో చక్కని వ్యాపార వస్తువు. చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితి ప్రాప్తించినప్పుడు.. ఎలాంటి చింత, ఆందోళన లేకుండా.. ఇత్తడి చెంబుకు నామాలు వేసుకుని.. వీధిన పడితే చాలు.. సాయంత్రానికి చెంబు నిండుతుంది. కడుపు కూడా నిండుతుంది. సనాతనంగా మన సమాజం నిరూపిస్తూనే ఉన్న మార్గం ఇది.
కొత్త పోకడలు మొదలయ్యే కొద్దీ.. ఎవరికి తోచిన ‘నవ్యత’ను వారు జోడిస్తూ వెళుతున్నారు. ‘ఇత్తడి చెంబు- నామాలు’ అనే వ్యాపార కిటుకుకు కొత్త కొత్త ఆధునిక రూపాలు వస్తూనే ఉంటాయి. ఈ దైవత్వపు పరిభ్రమణంలో జరిగే సకల వ్యాపార వ్యవహారాలలో త్రివిధాలైన ధూర్తులను మాత్రం మనం ఓసారి పరామర్శించుకుందాం..
‘దేవుడు- వ్యాపార వస్తువు’
..అని గుర్తించిన తెలివైన వాడు ఒకడుంటాడు. వాడు ఉత్పాదకరంగానికి చెందిన వ్యాపారి. దేవుడిని తానే సృష్టిస్తాడు. ఊరి వెలుపల ఏ చెట్టుకిందనో, వాడు పాక వేసుకోవడానికి పునాదులు తవ్వుతుంటేనో ఒక చిన్న విగ్రహం దొరుకుతుంది, ఆ విగ్రహంలోని దేవుడు క్రితం రాత్రి వాడి కలలోకి వచ్చి ఉంటాడు. ఆ రాతి దగ్గర మొదటి టెంకాయ పగిలే వరకు కాస్త గుంజాటన ఉంటుంది. ఆ వెంటనే వ్యాపారం పుంజుకుంటుంది. పెట్టుబడిగా విగ్రహానికి తగిన సొమ్ము లేని వాడు.. కాస్త వంకర్లు తిరిగిన ఏ చిత్రమైన రాయినో వెతికి తెచ్చుకున్నా సరిపోతుంది. అదే దేవుడి అవతారంగా నమ్మించవచ్చు. అక్కడినుంచి వ్యాపార చాతుర్యం ‘మార్కెటింగ్’ తెలివితేటల మీద ఉంటుంది. ఆ రాయిని నిలిపిన చోట అచిరకాలంలోనే ఓ గుడి వెలుస్తుంది.. అది విస్తరిస్తుంది. తొందర్లోనే అక్కడి దేవుడికి ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలు కూడా మొదలవుతాయి.
‘మోక్షప్రాప్తి- వ్యాపారమార్గం’
..అని గుర్తించిన తెలివైన వాళ్లూ ఉంటారు. మోక్షం అంటే ఏమిటో ఇదమిత్థంగా చెప్పడం ఎవ్వడికీ సాధ్యం కాదు. ‘దేవుడు ఎక్కడో ఉంటాడు- రాళ్ళల్లోనూ గుళ్ళలోనూ ఉండడు- మోక్షం అనేది దేవుడిని అందుకునే ఉపాయం. ఆ మోక్షం ఒక సద్గురువు ద్వారా మాత్రమే లభిస్తుంది. సొంతంగా ఎలాంటి సాధన చేసినా ఎంత నియమబద్ధ జీవితం గడిపినా ఉపయోగం లేదు. సద్గురువు లేని దారి అగమ్య గోచరంగా ఉంటుంది’ అనే వాదనతో వీరి వ్యాపారం నడుస్తుంటుంది. ఈ మాటలు చెప్పేవాళ్లు ఆ మాటలకు అనుగుణమైన సద్గురువు తామేనని ప్రొజెక్టు చేసుకుంటూ ఉంటారు. తమ వందిమాగధులు, అనుయాయులతో తమ సద్గురు వైభవాన్ని ప్రచారం చేయించుకుంటూ గడుపుతారు. సామాన్యులకు అర్థం కాని మాటలు మాట్లాడతారు. చిత్రమైన పదాల పటాటోప అల్లికలతో మాట్లాడుతూ తర్కానికి అందకపోవడమే తత్వం అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు!
మనకు అర్థంకాని విషయం ఎదురుపడితే మనం దానిని మూర్ఖత్వం అనుకుంటామా? జ్ఞానం అనుకుంటామా? ఈ మీమాంసకు సమాధానం.. ఎదుటివాడి వేషాన్ని బట్టి ఉంటుంది. మోక్షప్రాప్తిని అందించే ఈ గురువులు వేషం యొక్క ప్రాధాన్యం ఎరిగిన వారు. చిత్ర విచిత్ర వేషాలతో, ధీరగంభీర అర్థనిమీలిత దృక్కులతో మనల్ని మోక్షం వైపు తీసుకువెళుతూ ఉంటారు. వీరు భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్తలు! ఇదొక రకం దందా! ఇక మూడో రకం ధూర్త శిఖామణుల గురించి విశేషంగా చెప్పుకోవాలి!
‘సాక్షాత్.. దేవుళ్లే..’
దేవుడిని ఒక చోట సృష్టించి ఆయన మహిమలను చాటుతూ ఆయన యశస్సును పెంచి, తద్వారా తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి అవసరమైనంత సహనం వారికి ఉండదు. మోక్షప్రాప్తి మార్గానికి బాసటగా నిలుస్తూ.. ఎక్కడున్నాడో తెలియని దేవుడి దగ్గరకు చేర్చగల గురువులుగా తమను తాము తీర్చుకుని, వారిని నమ్మించడానికి ప్రదర్శనామాత్రంగా, జ్ఞానాత్మకమైన మాటల పోహళింపుతో చెలరేగగల పాటి భాషా పటిమ, వ్యవహార చాతుర్యం, కార్య కౌశలం వీరికి ఉండవు. ‘దేవుడు’ అనే మాటలో అత్యద్భుతమైన వ్యాపారం ఉన్నదని తెలిసిన తర్వాత.. పైరెండు లక్షణాలు తమలో లేనప్పుడు ఇక చేయగలిగింది ఏముంది తామే దేవుడిగా అవతరించడం ఒక్కటే మార్గం.
‘నేనే దేవుడిని’ అని చెప్పుకునే వాళ్లు శతాబ్దాల ముందు నుంచి ఇవాళ్టి వరకు మనకు పుష్కలంగా ఉన్నారు. కొత్త దేవుళ్లు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట పుట్టుకొస్తూనే ఉన్నారు. దైవత్వం అనేది పిచ్చి లాంటి ఒక మానసిక స్థితి! వీరందరూ అలాంటి మానసిక స్థితిలో ఉంటారు.
సైకాలజీలో ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని ఒకటి ఉంటుంది. ఇది ‘నేను దేవుడిని’ అని చెప్పుకునే వాళ్ల అచ్చమైన లక్షణం కాదు. ఇదొక మానసిక రోగం. ఈ రోగం ఉన్న వాళ్లకు ‘నేను అందరికంటె అధికుడిని.. నన్ను మించిన వాళ్లు లేరు.. అందరూ నాకు ప్రాధాన్యం ఇవ్వాలి, నన్ను గుర్తించాలి..’ అనే భావనలు ఉంటాయి. ఇలాంటి వాళ్లు మనకు అనేకమంది తారసపడుతుంటారు. సైకాలజీ శాస్త్రం కూడా నిర్వచించనంతగా ఈ ఎన్పిడి అనే పిచ్చి రోగలక్షణం ముదిరితే వాడు ‘నేను దేవుడిని’ అని చెప్పుకుంటాడు! ఈ రోగం ఉన్న సమకాలీన దేవుళ్లకి అహంకారమూ, ఆగ్రహమూ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు నన్ను ఆరాధించి తీరాల్సిందే అనే ధోరణీ ఉంటుంది.
అలాంటి ఒక సరికొత్త దేవుడు. తెలంగాణలో పుట్టుకొచ్చాడు. జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం ఉమిత్యాల గ్రామంలో ‘నేనే రంగనాధుడిని.. నన్ను సేవించుకోండి.. మీ కష్టాలు తీరుతాయి’ అని చెప్పుకునే స్వామి ఒకడు తయారయ్యాడు.
నిత్యం తనను దర్శించుకుని, తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంటే.. సర్వరోగాలూ మాయమౌతాయని కూడా చెప్పాడు. వాడు చెప్పినట్టుగా.. అయిదు శనివారాలు ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి, తమ శక్తికి తగిన రీతిలో ఫలమో తోయమో ధనమో సమర్పించుకుని ఆరాధించుకోవడానికి జనం కూడా ఇబ్బడి ముబ్బడిగా తయారయ్యారు. ఎంతగా అంటే.. సదరు కొత్త దేవుడిని సేవించుకోవడానికి వచ్చిన భక్తులతో ఆ చిన్న పల్లెటూరులో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడేంత.. పోలీసులు జోక్యం చేసుకుని.. దైవశిఖామణిని తమ స్టేషనుకు తీసుకువెళ్లి కౌన్సిలింగ్ చేసి పంపేంత!!
తమిళనాడుకు చెందిన సంతోష్ కుమార్ అనే వ్యక్తి కేటీ దొడ్డికి కొంతకాలం కిందట వచ్చాడు. తాను తిరుమల శ్రీనివాసుడి అవతారం అని చెప్పుకున్నాడు. రంగనాధుడు తనలో ప్రవేశించి తనను నడిపిస్తున్నాడని కూడా చెప్పాడు. తాను శేషశయనంపై పడుకునే వాడిని అని చెప్పుకుంటూ.. అలాంటి ఒక శేషతల్పం సెటింగు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ అభినవ శ్రీనివాసుడికి ఇద్దరు భార్యలు. ఆయన శేషతల్పంపై శయనించి, పాదాల చెంత కిరీట ధారులైన ఇరువురు భార్యలను ఉపవిష్టులను కావించి.. వారితో కాళ్లు పట్టించుకుంటూ పోజుగా ఫోటోలు దిగి భక్తకోటిలో ప్రచారంలో పెట్టాడు. తాను ఎలాంటి మందులు ఇవ్వనని, తావీదులు ఇవ్వనని తన చుట్టూ ప్రదక్షిణలుచేస్తే రోగాలు నయమౌతాయని చెప్పడం విశేషం. నిజానికి అది కాదు విశేషం.. ఆయన చుట్టూ తిరగడం వలన.. రోగాలు నయమైనాయని, మూగవారికి మాటలు కూడా వచ్చాయని, కుంటివాళ్లు నడుస్తున్నారని భక్తులు ప్రచారం చేయడం!!
దేవుడు ఎఫ్పుడు పుడతాడు? ఎక్కడ పుడతాడు? దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం దేవుడు పుడతాడని మనం అనుకుంటాం. మన పురాణాలన్నీ ఆ విషయాలనే మనకు చెప్పాయి. అది నిజమో కాదో గానీ.. కానీ దేవుడు అమాయకత్వం, అజ్ఞానం పరిఢవిల్లే ప్రతి చోటా తప్పకుండా పుడతాడు. ఆ రెండు పునాదుల మీద ఆ దేవుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటూ ఉంటాడు. ఆ రెండు లక్షణాలు అంతం అయ్యేదాకా అలా సుభిక్షంగా వర్ధిల్లుతుంటాడు.
‘ద్యూతమ్ ఛలయతాం అస్మి’ అంటాడు కృష్ణ భగవానుడు.. భగవద్గీతలో! ఏయే రంగాలలో ఏయే స్వరూపాలలో తాను కొలువై ఉంటానో వివరిస్తూ.. ‘మోసాలలో నేను జూదం వంటివాడిని’ అంటాడు!! ఈ కొత్త దేవుళ్లందరూ కలసి.. ‘ఛలేన దైవమ్ అస్మి’ అన్నట్టుగా ‘మోసములలో దేవుడు ఉన్నాడు’ అని నిరూపిస్తున్నారు.
..కె.ఎ. మునిసురేష్ పిళ్లె