పవన్ కల్యాణ్ నటించిన బద్రి సినిమాలో ఒక ముచ్చటైన సీన్ ఉంటుంది. తన చెల్లెల్ని పవన్ ప్రేమిస్తున్నాడని తెలిసిన తర్వాత ప్రకాష్ ఆగ్రహంతో అతని ఆఫీసుకు వచ్చి వార్నింగ్ ఇస్తాడు. ‘ఇంకోసారి నా చెల్లెలివైపు చూశావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు’ అంటూ వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు పవన్ కూడా దానికి ఘాటైన కౌంటర్ ఇస్తాడు. ‘ముందు ఏం చేయాలో డిసైడ్ చేసుకో.. ఎందుకంటే అదే జరుగుద్ది’ అంటూ మెడ చుట్టూ చేయి రుద్దుకుంటూ రెచ్చిపోతాడు.
ఇప్పుడు రాజకీయాలను గమనిస్తోంటే.. పవన్ కల్యాణ్ ఆవేశాన్ని చూస్తోంటే.. జెండా అని పేరు పెట్టిన సభలో చంద్రబాబునాయుడుతో కలిసి పంచుకున్న వేదిక మీద ఆయన వేసిన రంకెలను చూస్తోంటే.. ఆ సీనే గుర్తొస్తోంది.
24 సీట్లు మాత్రమే తీసుకున్నందుకు రాష్ట్రంలోని జనం మొత్తం నవ్వుతోంటే.. ఆ గేలి నవ్వులను భరించలేక, అంతకు మించి సీట్లు పొందగల శక్తి తనకు లేక.. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లో కొట్టుమిట్టాడుతున్న పవన్ కల్యాణ్ ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం జగన్ మీద చూపించడం ఈ సభలో స్పష్టంగా కనిపించింది.
‘24 సీట్లు మాత్రమేని అని ఎగతాళి చేస్తున్నారు. బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారు. నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో తెలిసింది. జగన్ ను అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కాదు’ అంటూ పవన్ బహిరంగ వేదికమీదినుంచి సవాలు విసిరారు.
ఈ మాటలే ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. బద్రిలో పవన్ కల్యాణ్ డైలాగును ఇమిటేట్ చేసే విధంగా.. ‘కొత్తగా ఏ పేరు పెట్టుకోవాలో డిసైడ్ చేసుకో.. ఎందుకంటే అదే జరుగుద్ది’ అని వైకాపా శ్రేణులు అంటున్నాయి. ‘నా పేరు పవన్ కాదు..’ అని డిసైడ్ అయిన తర్వాత.. కొత్త పేరు ఏమిటో ఆయన ముందే వెతికిపెట్టుకుంటే మంచిదని హితవు చెబుతున్నారు. సినిమా డైలాగులు సినిమాల్లో మాత్రమే రాణిస్తాయని, రాజకీయాల్లో కాదని అంటున్నారు.
పవన్ కల్యాణ్ ప్రసంగం పూర్తిగా రెగ్యులర్ గా చేసే ఆరోపణలు మాత్రమే. కోట్లు సంపాదించే స్కిల్స్ ఉన్నా కూడా.. అంతా త్యాగం చేసానని, సినిమాల్లో వచ్చే సంపాదనతో ఇంట్లో బియ్యం కొనకుండా హెలికాప్టర్లకు వెచ్చిస్తున్నానని పవన్ పాపం జాలిపలుకులు పలికారు. మరి ఇంట్లో తిండీ తిప్పలకు ఏం చేస్తున్నారో.. ఎక్కడినుంచి తెచ్చిన సొమ్మును ఖర్చు పెడుతున్నారో మాత్రం చెప్పలేదు.
ఇంట్లో బియ్యానికి అయ్యే ఖర్చుతో హెలికాప్టర్లు వచ్చేస్తాయన్నంత సులువుగా ఆయన చెప్పడమే తమాషా. తనను తాను వామనుడి పాదంతో పోల్చుకుంటున్న ఆయన.. అథఃపాతాళానికి తొక్కడం అంటే ఏమనుకుంటున్నారో మాత్రం అర్థం కావడం లేదు.