జనసేనాని పవన్‌కల్యాణ్ విషయంలో రెచ్చగొట్టే చర్యలకి వైసీపీ దిగలేదని ప్రతిపక్షాలకు బాధగా ఉన్నట్టుంది. అందుకే శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సుభద్రాపురం వద్ద జనసేన ఆధ్వర్యంలో నిర్వహించే ‘యువశక్తి’ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉచిత పబ్లిసిటీకి నోచుకోలేదనే ఆవేదన వారిలో కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు అనుకూల మీడియా బరితెగింది… జనసేనాని నిర్వహించే ‘యువశక్తి’ కార్యక్రమానికి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉందనే ప్రచారానికి తెరలేపారు.
పవన్‌కల్యాణ్‌కు అడ్డంకులు సృష్టించాలని, అలాగే యువశక్తి కార్యక్రమాన్ని జరగనివ్వకూడదని ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన నాయకులు కోరుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం జీవో నంబర్-1 తీసుకొచ్చి, సభలు, సమావేశాలు, ర్యాలీలపై కఠిన నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. ఈ జీవోను అడ్డు పెట్టుకుని పవన్‌సభకు అనుమతి ఇవ్వరనే ప్రచారం జరిగింది.
అయితే ప్రతిపక్షాల ఎత్తుగడలను ముందే పసిగట్టిన అధికార పక్షం… వారి ఆశలను నీరుగార్చుతూ ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా అనుమతులు ఇచ్చింది. దీంతో యువశక్తి కార్యక్రమం ప్రచారానికి నోచుకోలేదనే బాధ వారిలో కనిపించింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతి పొందారు. సుమారు ఏడు గంటల పాటు యువత నుంచి జనసేనాని అభిప్రాయాలు సేకరించి, రెండు తీర్మానాలను ఆమోదించనున్నట్టు జనసేన నేతలు చెబుతున్నారు.
జనంలోకి వెళ్లకుండా, పక్క పార్టీ అధినేత చుట్టూ పవన్ తిరుగుతున్నారనేదే ప్రధాన విమర్శ. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా జనసేన బలపడే అవకాశం వుంటుంది. తన పార్టీని పవన్ బలోపేతం చేసుకుంటుంటే ఎవరు అడ్డుపడతారు? ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ ఏం మాట్లాడ్తారో అనే ఉత్కంఠ నెలకుంది. టీడీపీతో పొత్తుపై పవన్ మరింత స్పష్టత ఇస్తారో, లేదో చూడాలి.