తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ ఎట్టకేలకు విజయవాడ చేరుకున్నారు. ఏపీలో ఆయన జాయిన్ అయ్యారు. అనంతరం ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డితో కలిసి సీఎం జగన్ వద్దకెళ్లారు. ప్రస్తుతం జగన్‌తో ఆయన భేటీ అయ్యారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చేరుతారా? వీఆర్ఎస్ తీసుకుంటారా? తదితర ప్రశ్నలను మీడియా నుంచి ఎదుర్కొన్నారు.
వాటన్నింటికి ఆయన కూల్‌గా సమాధానం ఇచ్చారు. ఉన్నతాధికారిగా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తానని స్పష్టం చేశారు. అలాగే వీఆర్ఎస్ తీసుకోవాల్సిన తక్షణ అవసరం లేదన్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా సీఎం జగన్‌తో భేటీ అయిన తర్వాత… తాను నిర్ణయం తీసుకుంటానని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. జగన్‌తో మాట్లాడిన తర్వాత తన విషయంలో ప్రభుత్వ వైఖరి అర్థమవుతుందని, అప్పుడు పని చేయొచ్చా? లేదా? అనే విషయమై స్పష్టత వస్తుందని సోమేశ్ పరోక్షంగా అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది చివరి వరకూ సోమేశ్ కుమార్ పదవీ కాలం వుంది. తనకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తే, కొనసాగాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఏదైనా కారణంతో అప్రాధాన్యం ఉన్న పోస్టు ఇస్తే మాత్రం ఆయన వీఆర్ఎస్ తీసుకునే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో జగన్‌తో భేటీ తర్వాత ఆయన ఏం చెబుతారనే ఆసక్తి నెలకుంది.
వెంటనే ఆయనకు పోస్టింగ్ ఇస్తే మాత్రం సోమేశ్ కుమార్ సేవల్ని వినియోగించుకోవాలనే సానుకూల ఆలోచనలో జగన్ ఉన్నట్టు అర్థం చేసుకోవాల్సి వుంటుంది. నిన్నమొన్నటి వరకూ తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఓ వెలుగు వెలిగిన సోమేశ్‌కుమార్…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆధిపత్య పోరులో బలి కావాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.